ఒక్క రాత్రిలో 50 కోట్లు మటాష్ !
విశాఖ నగరంలో ఈసారి దీపావళి బాణాసంచా విక్రయాలు భారీగా సాగాయి. మూడు రోజుల పాటు జరిగిన వ్యాపారం సుమారు రూ.50 కోట్లకు చేరినట్లు అంచనా. వర్షాలు తగ్గడంతో పాటు స్థానిక ఎన్నికల్లో విజేతల సంబరాలు కూడా తోడవడంతో బాణాసంచాకు భారీ డిమాండ్ ఏర్పడింది. గత ఏడాదితో పోలిస్తే అమ్మకాలు మూడు, నాలుగు రెట్లు పెరిగినట్లు తెలుస్తోంది.
By: Satya P | 9 Nov 2026 6:00 PM ISTయాభై కోట్ల రూపాయలు అంటే చిన్న మొత్తం కాదు. కానీ ఒకే ఒక్క రాత్రి అంత మొత్తం అలా ఖర్చు అయిపోయింది. దేనికోసం అంటే అక్కడే ఉంది తమాషా. దీపావళి బాణాసంచా కోసం విశాఖ నగర జనం కొనుగోలు చేసి రాత్రికి రాత్రి కాల్చేసిన సంగతి అన్న మాట. అలా విశాఖలో యాభై కోట్ల రూపాల దీపావళి సంబరం జరిగింది. నగర వీధులతో పాటు ఆర్కే బీచ్ లో అలాగే కీలక పర్యాటక ప్రాంతాలలో సాగిన ఈ సంబరం ఖరీదు చూస్తే అచ్చంగా 50 కోట్ల రూపాయలు అంటే ఒక విధంగా ఆలోచన కూడా కలుగుతుంది.
భారీ ఎత్తున అమ్మకాలు :
ఈసారి దీపావళి పండుగ జరుగుతుందా అన్న డౌట్లు అంతటా ఉన్నాయి. వరసగా రెండు తుఫాన్లు వచ్చి వెళ్లాయి. దాంతో దీపావళికి రెండు రోజుల ముందు వరకూ మబ్బే మసకేసిన పరిస్థితి. కానీ ఆ చివరి రెండు రోజులే దీపావళి బాణాసంచా విక్రయాలను అమాంతం ఆకాశానికి ఎత్తేశాయి. భారీగా ఈ ఏడాది దీపావళి బాణసంచా మార్కెట్ ఏపీలో అతి పెద్ద నగరం అయిన విశాఖలో సాగింది అని అంటున్నారు. గత ఏడాదితో పోల్చితే అది మూడు నాలుగు రెట్లుగా సాగింది. దాంతో వర్షాలు తగ్గిన వేళ ముసురు వెలసిన వేళ ఆదివారం కూడా తోడు కావడంతో అంబరాన్ని అంటేలా దీపావళి సంబరాలను నగర జనాలు చేసుకున్నారు.
విపరీతంగా డిమాండ్ :
ఈసారి అనేక చోట్ల దీపావళి స్టాళ్లలో జోరుగా అమ్మకాలు సాగాయి. అలా మూడు రోజుల పాటు ఏకబిగిన సాగిన దీపావళి వ్యాపారం చూస్తే 50 కోట్ల రూపాయలుగా లెక్క తేల్సింది. జనాల నుంచి మంచి స్పందన రావడంతో మందుగుండు సామగ్రికి డిమాండ్ ఏర్పడింది. అలా ధరాభారం పెరిగినా కూడా పేదలు మధ్యతరగతి వర్గాలే ఒక్కో ఇంటికీ రెండు వేల రూపాయలు వంతున బాణాసంచా కోసం వెచ్చించారు. దీంతో కోట్ల రూపాయల బిజినెస్ విశాఖలో సాగి కొత్త రికార్డుని నెలకొల్పించి అని అంటున్నారు.
గుర్తుండిపోయేలా :
ఇక ఈసారి స్థానిక ఎన్నికలు కూడా జరిగి ఫలితాలు వెల్లడి కావడంతో విజేతలు అంతా దీపావళి వేళ తమ విజయోత్సవాలను కలిపి చేసుకున్నారు. అలా గత ఏడాది కంటే ఈసారి బేరాలు పెరగడానికి ఇది కూడా మరో కారణంగా చెబుతున్నారు. అదే విధంగా విశాఖలో ఉత్తరాది వారు ఇతర ప్రాంతాల వారు అత్యధికంగా ఉంటారు. ఈ కాస్మోపాలిటన్ సిటీ కల్చర్ వల్ల కూడా దీపావళిని ప్రతీ ఏటా స్పెషల్ సెలబ్రేషన్ గా చేసుకుంటారు. ఈసారి అలా మరింత జోష్ గా పాతిక లక్షల మంది నగర జనాభా జరుపుకోవడంతో యాభై కోట్ల పండుగగా మారింది అని అంటున్నారు.
