విశాఖ మరో గిఫ్ట్... కైలాసగిరికి కొత్త రోప్‌వే
విశాఖలోని కైలాసగిరిపై మరో పర్యాటక ఆకర్షణ అందుబాటులోకి రానుంది. పాత రోప్‌వే స్థానంలో 1.5 కిలోమీటర్ల మేర కొత్త రోప్‌వే నిర్మించేందుకు వీఎంఆర్‌డీఏ కాంట్రాక్ట్ ఖరారు చేసింది. సింగపూర్ తరహాలో శివపార్వతుల విగ్రహం నుంచి 600 మీటర్ల పొడవున లూజ్ గ్రావిటీ రైడ్ కూడా ఏర్పాటు చేయనున్నారు. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి.
By: Satya P | 19 Nov 2026 10:27 AM ISTవిశాఖ పర్యాటకులను ఎప్పటికప్పుడు ఆకర్షిస్తూనే ఉంటుంది. విశాఖ సహజ సిద్ధమైన అందాలకు తోడు అధునాతన సాంకేతికత కూడా తోడు కావడంతో పూర్తి స్థాయిలో సరికొత్త అనుభూతిని పర్యాటకులు పొందుతారు. అలా అనేక టూరిజం ప్రాజెక్టులు విశాఖలో ఉన్నాయి. మరి కొన్ని కూడా ఇపుడు జత చేరనున్నాయి. విశాఖ అంటే అందరికీ ఠక్కున గుర్తుకు వచ్చే టూరిస్ట్ స్పాట్ కైలాసగిరి. ఇక్కడ నుంచి చూస్తే విశాఖ సిటీ అంతా చిన్న బొమ్మరిల్లుగా కనిపిస్తుంది. అలాగే గ్లాస్ స్కైవాక్ బ్రిడ్జి కూడా కైలాసగిరి మీద ఈ మధ్యనే ఏర్పాటు చేశారు. ఇది 55 మీటర్ల పొడవుతో భారతదేశంలోనే అతి పొడవైన కాంటిలీవర్ గ్లాస్ స్కైవాక్ బ్రిడ్జిగా నిలిచింది. సముద్ర మట్టానికి సుమారు వేయి అడుగుల ఎత్తులో 40 మిల్లీమీటర్ల మందంగా ఉండే జర్మన్ గ్లాస్‌తో దీనిని నిర్మించారు. ప్రతీ నిత్యం ఇక్కడకు చేరిన టూరిస్టులు ఎంతో ఆస్వాదిస్తున్నారు. ఇపుడు కొత్త రోప్ వేని నిర్మించేందుకు వీఎంఆర్‌డీఏ సిద్ధపడుతోంది.
లూజ్ గ్రావిటీ రైడ్ :
ఇక ఇదే కైలాసగిరి మీద పాత రోప్‌వే స్థానంలో కొత్తది త్వరలో నిర్మించనున్నారు. పాత రోప్ వేని 2004లో ఏర్పాటు చేశారు. దాంతో ఆ రోప్‌వే ఇరవై ఏళ్ల కాలపరిమితి ముగియడంతో దాని స్థానంలో కైలాసగిరి కొత్త రోప్‌వే నిర్మాణానికి తాజాగా కాంట్రాక్ట్ ఖరారైంది. ఇక కొత్త రోప్‌వేను కైలాసగిరి కొండపై నుండి తెలుగు మ్యూజియం వరకు 1.5 కిలోమీటర్ల మేర విస్తరించనున్నారు. దీంతో పాటు లూజ్ గ్రావిటీ రైడ్ ప్రత్యేకతగా ఉండబోతోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా సింగపూర్ తరహాలో శివపార్వతుల విగ్రహం నుండి 600 మీటర్ల పొడవున లూజ్ గ్రావిటీ రైడ్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీని పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి.
అగ్ర స్థానంలోనే :
విశాఖలో ఇప్పటికే కైలాసగిరి అత్యధిక శాతం పర్యాటకులను ఆకర్షిస్తూ అగ్ర స్థానంలో ఉంది. దాని ఖ్యాతిని మరింతగా పెంచేలా వీఎంఆర్‌డీఏ చర్యలు తీసుకుంటోంది. కూటమి ప్రభుత్వం అయితే అత్యంత ఆకర్షణీయమైన పర్యాటక క్షేత్రంగా రూపొందించాలని చూస్తోంది. దాని కోసం అనేక ప్రణాళికలు రచిస్తోంది. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే విశాఖపట్నం ప్రజలకు లూజ్ గ్రావిటీ రైడ్ సరికొత్తగా పరిచయం కానుంది అని అంటున్నారు.
