విశాఖలో ఎలక్ట్రిక్ బస్సులు...వారికి ఫ్రీగానే !
విశాఖపట్నంలో 30 ఎలక్ట్రిక్ మెట్రో సిటీ బస్సులు ప్రారంభమయ్యాయి. స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఈ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు. కాలుష్యం, ఇంధన ఖర్చులు తగ్గించడమే లక్ష్యంగా పీఎం ఈ బస్ సేవ పథకం కింద వీటిని ప్రవేశపెట్టారు. నగరంలోని మరిన్ని రూట్లకు ఈ సేవలను విస్తరించనున్నారు.
By: Satya P | 17 Nov 2026 12:25 AM ISTవిశాఖలో ఎలక్ట్రిక్ సిటీ బస్సు సర్వీసులు మొదలయ్యాయి. విశాఖ నగరంలో ముప్పయి దాకా ఈవీ మెట్రో బస్సులు ప్రారంభం అయ్యాయి. దీంతో ప్రజా రవాణా వ్యవస్థలో సరి కొత్త శకం స్టార్ట్ అయింది అంటున్నారు. ఈ బస్సులను ప్రవేశపెట్టడం ద్వారా పర్యావరణ హిత ప్రజా రవాణా వ్యవస్థకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అని అంటున్నారు. విశాఖలో నిత్యం కాలుష్యంతో జనాలు ఇబ్బంది పడుతున్నారు. పెరుగుతున్న నగరానికి ప్రజా రవాణా మరింత అవసరంగా మారుతోంది. వీటిని దృష్టిలో ఉంచుకుని ఈవీ బస్సులు విశాఖలో ప్రారంభించారు.
సౌకర్యవంతంగా :
ఈవీ మెట్రో బస్సు సర్వీసులతో పొల్యూషన్ ఎక్కడా ఉండదు, అదే సమయంలో అత్యంత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని ఈ బస్సులు అందిస్తాయని చెబుతున్నారు. దాంతో పాటు శబ్ద కాలుష్యానికి కూడా చెక్ పడుతుంది. ప్రస్తుతానికి కొన్ని ఫీచర్లతోనే విశాఖ వీధులలో ఈవీ బస్సు సేవలు అందుబాటులోకి వచ్చాయి. రానున్న కాలంలో మరిన్ని ఫీచర్లతో ఈవీ బస్సు సేవలను అందిస్తామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.
వారికి ఉచితమే :
ఈవీ మెట్రో బస్సులలో మహిళకు ఉచితంగా ప్రయాణించవచ్చు అని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం కింద మహిళలు అందరికీ ఈవీ బస్సులలో ఫ్రీగా ప్రయాణించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లుగా అధికారులు తెలిపారు. ఈ ముప్పయి ఈవీ మెట్రో బస్సులు విశాఖ నగరంలో వివిధ రూట్లలో తిరిగేలా ప్లాన్ చేశారు. ప్రజల అవసరాలను పరిగణనలోకి తీసుకుని నగరంలో మరిన్ని రూట్లలో ఈవీ మెట్రో బస్ సేవలను విస్తరించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇంధన పొదుపుతో :
కేవలం పర్యావరణ హితమే కాకుండా ఇంధన పొదుపు కూడా ఈవీ బస్సులను ఉపయోగించడం వెనక ఉన్న లక్ష్యంగా ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. విశాఖ నగరంలో చూస్తే ప్రస్తుతం 710కి పైగా సిటీ బస్సులు ఉన్నాయని అంటున్నారు. వీటి ద్వారా ప్రతీ రోజూ ఇంధన ఖర్చులు లక్షలలోనే అవుతోంది.ఈ బస్సులన్నింటికీ కలిపి ప్రతిరోజూ సుమారు 57,000 లీటర్ల డీజిల్ అవసరమవుతోంది. ఏపీలో లీటర్ డీజిల్ ధర 105 పైనే ఉండటంతో ఆర్టీసీపై ప్రతిరోజూ సుమారు 55 లక్షల నుండి 60 లక్షల వరకు కేవలం ఇంధన ఖర్చుల రూపంలోనే భారం పడుతోంది.
పీఎం ఈ బస్ సేవ పధకం :
డీజిల్ ధరల్లో స్వల్ప మార్పులు వచ్చినా అదనంగా లక్షల భారం పడుతోందని చెబుతున్నారు. అందుకే డీజిల్ ఖర్చులను తగ్గించడంతో పాటు కాలుష్యాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం ఈ బస్ సేవ పధకం కింద విశాఖకు ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించారు. మరిన్ని ఈవీ బస్సులు రానున్న రోజులలో వస్తాయని అంటున్నారు. విశాఖ ఆర్టీసీలో మొత్తం ఈవీ బస్సుల వినియోగాన్ని అమలు చేయాలన్న లక్ష్యంతో సంస్థ ముందుకు అడుగులు వేస్తోంది.
