Begin typing your search above and press return to search.

ఇరు పార్టీల‌దీ 'సేవ్ విశాఖ‌' ప్ర‌చార‌మే.. !

విశాఖలో విలువైన‌ భూములను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారంటూ 'సేవ్ విశాఖ' పోస్టర్‌ను విడుదల చేసి వైసీపీ నాయ‌కులు ప్రచారం నిర్వహిస్తున్నారు.

By:  Garuda Media   |   31 Oct 2026 1:32 PM IST
ఇరు పార్టీల‌దీ సేవ్ విశాఖ‌ ప్ర‌చార‌మే.. !
X

గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. 120 వార్డుల్లో అభ్యర్థులు, ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కార్పొరేటర్ ఎన్నికల పోలింగ్ నవంబర్ 1న జరగనుండగా, నవంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అయితే.. ఈ ఎన్నిక‌ల్లో అటు టీడీపీ, ఇటు వైసీపీలు ఒకే నినాదంతో బ‌రిలోకి దిగడం విశేషం. సేవ్ విశాఖ పేరుతో టీడీపీ, వైసీపీ నేత‌లు ప్ర‌జ‌ల‌ను క‌లుస్తున్నారు. వైసీపీ హ‌యాంలో జ‌రిగిన విధ్వంసాన్ని టీడీపీ నేత‌లు.. ప్ర‌స్తుత టీడీపీ కూట‌మి ప్ర‌భుత్వం పై వైసీపీ నేత‌లు విమ‌ర్శ‌లు సంధిస్తున్నారు.

విశాఖలో విలువైన‌ భూములను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారంటూ 'సేవ్ విశాఖ' పోస్టర్‌ను విడుదల చేసి వైసీపీ నాయ‌కులు ప్రచారం నిర్వహిస్తున్నారు. వైసీపీ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి బరిలో ఉన్న నేప‌థ్యంలో ఆమె దీనిని ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్నారు. వైఎస్సార్సీపీ తరపున కేకే రాజు, కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్ తదితరులు వివిధ వార్డుల్లో పర్యటిస్తున్నారు. మరోవైపు, టీడీపీ - జనసేన - బీజేపీ కూటమి తరపున ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పి.విష్ణుకుమార్ రాజు వంటి నేతలు తమ అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం, కార్నర్ మీటింగ్స్ నిర్వహిస్తున్నారు.

ఇరు పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో ప్రచార సరళి ఉదృతంగానే ఉంద‌ని చెప్పాలి. వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి విస్తృతంగా పర్యటిస్తూ దూకుడుగా ప్రచారం నిర్వహించారు. విశాఖలోని విలువైన ప్రభుత్వ భూములను, ప్రభుత్వ ఆస్తులను కూటమి ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతోందని ఆరోపిస్తూ వైసీపీ 'సేవ్ వైజాగ్' (విశాఖను కాపాడుకుందాం) అనే నినాదంతో ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.

ఇక‌, ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీలపై విమర్శలు గుప్పిస్తున్నారు. "కిలో బియ్యం రూ.100, ఎకరా పొలం మాత్రం 99 పైసలు" అంటూ వినూత్నంగా విమర్శలు చేశారు. అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకించడం, ఓ వర్సిటీకి సంబంధించిన భూముల వివాదాన్ని లేవనెత్తడం, మత్స్యకార నివాసాలు, నిరుద్యోగ భృతి, మహిళా పెన్షన్లపై ప్రధానంగా ప్రచారం చేస్తున్నారు.

కూటమి తరఫున టీడీపీ మాజీ కార్పొరేటర్ ముక్కా శ్రావణిని మేయర్ అభ్యర్థిగా బరిలోకి దించి గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. 'చెప్పాం.. చేస్తున్నాం' మంత్రంతోపాటు వైసీపీ నేత‌ల నుంచి సేవ్ విశాఖ అనే పేరుతో ప్ర‌చారం చేస్తున్నారు. అధికారంలో ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వం తాము ఇచ్చిన హామీలను, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లే విధానాన్ని నమ్ముకుంది. 'చెప్పాం.. చేస్తున్నాం' అనే నినాదంతో నగర సమగ్ర అభివృద్ధిని తమ ప్రచార అస్త్రంగా మార్చుకుంది.

మొత్తం 120 వార్డులలో కూట‌మి సీట్ల సర్దుబాటు ప్రకారం టీడీపీ 77, జనసేన 32, బీజేపీ 11 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. స్థానిక జనసేన, బీజేపీ శ్రేణులను కలుపుకుని ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసి ప్రచారం నిర్వహించారు. విశాఖ ఎంపీ ఎం. శ్రీభరత్ విస్తృతంగా సోషల్ మీడియా ప్రచారాన్ని చేపట్టగా, వీఎంఆర్‌డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్, గంటా శ్రీనివాసరావు వంటి సీనియర్ ఎమ్మెల్యేలు స్వయంగా వార్డుల్లో పర్యటించి అభ్యర్థులకు మద్దతుగా ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు.