Begin typing your search above and press return to search.

జనసేనకే డిప్యూటీ మేయర్ పదవి ?

విశాఖ జీవీఎంసీ డిప్యూటీ మేయర్ పదవిని దక్కించుకోవాలని జనసేన భావిస్తోంది. 32 వార్డుల్లో పోటీ చేసి 26 స్థానాలు గెలుచుకున్న ఆ పార్టీ, సామాజిక సమీకరణాలను కూడా పరిగణనలోకి తీసుకుంటోంది. 31వ వార్డు కార్పొరేటర్ మన్యాల శ్రీనివాస్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ నెల 23న డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది.

By:  Satya P   |   10 Nov 2026 12:48 AM IST
జనసేనకే డిప్యూటీ మేయర్ పదవి ?
X

విశాఖ వంటి ప్రతిష్టాత్మకమైన కార్పోరేషన్ లో కీలకంగా వ్యవహరించాలని జనసేన భావిస్తోంది. దాంతో జీవీఎంసీ ఎన్నికల్లో 32 వార్డులు పొత్తులలో భాగంగా తీసుకుని అందులో 26 గెలిచింది. టీడీపీ 64 వార్డులతో పాటు మేయర్ పీఠాన్ని ప్రత్యక్ష ఎన్నికల్లో కైవశం చేసుకుంది. బీజేపీకి 8 సీట్లు దక్కాయి. వైసీపీకి 13 వార్డులు లభిస్తే ఇండిపెండెంట్లు 9 వార్డులలో గెలిచారు. అలాగే సీపీఎం ఒక వార్డులో గెలిచింది. ఈ లెక్క చూసుకుంటే టీడీపీ తరువాత ప్లేస్ లో జనసేన ఉంది అని అంటున్నారు. దాంతో డిప్యూటీ మేయర్ పదవి మీద జనసేన ఫుల్ గా ఫోకస్ పెట్టేసింది అని చెబుతున్నారు.

సామాజిక సమీకరణలు :

ఎటూ సంఖ్యాబలంలో రెండవ స్థానంలో ఉంది కాబట్టి సహజంగానే జనసేనకు డిప్యూటీ మేయర్ ఇస్తారు అని అంటున్నారు. దానికి తోడుగా జీవీఎంసీలో సామాజిక సమీకరణలు కూడా జనసేనకు ఈ కీలక పదవి ఇచ్చేందుకు సరిపోతున్నాయని అంటున్నారు. మేయర్ పదవి టీడీపీకి చెందిన ముక్కా శ్రావణి గెలుచుకున్నారు. ఆమె తూర్పు సామాజిక వర్గానికి చెందిన బీసీ నాయకురాలు. దీంతో మరో బీసీ కి డిప్యూటీ మేయర్ ఇస్తారు అని అంటున్నారు. అందులోనూ జీవీఎంసీలో అధిక జనాభా ఉన్న యాదవులకు ఈ పదవి ఇస్తారు అని ప్రచారం సాగుతోంది. విశాఖ నగరంలో పెద్ద ఎత్తున యాదవ సామాజిక వర్గం ఉండడం ఒక కారణం అయితే మొదటి నుంచి యాదవులకు మేయర్ గానూ డిప్యూటీ మేయర్ గానూ పదవులు ఇస్తూ వస్తున్నారు. అలా గతంలో పలువురు కీలక స్థానాలు అందుకున్నారు. 2021లో వైసీపీ నుంచి హరి వెంకట కుమారి అదే సామాజిక వర్గానికి చెందిన వారుగా ఉన్నారు అని గుర్తు చేస్తున్నారు.

ఇరవై మందిదాకా :

ఇక జీవీఎంసీలో యాదవుల బలం ఎంతలా ఉంది అంటే మొత్తం 120 వార్డులు ఉంటే అన్ని పార్టీల నుంచి 20 మంది దాకా యాదవ సామాజిక వర్గానికి చెందిన కార్పోరేటర్లు గెలిచారు. వీరిలో టీడీపీ జనసేన నుంచి ఎక్కువ మంది ఉన్నారు. జనసేనలో ముగ్గురు గెలిస్తే అందులో 31వ వార్డు నుంచి కార్పోరేటర్ అయిన మన్యాల శ్రీనివాస్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మేయర్ గా మహిళ ఉన్నందున డిప్యూటీ మేయర్ గా పురుషునికి ఇస్తారు అన్న ప్రచారంతో ఆయన రేసులోకి దూసుకుని వచ్చారు. ఈ నెల 23న డిప్యూటీ మేయర్ పదవికి ఎన్నిక జరుగుతుంది. ఈ లోగానే జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎవరు అన్నది తేలిపోతుంది అని అంటున్నారు.

బీజేపీ సైతం :

ఇక ఎనిమిది మంది కార్పోరేటర్లు ఉన్న బీజేపీ నేతలు కూడా డిప్యూటీ మేయర్ పదవిని కోరుకుంటున్నారు. కానీ జనసేనకే ఎక్కువ అవకాశాలు ఉంటాయని అంటున్నారు. ఎందుకంటే విశాఖ కార్పోరేషన్ పరిధిలో జనసేనకు చెందిన ఎమ్మెల్యేలు ముగ్గురు ఉన్నారు. దాంతో పాటుగా ఆ పార్టీకి జీవీఎంసీ ప్రాంతంలో ఉన్న రాజకీయ పట్టు సామాజిక బలాలు సంఖ్యా బలం అవన్నీ పరిగణనలోకి తీసుకుంటే జనసేన నుంచే డిప్యూటీ మేయర్ వస్తారు అని అంటున్నారు.