మీ తాత మా తాత గ్రేట్...లోకేష్ తో ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !
విశాఖలో జరుగుతున్న సీఐఐ సమ్మిట్‌లో నారా లోకేష్, ఉపాసన మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఎన్టీఆర్, డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి వారసత్వాలను ఇద్దరూ గుర్తు చేసుకున్నారు. ఏపీకి 16 నెలల్లో భారీ పెట్టుబడులు తీసుకొచ్చిన లోకేష్‌ను ఉపాసన ‘రాక్ స్టార్ మంత్రి’గా ప్రశంసించగా, ఉపాసన తన తాత వారసత్వాన్ని కొనసాగిస్తున్నారని లోకేష్ కొనియాడారు.
By: Satya P | 13 Nov 2026 9:36 AM ISTఏపీ కూటమిలో యువ మంత్రిగా ఎమర్జింగ్ లీడర్ గా నారా లోకేష్ ఉన్నారు. ఆయన డైనమిక్ మినిస్టర్ గా కూడా ముందుకు సాగుతున్నారు. ఇక ఉపాసన మెగా పవర్ స్టార్ రాం చరణ్ సతీమణి గానే కాకుండా ఒక విజయవంతమైన వ్యాపారవేత్తగా ఆరోగ్య సంరక్షణ నిపుణురాలిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అపోలో హాస్పిటల్స్ గ్రూప్ వ్యవస్థాపకులు డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి మనవరాలిగా ఉపాసన ప్రస్తుతం అపోలో హాస్పిటల్స్‌లో వైస్ ఛైర్పర్సన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరి ఈ ఇద్దరు యంగ్ అండ్ డైనమిక్ పర్సన్స్ కలిసి మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది అన్నది విశాఖలో జరుగుతున్న సీఐఐ సమ్మిట్ వేదిక ఒక ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసింది.
ఎన్టీఆర్ గురించి :
దివంగతులైన ఎన్టీఆర్ నారా లోకేష్ తల్లి తరఫున నుంచి తాత అవుతారు. అలా ఆయన మనవడిగా లోకేష్ ఉన్నారు. అదే విధంగా ఉపాసన తల్లి తరఫున నుంచి డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి తాతగా ఆమెకు ఉన్నారు. ఈ ఇద్దరూ వారి రంగాలలో లెజెండ్స్ గా ఉన్నారు. హాస్పిటల్ రంగంలో డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి చేసిన సేవలు ఎంతో గొప్పవి. ఆయన వారసత్వాన్ని మూడు తరాలుగా కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఆ బాధ్యతలను ఉపాసన చూస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ పొలిటికల్ లెగసీని చంద్రబాబు నారా లోకేష్ కంటిన్యూ చేస్తున్నారు. అందుకే మీ తాత గ్రేట్ మా తాత గ్రేట్ అని ఉపాసన అన్నారు. అంతే కాదు ఎన్టీఆర్ ఆత్మ గౌరవం నినాదాన్ని గుర్తు చేశారు.
ఆంధ్రా నుంచి వచ్చారు :
ఇక ఎన్టీఆర్ కానీ ప్రతాప్ రెడ్డి కానీ ఆంధ్రా నుంచి వచ్చారు అని ఉపాసన లోకేష్ తో చెప్పారు. మీ తాతగారు ఆత్మ గౌరవం అంటే మా తాత గారు ఆత్మ రక్షణ నినాదంతో సాగారు అని ఉపాసన గుర్తు చేశారు. ఎన్టీఆర్ వారసత్వాన్ని ఎలా ముందుకు తీసుకుని వెళ్తున్నారు అని లోకేష్ ని ఉపాసన ప్రశ్నించారు. దానికి లోకేష్ మాట్లాడుతూ మీ తాతగారు డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి చిత్తూరు జిల్లా నుంచి రావడం ఆరోగ్య రంగంలో విశేష సేవలు అందించడం ఆనందకరం అని కొనియాడారు. ఈ రోజున ఆరోగ్య రంగం పాత్ర ఎంతగానో ఉందని లోకేష్ అన్నారు. ఈ రోజున దేశం సుగర్ వ్యాధికి క్యాపిటల్ గా మారుతోందని ఆందోళన వ్యక్తం చేసిన లోకేష్ రోగానికి వైద్యం కంటే ముందే నియంత్రణ ముఖ్యం అన్న దిశగా కూటమి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు.
రాక్ స్టార్ మంత్రి :
ఇక ఏపీని పునర్ నిర్మాణం చేయడం ఒక అవకాశంగా భావిస్తున్నామని లోకేష్ చెప్పారు. గతంలో ఉమ్మడి మద్రాస్ నుంచి ఏపీ విడిపోయినపుడు కర్నూల్ రాజధానిగా ఉండేదని, తరువాత ఉమ్మడి ఏపీకి హైదరాబాద్ రాజధానిగా ఉందని, ఇపుడు అమరావతిని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నామని లోకేష్ చెప్పారు. సవాళ్ళ నుంచే అవకాశాలు వస్తాయని ఆయన అన్నారు. ఇక ఇదే సందర్భంలో తాత డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి వారసత్వాన్ని కొనసాగిస్తునందుకు ఉపాసనను లోకేష్ ప్రశంసించగా నారా లోకేష్‌ను రాక్ స్టార్ మంత్రి అంటూ ఉపాసన ప్రశంసించారు. ఏపీకి 16 నెలల్లో భారీగా పెట్టుబడులు తీసుకొచ్చారని కొనియాడారు. మొత్తానికి చూస్తే సీఐఐ సదస్సులో ఒప్పందాలు డిబేట్లు ఒక ఎత్తు అయితే నారా లోకేష్ ఉపాసనల మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణ మరో ఎత్తు అని అంటున్నారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా ఉంది. మరో వైపు కూటమి ప్రభుత్వంలో పవన్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాం చరణ్ టాప్ స్టార్ గా ఉన్నారు. దీంతో ఇవన్నీ కలిసి మరీ ఈ ఇద్దరి సమావేశానికి సోషల్ మీడియా రీచ్ అధికంగా ఉందని అంటున్నారు.
