బాలయ్య కూతురు అన్ని అనుమానాలు పటాపంచలు చేసింది.. సర్ ప్రైజ్ ఇచ్చేసింది..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విశాఖపట్నం మేయర్ పదవికి ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది.
By: A.N.Kumar | 1 Nov 2026 5:48 PM ISTఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విశాఖపట్నం మేయర్ పదవికి ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన.. ఆర్థికంగా.. సామాజికంగా ప్రాధాన్యమున్న గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) పగ్గాలు దక్కించుకోవడం ప్రతి రాజకీయ పార్టీకి ఎంతో ప్రతిష్టాత్మకం. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల వేళ విశాఖ రాజకీయాల్లో పదవుల పోటీని మించిన ఒక ఆసక్తికరమైన.. సానుకూల పరిణామం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
టీడీపీ తరఫున విశాఖ మేయర్ అభ్యర్థిగా ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్న ముక్కా శ్రావణి పేరును అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి వచ్చి పార్టీ కోసం శ్రమించిన శ్రావణికి ఈ అవకాశం రావడం స్థానిక నేతల్లో.. కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అయితే దీనికంటే ముందు ఈ స్థానంపై ఎంపీ భరత్ భార్య, నందమూరి బాలకృష్ణ కుమార్తె నందమూరి తేజస్విని పోటీ పడతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. దీనిపై ప్రత్యర్థి పార్టీల నుంచి కూడా రకరకాల విమర్శలు.. వ్యాఖ్యలు వినిపించాయి. కానీ శ్రావణి పేరు ఖరారు కావడంతో ఆ ప్రచారాలన్నింటికీ ఒకేసారి తెరపడింది.
ఈ క్రమంలో నందమూరి తేజస్విని తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. స్థానిక ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా విశాఖపట్నం వచ్చిన తేజస్విని.. కేవలం ఓటు వేయడానికే పరిమితం కాలేదు. మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణిని స్వయంగా కలసి.. ఆమెకు తన పూర్తి మద్దతును తెలపడమే కాకుండా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ భేటీలో ఎంపీ భరత్ కూడా పాల్గొని శ్రావణికి భరోసానిచ్చారు. వీరి మధ్య జరిగిన ఆత్మీయ సంభాషణకు సంబంధించిన వీడియోలు.. ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ఈ ఘటనను కేవలం ఒక మర్యాదపూర్వక కలయికగా మాత్రమే చూడలేం. రాజకీయాల్లో పదవుల కోసం అంతర్గత పోటీలు.. వైరుధ్యాలు ఉండటం సహజం. కానీ పార్టీని నమ్ముకుని దశాబ్దాలుగా పనిచేస్తున్న క్షేత్రస్థాయి నాయకులకు అవకాశం వచ్చినప్పుడు, అగ్ర నాయకత్వపు కుటుంబ సభ్యులే స్వయంగా ముందుకు వచ్చి అండగా నిలవడం చాలా అరుదైన దృశ్యం. పదవి తనకే దక్కాలనే పట్టుదల కంటే పార్టీ కోసం శ్రమించిన అభ్యర్థికి దక్కిన అవకాశాన్ని గౌరవించి ప్రోత్సహించడం తేజస్విని వ్యక్తిత్వంలోని ప పరిణతిని ఎత్తిచూపుతోందని పలువురు కొనియాడుతున్నారు.
ఈ పర్యటన ద్వారా తేజస్విని తెలుగుదేశం పార్టీ కేడర్‌కు ఒక స్పష్టమైన రాజకీయ సందేశాన్ని పంపారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. క్రమశిక్షణ.. పార్టీ శ్రేణుల శ్రమకు విలువ ఇవ్వడమే అసలైన రాజకీయం అని నిరూపించిన ఈ ఘటన.. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో సరికొత్త ఉత్సాహాన్ని.. ఐక్యతను నింపింది. రాబోయే జీవీఎంసీ ఎన్నికల వేళ ఈ పరిణామం టీడీపీ శ్రేణులను మరింత బలోపేతం చేస్తుందనడంలో సందేహం లేదు.
