Begin typing your search above and press return to search.

విశాఖ ఓటర్ కి ఏమైంది...సగం తీర్పుగానే !

రాష్ట్రంలో తొలి విడతగా జరిగిన అర్బన్ బాడీస్ ఎన్నికల్లో అన్ని చోట్లా పోలింగ్ బాగానే జరిగింది.

By:  Satya P   |   2 Nov 2026 9:15 AM IST
విశాఖ ఓటర్ కి ఏమైంది...సగం తీర్పుగానే !
X

రాష్ట్రంలో తొలి విడతగా జరిగిన అర్బన్ బాడీస్ ఎన్నికల్లో అన్ని చోట్లా పోలింగ్ బాగానే జరిగింది. అయితే ప్రధాన నగరాలలో మాత్రం మందకొడిగా సాగింది. అందులో ఏపీలోనే అతి పెద్ద కార్పోరేషన్ గా ఉన్న జీవీఎంసీలో సగానికి సగం మాత్రమే పోలింగ్ జరగడం విశేషం. దీంతో 120 వార్డులతో డీలిమిటేషన్ చేసి ప్రజలకు మరింత మెరుగైన పాలన అందించాలని చూసిన చోట ఓటర్ మాత్రం పూర్తి స్థాయిలో నిరాసక్తత ప్రదర్శించారు అని అంటున్నారు. పోలింగ్ బూతులను అందుబాటులో ఉంచారు. సదుపాయాలు ఎన్నో సమకూర్చారు. ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ సిబ్బంది ఎదురు చూసినా ఓటర్ మాత్రం ఆ వైపు కన్నెత్తి అయినా చూడక పోవడం విశేషం.

అతి తక్కువ పోలింగ్ :

దాంతో విశాఖలో అతి తక్కువ పోలింగ్ ఈసారి నమోదు అయింది. మొత్తం 120 వార్డులలోనూ కలుపుకుని 51.47 శాతం పోలింగ్ నమోదు అయింది. అయితే ప్రశాంతంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, ఎన్నికల సంబంధిత ఫిర్యాదులు లేకుండా పోలింగ్ పూర్తి కావడం విశేషం. ఇక చూస్తే కనుక జీవీఎంసీ పరిధిలోని 120 వార్డుల్లో మొత్తం 18,37,901 మంది ఓటర్లకు గాను 9,45,915 మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో 4,55,395 మంది పురుషులు ఉంటే 4,90,519 మంది మహిళలు ఓటు వేశారు. అంటే మహిళకే ఎక్కువగా ఓటింగ్ లో పాల్గొన్నారు అన్న మాట. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 7 గంటల నుంచి 7.15 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగింది. అయినా చివరికి తక్కువ పోలింగ్ శాతమే వచ్చింది. చిత్రమేంటి అంటే 2021 లో జరిగిన ఓటింగ్ కంటే కూడా ఈసారి పది శాతం మేర తగ్గిపోవడం అని అంటున్నారు.

బీచ్ లో మాత్రం :

అయితే చిత్రంగా విశాఖ బీచ్ లో మాత్రం జనంతో ఆదివారం కిటకిటలాడింది. పోలింగ్ ఒక వైపు జరుగుతూంటే జనాలు సేద తీరడానికి బీచ్ ని ఆశ్రయించారు అని అంటున్నారు. విశాఖ నగర పరిధిలోనే ఓటింగ్ తగ్గింది అని నివేదికలు చెబుతున్నాయి. అదే విశాఖలో కొత్తగా కలిసిన ప్రాంతాలు గ్రామీణ చాయలు ఉన్న ప్రాంతాలలో పోలింగ్ బాగానే సాగింది. అక్కడ గట్టిగా పోలింగ్ సాగబట్టే 51 శాతం అయినా నమోదు అయింది అని అంటున్నారు.

ఇవి కూడా కారణాలు :

అయితే ఓటర్లలో అనాసక్తికి మరి కొన్ని కారణాలు కూడా ఉన్నాయని అంటున్నారు. మెజారిటీ ప్రజలకు ఓటర్ స్లిప్పులు అందలేదని చెబుతున్నారు. అలాగే చివరి నిముషంలో చేసిన డీలిమిటేషన్ వల్ల వార్డులు మారడంతో ఎక్కడ తమ ఓటు ఉందో తెలుసుకోలేకపోయారు అని అంటున్నారు. అలాగే మారిన పోలింగ్ బూతులని వెతికే విషయంలో విసుగు చెంది ఓటింగ్ కి దూరం ఉన్నారని అంటున్నారు. అయితే ఇవి ఒక్కటే కాదు చాలా చోట్ల ఓటర్లు అయితే తమ ఓటు వేయకపోయినా ఫలితం ఒక్కటే అన్న ఆలోచనతోనే దూరంగా ఉన్నారని అంటున్నారు. ఇక ఈసారి కొత్తగా ఓటు హక్కు సాధించిన వారు ఎక్కువ మంది జెన్ జీ యువత ఓటు వేయడం జరిగింది. మొత్తం మీద జెన్ జీ యూత్ మహిళలు ఎక్కువగా వేసిన ఈ ఓటింగ్ అలాగే గ్రామీణ ప్రాంతాలలో పడిన ఓటింగ్ అన్నీ కలసి ఫలితాలను ఏ విధంగా తీసుకుని వస్తాయో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.