జనం పట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బహిష్కరణ!
ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌కు పలు గ్రామాల ప్రజలు దూరంగా నిలిచారు. రోడ్లు, తాగునీరు, వైద్యం, విద్య వంటి కనీస సౌకర్యాలు కల్పించకపోవడం, పోలింగ్ కేంద్రాల మార్పు, రిజర్వేషన్ల వివాదాలపై నిరసనగా సామూహికంగా ఎన్నికలను బహిష్కరించారు. విశాఖ, చిత్తూరు, అనంతపురం, అల్లూరి, తిరుపతి, అనకాపల్లి జిల్లాల్లోని పలు గ్రామాల్లో ఈ నిరసనలు కనిపించాయి. కొన్ని చోట్ల గ్రామంలోని ఓటర్లంతా ఓటింగ్‌కు దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది.
By: Garuda Media | 6 Nov 2026 2:52 PM ISTఅధికార కూటమి, సహా ఇతర పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ను రాష్ట్రంలోని పలు గ్రామాలకు చెందిన ప్రజలు వివిధ సమస్యల కారణంగా బహిష్కరిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ ప్రాంతాల్లో కనీస సౌకర్యాల లేమి, పోలింగ్ కేంద్రాల మార్పు, రిజర్వేషన్ల వివాదం, తారు రోడ్ల నిర్మాణానికి ఇచ్చిన హామీలు నెరవేర్చక పోవడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఓటర్లు పోలింగ్ ప్రక్రియకు దూరంగా నిలిచారు.
ఎక్కడెక్కడ?
1) విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం రాయనిపేట గ్రామంలోని చెరువు కాలుష్య సమస్యకు అధికారులు, ప్రజాప్రతినిధులు ఏళ్ల తరబడి శాశ్వత పరిష్కారం చూపడం లేదని ఇక్కడి ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో ఉన్న మొత్తం 120 ఓట్లకు గాను ఓటర్లందరూ ఏకగ్రీవంగా ఎన్నికల పోలింగ్‌ను బహిష్కరించారు.
2) చిత్తూరు జిల్లాలోని ఐరాల మండలం అబ్బుగుండు గ్రామానికి కనీస రహదారి సౌకర్యం, తాగునీరు, అంగన్‌వాడీ కేంద్రం వంటి కనీస వసతులు కల్పించలేదని నిరసిస్తూ ఇక్కడి ప్రజలు ఓటింగ్‌కు పూర్తిగా దూరంగా ఉన్నారు. వాటిపై హామీ ఇచ్చినా నెరవేర్చడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
3) అనంతపురం జిల్లాలోని నెరమెట్ల గ్రామంలో స్థానిక సమస్యల పరిష్కారం కోసం ఈ గ్రామానికి చెందిన ప్రజలు కూడా ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ను బహిష్కరిస్తూ సామూహిక నిర్ణయం తీసుకున్నారు. రహదారులు, తాగునీటి సౌకర్యం, ఉపాధి కల్పన వంటివాటిని పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యేలు, మంత్రుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
4) అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం, గన్నేరు పుట్టు పంచాయితీ, గొప్పు గరువు, పొర్లు గ్రామాల గిరిజనులు సరైన రోడ్డు సౌకర్యం లేదని, జబ్బులు జ్వరాలు వస్తే ప్రాణాలు పోతున్నాయని, వైద్యం, విద్యా, రవాణా లేకా అవస్తలు పడుతున్న ప్రభుత్వం,అధికారులు ,ప్రజా ప్రతినిధులు పట్టించు కోవటం లేదని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో తమ ప్రాంతానికి తారు రోడ్డు మంజూరు అయ్యేంత వరకు ఎన్నిక ల్లో పాల్గొన బోమని, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు బహిష్కరిస్తునట్లు ప్రకటించారు.
5) తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం మామిడిగుంట ఎస్సీ కాలనీ ఓటర్లు ఎప్పటి నుంచో సమీపంలోనే ఉన్న పిల్లమేడు కేంద్రంలో ఓటు వేస్తున్నారు. అయితే.. ఈసారి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న దయనేడు కేంద్రానికి మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు.. అంత దూరం వెళ్లలేమంటూ.. పోలింగ్‌ను బహిష్కరించారు.
6) తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలంలోని వినాయకపురం గ్రామం: దాదాపు 40 ఏళ్లుగా కొనసాగుతున్న పోలింగ్ కేంద్రాన్ని అకస్మాత్తుగా మార్చడాన్ని నిరసిస్తూ గ్రామస్తులు స్వచ్ఛందంగా పోలింగ్ ప్రక్రియకు దూరంగా ఉండిపోయారు.
7) అనకాపల్లి జిల్లా, అనకాపల్లి మండలంలోని రొంగలివానిపాలెం గ్రామంలో సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్‌ను తొలుత బీసీకి కేటాయించి, ఆ తర్వాత మార్పులు చేయడంపై గ్రామస్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ రిజర్వేషన్ల మార్పును వ్యతిరేకిస్తూ గ్రామంలోని సుమారు 800 మంది ఓటర్లు పోలింగ్‌లో పాల్గొనకుండా బహిష్కరించారు.
