యలహంక ఆస్తుల వివాదం.....విజయసాయి హాట్ కామెంట్స్
జగన్, షర్మిల మధ్య యలహంక ప్యాలెస్ ఆస్తి వివాదంపై వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి స్పందించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు తనకు, కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావుకు తెలుసని వెల్లడించారు. అయితే కుటుంబ విషయాలను బహిరంగంగా మాట్లాడటం నైతికం కాదని, అన్నాచెల్లెళ్లు కూర్చుని సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు.
By: Satya P | 25 Nov 2026 11:25 PM ISTబెంగళూరులోని యలహంక ప్యాలెస్ వివాదం, జగన్ వర్సెస్ షర్మిల మధ్య ఆస్థుల గొడవలు వీటి మీద వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ వి విజయసాయిరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఢిల్లీలో ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ తనకు ఈ వివాదానికి సంబంధించి అన్నీ తెలుసు అని చెప్పడం విశేషం. అయితే తాను బాహాటంగా చెప్పడం బాగోదని అన్నారు. ఇక జగన్ షర్మిల వివాదం పూర్తిగా వారి వ్యక్తిగతమైనదిగా ఆయన పేర్కొన్నారు. అందువల్ల వారు కూర్చుని పరిష్కరించుకోవాలని సలహా ఇచ్చారు.
సమంజసం కాదేమో :
ఒకరి కుటుంబ వ్యవహారాల గురించి పత్రికా సమావేశంలో ఓపెన్ గా మాట్లాడుకోవడం సమంజసం కాదేమో అని ఆయన అన్నారు. తాను ఈ విషయాల మీద మాట్లాడడం సబబు కాదని పదే పదే మీడియా ప్రశ్నలకు ఆయన జవాబు దాటవేశారు. ప్రతీ కుటుంబంలో సమస్యలు ఉంటాయని వాటిని సామరస్యంగా ఎవరైనా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. ఈ వివాదాలకు సంబంధించిన పూర్తి వివరాలు తనకు తెలుసు అని ఆయన అన్నారు. అయితే తాను చెప్పదలచుకోలేదని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అంతే కాదు తనకు మాత్రమే కాదు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావుకు కూడా అన్నీ తెలుసు అని చెప్పారు.
నైతికత కాదంటూ :
తనకు వైఎస్సార్ కుటుంబానికి సంబంధించిన మొత్తం వివరాలు తెలుసు అంటూనే వాటిని బయట పెట్టడం నైతికత కాదని విజయసాయిరెడ్డి అంటున్నారు. మరి యలహంక ఎస్టేట్ చుట్టూనే ఇప్పుడు మొత్తం వ్యవహారం సాగుతోంది. అది కాస్తా అన్నా చెల్లెళ్ల మధ్య రాద్ధాంతంగా మారింది. ఏపీలో అతి పెద్ద రాజకీయ చర్చగా కూడా ఇది ఉంది. ఇంత జరుగుతున్న వేళ విజయసాయిరెడ్డి మాత్రం దీని మీద స్పందించను అంటూనే మొత్తం మ్యాటర్ తెలుసు అని హింట్ ఇచ్చారు. దాంతోనే ఆసక్తి అందరిలో ఒక్కసారిగా పెరిగిపోతోంది.
మరింత ఆసక్తిగానే :
నిజంగా ఎలహంక ప్యాలెస్ వివాదంలో ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అన్నది మీడియా తరచి చూస్తోంది. షర్మిల అయితే ఆస్తి హక్కులు అన్నీ తమకు ఉన్నాయని గతంలో ప్రకటించారు. అయితే కోర్టు ద్వారా ఇంజక్షన్ ఆర్డర్లు ప్రస్తుతం అక్కడ ఉన్నాయి. దాంతో షర్మిల అక్కడ అడుగు పెట్టడానికి వీలు లేకుండా పోయింది. మరి షర్మిల వాదిస్తున్నట్లుగా ఆమెకు ఉన్న హక్కులు ఏమిటి అన్నది ఒక ప్రశ్న అయితే ఈ ఆస్తి మొత్తం వైఎస్ జగన్ సతీమణి భారతి తల్లిది అని కూడా చెబుతున్నారు. ఇలా ఆలోచిస్తే ఆ ఆస్తి వివాదం మీద మీడియా అయితే చర్చిస్తోంది కానీ అన్నీ తెలిసిన వారు అయితే ఎవరూ లేరు, కానీ తనకు అన్నీ తెలుసు అన్న విజయసాయిరెడ్డి పెదవి విప్పడానికి నిరాకరిస్తున్నారు. సో ఈ వివాదంలో ఆయన కామెంట్స్ అయితే సంచలనంగా మారాయని అంటున్నారు.
