Begin typing your search above and press return to search.

ఎవరీ జగన్ మోహన్... విజయసాయి నోట అదే పిలుపు !

మాజీ వైసీపీ నేత విజయసాయిరెడ్డి తన ప్రెస్‌మీట్లలో వైఎస్ జగన్‌ను ‘జగన్ మోహన్ గారు’ అని సంబోధించడం చర్చనీయాంశంగా మారింది. గతంలో జగన్ మతం, పేరులోని ‘రెడ్డి’ అంశంపై విమర్శలు చేసిన ఆయన.. ఇప్పుడు అదే పేరును కొత్తగా పలుకుతున్నారు. దీని వెనుక రాజకీయ వ్యూహం ఉందా? ఒక సామాజిక వర్గానికి సంకేతాలు ఇస్తున్నారా? అన్న చర్చ సాగుతోంది.

By:  Satya P   |   26 Nov 2026 11:08 AM IST
ఎవరీ జగన్ మోహన్... విజయసాయి నోట అదే పిలుపు !
X

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ని ప్రత్యర్ధులు సెటైరికల్ గా ఎన్నో విమర్శలు చేస్తూ ఉంటారు. అదే సమయంలో సీరియస్ కామెంట్స్ చేసినపుడు ఆయన పూర్తి పేరునే వాడుతారు. అయితే వైఎస్సార్ కుటుంబంతో మూడు తరాలుగా దశాబ్దాల పాటు అనుబంధం పెనవేసుకున్న మాజీ వైసీపీ నేత మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మాత్రం జగన్ పేరుని సరికొత్తగా పలుకుతున్నారు. నిజానికి జగన్ గురించి ఆయన కంటే వేరే ఎవరికైనా ఎక్కువగా తెలుస్తుంది అనుకుంటే పొరపాటే. జగన్ వైసీపీ స్థాపించినప్పుడు ఆయన వెంట ఉండిన వారు, వైసీపీలో నంబర్ టూ స్థానాన్ని అందుకున్న వారు విజయసాయిరెడ్డి. ఇపుడు ఆయన సొంతంగా పార్టీ పెట్టారు. షార్ట్ కట్ లో ఆ పార్టీ పేరు పీఆర్ పీ. ఈ పార్టీ పెట్టక ముందు నుంచి కూడా ఆయన జగన్ ని టార్గెట్ చేస్తున్నారు. ఇక జాగ్రత్తగా గమనిస్తే జగన్ పేరుని ఆయన కొత్తగా పలుకుతున్న తీరు ఆలోచింపచేస్తోంది.

ఎందుకలా అంటూ :

ఇదిలా ఉంటే ఇటీవల ప్రెస్ మీట్లలో జగన్ పేరుని విజయసాయిరెడ్డి పలికినపుడు జగన్ మోహన్ గారు అని అంటున్నారు. లేటెస్ట్ గా ఢిల్లీలో జరిగిన ప్రెస్ మీట్ లో సైతం ఆయన అదే అన్నారు. సాధారణంగా జగన్ ని విమర్శించిన వారు ప్రత్యర్ధులు సైతం జగన్మోహన్ రెడ్డి అని పూర్తి పేరునే పలుకుతారు. లేదా జగన్ అని షార్ట్ కట్ లో కూడా పలుకుతారు. కానీ విజయసాయిరెడ్డి మాత్రం జగన్ మోహన్ అని అంటున్నారు. వినడానికి కూడా ఇది వింతగా కొత్తగా ఉంది. మరి ఆయన ఎందుకు ఇలా పిలుస్తున్నారు అన్నదే చర్చగా ఉంది.

వ్యూహాత్మకమేనా :

జగన్ క్రిస్టియన్ మత విశ్వాసాలు కలిగిన వారు అన్నది తెలిసిందే. దానిని విజయసాయిరెడ్డి కూడా ఈ మధ్య కాలంలో అనేక సార్లు చెప్పుకొచ్చారు. ఆ మతంలో కులాల ప్రసక్తి ఉండదని అన్నారు. ఆ మతంలో ఉంటూ రెడ్డి అని పేరు పెట్టుకోవడమేంటి అని కూడా ప్రశ్నించారు. ఇది ఆ సామాజిక వర్గాన్ని మభ్యపెట్టడమే అని కూడా గతంలో ఆయన ఘాటు విమర్శలు చేశారు. ఇపుడు ఆయన పీఆర్పీ అధినేతగా తాను ఏదైతే చెప్పారో అదే కొనసాగిస్తూ జగన్ మోహన్ రెడ్డిలో చివరిది కట్ చేసి జగన్ మోహన్ అని పిలుస్తున్నారు అని అంటున్నారు. ఆ విధంగా సంభోదించడం ద్వారా ఒక బలమైన సామాజిక వర్గానికి ఆయన పరోక్షంగా సందేశం ఇస్తున్నారా అన్నది కూడా చర్చ సాగుతోంది.

వర్కౌట్ అవుతుందా :

చెప్పాలంటే ఈ మధ్యన రాజకీయాల్లోకి బాహాటంగా కులాలు మతాలు చొచ్చుకుని వచ్చాయి కానీ గతంలో ఇవేమీ ఉండేవి కావు. అప్పట్లో సీఎంలుగా మంత్రులుగా పనిచేసిన వారు కూడా కొందరు ఇతర మతాలకు చెందిన వారే అని గుర్తు చేస్తున్నారు. అయినా వారి పూర్తి పేర్లు హిందువులలోని కులాలను గుర్తు చేసేవిగానే కొనసాగించేవారు. అయితే జగన్ ని రాజకీయంగా ప్రత్యర్ధులు టార్గెట్ చేసినపుడు ఈ ప్రస్తావనలు ఎక్కువగా తీసుకుని రావడం జరుగుతోంది అని అంటున్నారు. ఇపుడు విజయసాయిరెడ్డి జగన్ పేరుని కొత్తగా పలికినా దాని వల్ల ప్రత్యేకంగా ఏమైనా ఒనగూడేది ఉంటుందా అన్నది కూడా చర్చిస్తున్నారు.