విజయసాయిరెడ్డి క్లాస్...పార్టీ పేరూ క్లాసే !
వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తన కొత్త పార్టీకి ‘పరివర్తన రాజనీతి పార్టీ’ (పీఆర్పీ)గా పేరు ప్రకటించారు. రాజకీయాల్లో మార్పు తీసుకురావడమే లక్ష్యమని చెబుతున్న ఆయన, కొత్త పార్టీలో చేరే నేతలు ఎవరు, క్లాస్ ఇమేజ్‌తో ప్రజల్లోకి ఎలా వెళ్తారన్నది ఆసక్తికరంగా మారింది.
By: Satya P | 11 Nov 2026 11:46 AM ISTమొత్తానికి వైసీపీ మాజీ ఎంపీ మాజీ వైసీపీ నేత అయిన వి విజయసాయిరెడ్డి తన కొత్త పార్టీ పేరుని ప్రకటించారు. ఆ పార్టీకి పరివర్తన రాజనీతి పార్టీగా పేర్కొన్నారు. అంటే షార్ట్ కట్ లో పీఆర్పీ అన్నమాట. ఇక చూస్తే ఈ పార్టీ పేరు చాలా క్లాసిక్ టచ్ లో ఉంది అని అంటున్నారు. దాంతో కొత్త పార్టీ పేరు మీదనే అంతటా చర్చ సాగుతోంది. పరివర్తన రాజనీతి అన్నది చూస్తే కనుక కొత్త మార్పుని తీసుకుని వచ్చే ఉద్దేశ్యంతో ఆయన ఈ పార్టీ పెట్టారు అని చెప్పకనే చెబుతోంది. అయితే రాజకీయాల్లో పరివర్తన అన్నది ఎన్నికల్లో ప్రజలు వేసే ఓటు ద్వారానే వస్తుందా లేక రాజకీయ నాయకులలో మార్పు ద్వారా వస్తుందా అన్నది ఒక కీలకమైన చర్చనీయాంశం.
ముందు నుంచి చెబుతున్నదే :
ఇక విజయసాయిరెడ్డి అయితే ముందు నుంచి ఒకే మాట చెబుతున్నారు. రాజకీయాల్లో మార్పు అవసరం అని. అది నాయకుల నుంచి రావాలని అంటున్నారు. ఆ విధంగా తన పార్టీ ద్వారా ఆయన రాజకీయ మార్పుని కోరుకుంటున్నారు అని పేరుతోనే చెప్పేశారు. అంతవరకూ అయితే స్పష్టంగానే ఉంది. మరి పార్టీలో చేరే వారు ఎవరు అన్నది చూడాల్సి ఉంది. ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి వచ్చి చేరే వారిని తీసుకుంటే కనుక పరివర్తన కాదు కొత్త సీసాలో పాత సారా అన్నట్లుగా ఉంటుందని అంటున్నారు. చూడబోతే వైసీపీ మాజీ నేతలు ద్వితీయ తృతీయ శ్రేణి నేతలు కొందరు ఈ పార్టీలో చేరుతున్నారు. మరి పాత నాయకులను చేర్చుకుని కొత్త పార్టీ అంటే విజయసాయిరెడ్డి చెప్పినట్లుగా పరివర్తన ఎలా వస్తుంది అన్నది చూడాల్సి ఉంది.
మాస్ ఇమేజ్ తోనే :
మరో వైపు రాజకీయాలు ప్రజలతో నేరుగా సంబంధం ఉన్నవి. అందువల్ల జన సమూహంలో కలిసి పోవాలంటే మాస్ టచ్ అవసరం. విజయసాయిరెడ్డి చూస్తే క్లాస్ ఇమేజ్ ఉన్న నాయకుడు. ఆయన రాజ్యసభకు నెగ్గిన ఎంపీగానే ఉన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో జనం ఓట్లతో గెలిచిన వారు కాదు. ఆయన తెర వెనక నేతగా గుర్తింపు పొందారు. ఇపుడు ఆయన తెర ముందుకు వచ్చి పార్టీ పెట్టారు. అలా ఆయన క్లాస్ ఇమేజ్ తోనే జనంలోకి వస్తున్నారు. మరి ఆయన పార్టీ పేరు చూస్తే అది కూడా క్లాస్ టచ్ తోనే ఉంది అని గుర్తు చేస్తున్నారు. నాయకుడూ క్లాస్ ఇమేజ్ తో ఉండి పార్టీ పేరు కూడా క్లాస్ గా ఉంటే మాస్ తో నడిచే పాలిటిక్స్ లో ఇంధనం ఎలా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.
క్యాచీగా ఉండాలి :
పార్టీ పేరు క్యాచీగా ఉంటే బాగుండేది అన్న చర్చ కూడా వస్తోంది. ఏపీలో ప్రస్తుతం ఉన్న పార్టీలు అయితే జనాలకు కనెక్ట్ అయ్యేలా టైటిల్స్ తో ఉన్నాయి. అలాగే ప్రముఖ నాయకులకూ ప్రాంతానికి సామాజిక వర్గానికి సమాజానికి కనెక్ట్ అయి ఉన్నాయి. విజయసాయిరెడ్డి పరివర్తన రాజనీతి పార్టీ అయితే ఏం చేయబోతోంది అన్నది అంతా పేరులోనే చెబుతోంది. మరి ఇది ఒక విధంగా కొత్త రకం పేరుగానే చూడాలి. అయితే జనాలు ఈ కొత్త పేరుని కొత్త పార్టీని ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా ప్రజాస్వామ్యంలో ఎంత పోటీ ఉంటే అంత మేలు జరుగుతుంది. ఎన్ని ఆప్షన్లు ప్రజలకు ఉంటే అంతగా ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. అందువల్ల కొత్త పార్టీలు ఎవరు పెట్టినా స్వాగతించాల్సిందే అన్నది ప్రజాస్వామ్య ప్రేమికుల మాటగా ఉంది.
