రాధా ప్రయాణం.. కొంత కలివిడి - మరింత విడివిడి.. !
విజయవాడ మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన వంగవీటి రాధాకు టీడీపీలోని కీలక నేతల గైర్హాజరు ఇబ్బందిగా మారింది. ఎంపీ కేశినేని చిన్ని మినహా ఎమ్మెల్యేలు బొండా ఉమా, గద్దె రామ్మోహన్ అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఈ అసంతృప్తిని తగ్గించి రాధాకు మద్దతు పెంచేందుకు బుద్ధా వెంకన్న వనభోజనాల పేరుతో సమన్వయ ప్రయత్నాలు ప్రారంభించారు.
By: Garuda Media | 28 Nov 2026 10:10 PM ISTవిజయవాడ నగర మునిసిపల్ కార్పొరేషన్ మేయర్‌గా తొలిసారి పగ్గాలు చేపట్టిన వంగవీటి రాధా కృష్ణన్ కు ఆదిలో నే ఇబ్బందులు ఎదురయ్యాయి. గతానికి భిన్నంగా అందరినీ కలుపుకొని పోతానని ఆయన చెబుతున్నా.. క్షేత్రస్థా యిలో ఇంకా పరిస్థితులు కుదుట పడలేదు. ఎంపీ కేశినేని చిన్ని ఒక్కరు మాత్రమే టీడీపీ తరఫున రాధా అధికారిక కార్యక్రమాలకు హాజరు కావడం.. మిగిలి ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు(విజయవాడలో) కార్యక్రమాలకు డుమ్మా కొట్టడం వంటివి రాధా వర్గానికి ఇబ్బందిగా మారాయి.
రాధాకు మద్దతు పలికేందుకు.. మంత్రి నారా లోకేష్ చెప్పే వరకు కూడా చాలా మంది నాయకులు వెనుకాడిన పరిస్థితి ఉంది. సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా తన వారసుడికి ఈ సీటును రిజర్వ్ చేసుకుందామని అనుకున్నా.. జనసేన పొత్తులో భాగంగా దీనిని టీడీపీ వదులుకుంది. దరిమిలా.. బొండా ఉమా.. రాధా కార్యక్రమాలకు గైర్హాజ రయ్యారు. ప్రమాణ స్వీకారం నుంచి మేయర్‌గా బాధ్యతలు చేపట్టే వరకు కూడా ఉమా కానీ, ఆయన వర్గం కానీ దూరంగానే ఉండిపోయింది. ఇక, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూడా రాధా కార్యక్రమాలకు హాజరు కాలేదు.
మెజారిటీ బలం..
టీడీపీకి సంఖ్యాపరంగా కార్పొరేటర్లు ఎక్కువగా ఉన్నారు. మొత్తం 86 మంది కార్పొరేటర్లు ఉండగా.. వీరిలో 57 మంది టీడీపీ వారే ఉన్నారు. వీరు కూడా.. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు బలపరిచిన అభ్యర్థులు కావడం గమనా ర్హం. దీంతో భవిష్యత్తులో రాధా ఏ నిర్ణయం తీసుకున్నా.. మెజారిటీ కార్పొరేటర్లుగా ఉన్న టీడీపీ వారు మద్దతు ప్రకటించాల్సి ఉంటుంది. వైసీపీకి సంఖ్యాపరంగా తక్కువగానే ఉన్న నేపథ్యంలో టీడీపీ ఆధిపత్యం తప్పదు. ఈ విషయాన్ని గమనించిన రాధా సర్దుకుపోయే ధోరణిలోనే ఉన్నట్టు తెలుస్తోంది.
అయితే, ఆదిలోనే ఇలా కీలక నాయకులు అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానం అందిన తర్వాత కూడా.. డుమ్మా కొట్టడం.. ఇటు జనసేన, అటు టీడీపీలోనూ చర్చకు దారితీసింది. ప్రస్తుతం ఈ విషయంపై ఇరు పార్టీల్లోనూ చర్చ సాగుతోంది. లోపం కన్నా ముందు అసంతృప్తిని తగ్గించే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే వన భోజనాల పేరుతో ఆదివారం(ఈనెల 29న) టీడీపీ నేత బుద్ధా వెంకన్న సమన్వయ రాజకీయాల కు తెరదీశారు. తద్వారా.. రాధాకు కలివిడి పెంచే ప్రయత్నాలు సాగుతున్నాయి. మరి ఇవి ఏమేరకు సక్సెస్ అవుతాయో చూడాలి.
