Begin typing your search above and press return to search.

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

టీడీపీ, వైసీపీ, జనసేనల్లో అధినేతలకు, క్షేత్రస్థాయి నేతలకు మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. క్రమశిక్షణ తప్పే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నా, రాజకీయ అవసరాల దృష్ట్యా వెనక్కి తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. కొత్త రాజకీయ వేదికలు అందుబాటులో ఉండటంతో నేతలపై కఠిన చర్యలకు బదులుగా హెచ్చరికలతోనే సరిపెడుతున్నారనే చర్చ సాగుతోంది.

By:  Garuda Media   |   19 Nov 2026 3:33 PM IST
ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?
X

వైసీపీ, టీడీపీ, జ‌న‌సేన‌.. ఈ మూడు పార్టీల అంత‌ర్గ‌త వ్య‌వ‌హారం చూస్తే.. ఒకింత ఆశ్చ‌ర్యం వేస్తుంది. దాదాపు.. ఈ మూడు పార్టీలు అత్యంత కీల‌కం. అధికారంలోకి వ‌చ్చే విష‌యంలో ఈ మూడు పార్టీల చుట్టూ ప్ర‌జ‌ల ఓటు బ్యాంకు కూడా ముడి ప‌డింది. అయితే.. ఈ మూడు పార్టీల్లోనూ అధినేత‌ల‌కు - క్షేత్ర‌స్థాయిలో కొంద‌రు నాయ‌కుల‌కు మ‌ధ్య విభేదాలు కొన‌సాగుతున్నాయి. కీల‌క‌మైన ఎన్నిక‌ల స‌మ‌యంలో నాయ‌కులు అధిష్టానం చెప్పిన‌ట్టు కాకుండా.. త‌మ త‌మ ఇష్టానుసారం వ్య‌వ‌హ‌రిస్తున్నాయి.ఈ నేప‌థ్యంలో అలాంటి వారిపై చర్య‌లు ఉంటాయ‌ని చెబుతున్నా.. అలా చేయ‌లేక ఇబ్బందిప‌డుతున్నారు.

టీడీపీ, వైసీపీ, జనసేన మూడు పార్టీలు కూడా అధిష్టానం మాట వినని, క్రమశిక్షణ తప్పే నాయకులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామ‌ని చెబుతున్నారు. ఆయా పార్టీల అధినేతలు తమ వ్యూహాలు, ఎన్నికల అవసరాలకు అనుగుణంగా వేర్వేరు పద్ధతుల్లో హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కానీ, పెద్ద‌గా చ‌ర్య‌లు తీసుకునే ప‌రిస్థితి అయితే క‌నిపించ‌డం లేదు. అధికారంలో ఉన్నందున కూటమి సమన్వయం, ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతినకుండా చూడాల‌ని టీడీపీ,జ‌న‌సేన ప్ర‌య‌త్నిస్తున్నాయి.

ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కూటమి అభ్యర్థులకు వ్యతిరేకంగా బరిలోకి దిగిన రెబల్ అభ్యర్థుల విష‌యాన్ని తీసుకుంటే.. కొంద‌రిపై చ‌ర్య‌లు తీసుకున్నా.. త‌ర్వాత‌.. వెన‌క్కి త‌గ్గిన ప‌రిస్థితి ఉంది. తప్పు చేస్తే సహించేది లేదని బహిరంగంగానే హెచ్చరిస్తూ చర్యలు తీసుకుంటున్నామ‌ని అంటున్నా.. మ‌రోవైపు నాయ‌కుల విష‌యంపై బెంగా కొన‌సాగుతోంది. ఇదే ప‌రిస్థితి వైసీపీలోనూ ఉంది. ఒక‌ప్పుడు త‌న మాట‌కు ఎదురు చెప్పిన వారిని వెంట‌నే బ‌య‌ట‌కు పంపేసిన ప‌రిస్థితి జ‌గ‌న్ అవ‌లంభించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యర్థుల ఏకగ్రీవాలను అడ్డుకోలేక పోయినా, క్షేత్రస్థాయి ప్రచారంలో నిర్లక్ష్యం వహించినా వచ్చే సాధారణ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వబోమని నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లకు జగన్ అల్టిమేటం జారీ చేశారు. కానీ, ఎంత మంది ఆయ‌న చెప్పిన‌ట్టు చేశారు? అంటే.. చెప్ప‌డం క‌ష్ట‌మే. దీంతో ఇప్పుడు వారిపై చ‌ర్య‌లు తీసుకుంటారా ? వేచి చూస్తారా? అనేది ప్ర‌శ్న‌. ఎలా చూసుకున్నా.. టీడీపీ, జ‌న‌సేన‌, వైసీపీలు చ‌ర్య‌లు తీసుకునే ప‌రిస్థితి లేదు.

కేవ‌లం హెచ్చ‌రిక‌ల‌ తోనే స‌రిపుచ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఎందుకంటే.. రాజ‌కీయంగా వేదిక‌లు పెరుగుతున్నాయి. కొత్త‌పార్టీలు పుట్టుకొస్తున్నాయి. దీంతో తీవ్ర హెచ్చ‌రిక‌లు చేసినా.. పార్టీ నుంచి బ‌య‌ట‌కు పంపేసినా.. అల్ట‌ర్నేట్ అవ‌కాశం నాయ‌కుల‌కు క‌నిపిస్తోంది. దీంతో మూడు పార్టీల్లోనూ మెత్త‌టి చ‌ర్య‌లే త‌ప్ప‌.. గ‌ట్టిగా హెచ్చ‌రించే ప‌రిస్థితి లేద‌ని అంటున్నారు.