Begin typing your search above and press return to search.

పవన్ కోసం.. టీడీపీ, వైసీపీ ఒకే మాట!

పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడిపోతున్నారనే వార్తల నేపథ్యంలో టీడీపీ, వైసీపీ ఆసక్తికర నిర్ణయం తీసుకున్నాయి. నేతలు, కార్యకర్తలు రాజకీయ నాయకుల వ్యక్తిగత జీవితాలపై కామెంట్స్ చేయొద్దని రెండు పార్టీలు సూచించాయి. అభ్యంతరకర పోస్టులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఐటీడీపీ హెచ్చరించగా, వ్యక్తుల ప్రైవసీని గౌరవించాలని వైసీపీ కోరింది.

By:  M Prashanth   |   10 Nov 2026 3:06 PM IST
పవన్ కోసం.. టీడీపీ, వైసీపీ ఒకే మాట!
X

ఏపీ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకే అభిప్రాయంతో ఉండటం చాలా అరుదు. ముఖ్యంగా టీడీపీ, వైసీపీ మధ్య రాజకీయ విమర్శలు ఏ స్థాయిలో ఉంటాయో తెలిసిందే. అలాంటిది ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తల విషయంలో రెండు పార్టీల నుంచి దాదాపు ఒకే తరహా ప్రకటనలు రావడం ఆసక్తికరంగా మారింది. వ్యక్తిగత విషయాలపై కామెంట్స్ చేయొద్దంటూ తమ పార్టీ శ్రేణులకు సూచనలు జారీ చేశాయి.




పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడిపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు కనిపిస్తున్నాయి. గతంలో పవన్ పెళ్లిళ్లపై రాజకీయ ప్రత్యర్థులు పలుమార్లు విమర్శలు చేశారు. ముఖ్యంగా వైసీపీ నేతలు ఎన్నికల సమయంలో ఈ అంశాన్ని ప్రస్తావించిన సందర్భాలున్నాయి. అయితే ఇప్పుడు అదే పార్టీ వ్యక్తిగత వ్యవహారాలపై ఎవరూ కామెంట్స్ చేయొద్దని చెప్పడం విశేషం.




వైసీపీ తన నాయకులు, అధికార ప్రతినిధులు, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులకు నాలుగు సూచనలు చేసింది. రాజకీయ నాయకుల వ్యక్తిగత విషయాలపై బహిరంగంగా వ్యాఖ్యలు చేయొద్దని పేర్కొంది. అలాంటి పోస్టులపై స్పందించవద్దని, వాటిని షేర్ చేయవద్దని సూచించింది. సంబంధిత వ్యక్తుల ప్రైవసీని గౌరవించాలని కోరింది.

మరోవైపు ఐటీడీపీ కూడా ఇదే అంశంపై ప్రకటన ఇచ్చింది. అయితే ఇందులో మరో ఆసక్తికరమైన పాయింట్ ఉంది. కేవలం కూటమి పార్టీల నేతలే కాకుండా వైసీపీ నాయకుల వ్యక్తిగత జీవితాలపై కూడా కామెంట్స్ చేయొద్దని స్పష్టం చేసింది. ఐటీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా ఖాతాల నుంచి అలాంటి వ్యాఖ్యలు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. వ్యక్తులు చేసే అభ్యంతరకరమైన కామెంట్స్‌తో తమకు సంబంధం లేదని పేర్కొంది.

నిజానికి గత కొన్నేళ్లుగా టీడీపీ, వైసీపీ మధ్య వ్యక్తిగత విమర్శలు కూడా ఎక్కువగానే కనిపించాయి. పవన్ పెళ్లిళ్ల అంశంతో పాటు చంద్రబాబు కుటుంబం, జగన్ వ్యక్తిగత వ్యవహారాలను కూడా రాజకీయ విమర్శల్లో ప్రస్తావించిన సందర్భాలున్నాయి. సోషల్ మీడియాలో రెండు పార్టీల మద్దతుదారుల మధ్య ఇలాంటి పోస్టులు తరచూ కనిపిస్తుంటాయి. అలాంటి పరిస్థితుల్లో రెండు వైపుల నుంచి ఒకేసారి ఈ తరహా ప్రకటనలు రావడం హైలెట్ అవుతోంది.

అయితే ఈ ప్రకటనలు ఎంతవరకు అమలవుతాయనేది మరో అంశం. ఐటీడీపీ నేరుగా క్రమశిక్షణ చర్యల గురించి హెచ్చరించగా, వైసీపీ మాత్రం తమ శ్రేణులకు సూచనలు ఇచ్చింది. ఇప్పటికే సోషల్ మీడియాలో వ్యక్తిగత విమర్శలు చేసినవారిపై చర్యలు తీసుకున్నట్లు ఈ ప్రకటనల్లో పేర్కొనలేదు. ఇక పవన్ వ్యక్తిగత జీవితంపై వస్తున్న రిపోర్ట్స్ విషయంలో జనసేన నుంచి నేరుగా ఎలాంటి వివరణ రాలేదు. ఇక పవన్ కూడా ఈ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇస్తారా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.