గుడివాడలో అగ్గి రాజుకుంటోంది... కోస్తాంధ్రాలో మరో తాడిపత్రి !
గుడివాడలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, వైసీపీ మధ్య రాజకీయ ఘర్షణలు తీవ్రరూపం దాల్చాయి. మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము వర్గాల మధ్య వాగ్వాదాలు, రాళ్ల దాడులు, జెండాల దహనం చోటుచేసుకుంటున్నాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు పలు వార్డుల్లో పికెటింగ్ ఏర్పాటు చేసి ప్రచారంపై ఆంక్షలు విధించారు.
By: Satya P | 24 Nov 2026 11:52 PM ISTఢీ అంటే ఢీ అన్న చోట రాజకీయం మంట రాజుకుంటుంది. అది అంతకంతకు పెరిగిపోతూ హీటెక్కించేస్తూనే ఉంటుంది. రెండు పార్టీలు రెండు జెండాలు రెండు వర్గాలు ఇలా నిలువునా చీలిపోయాక ముఖా ముఖీకి సై అన్నాక రావణ కాష్టం అవుతుంది. దానికి అనంతపురం జిల్లాలో తాడిపత్రి ఒక ఉదాహరణ అయితే గుడివాడ అదే రూట్ లో సాగుతోంది అంటున్నారు. తాడిపత్రిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిల మధ్య నువ్వా నేనా అన్నట్లుగానే ఉంటుంది. రాళ్ల దాడుల నుంచి పెట్రో బాంబుల దాడుల దాకా తాడిపత్రి రాజకీయం రచ్చ చేసి ఎగిసి పడుతుంటే గుడివాడ డిటో అన్నట్లుగానే పరిస్థితి ఉందని అంటున్నారు.
గుడివాడ ఫైట్ లో :
గుడివాడ అంటే మాజీ మంత్రి వైసీపీ నేత కొడాలి నాని అడ్డా అన్నది ఆ పార్టీ నేతల అభిమానుల మాటగా ఉంటుంది. వరసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మూడేళ్ళ పాటు మంత్రిగా ఇరవై ఏళ్ళ పాటు ఎమ్మెల్యేగా రాజ్యం చేసిన కొడాలి నాని అనూహ్యంగా 2024 లో ఓటమి చెందారు. ఆయనను ఓడించింది ఎన్నారైగా ఉన్న వెనిగండ్ల రాము. అప్పట్లో కూటమి ప్రభంజనంలో ఆయన భారీ మెజారిటీతో కొడాలి నానిని ఓడించేశారు. ఈ మధ్య కాలం అంతా టీడీపీయే అక్కడ కనిపించింది. నాని ఎక్కువ కాలం హైదరాబాద్ లో ఉండడంతో ఆయన గుడివాడకు బహు దూరం అని అంతా అనుకున్నారు. కానీ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా గుడివాడలో పట్టు నిలుపుకునేందుకు కొడాలి నాని గట్టిగానే టీడీపీని ఢీ కొంటున్నారు. దాంతో టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా గుడివాడ ఫైట్ ముదురుతోంది.
బాహాబాహీకి :
గుడివాడ మున్సిపాలిటీ మీద ఏ పార్టీ జెండా ఎగరాలి అన్న దాని మీద పంతం పట్టి మరీ రెండు వైపులా రాజకీయ సమరమే సాగుతోంది. ఈ క్రమంలోనే రెండు వైపులా మోహరించి ఉన్న సీన్ కనిపిస్తోంది. ఆ వైపు ఈ వైపు చేరితే తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంటోంది. కార్యకర్తలు అయితే ఎదురుబొదురు నిలిచి రాళ్ల దాడికి పాల్పడుతున్నారు. అలా మాజీ ఎమ్మెల్యే కొడాలి వర్సెస్ టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల అన్నట్లుగా దూసుకొస్తున్నాయని అంటున్నారు.
పట్టు కోసమే :
గుడివాడలో కొడాలి నానిని ఓడించిన వెనిగండ్ల తన పట్టుని నిలుపుకునేందుకు గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. అధికారం ఉంది, అంగబలం అర్థ బలం కూడా ఉంది దాంతో ఆయన దూకుడు చేస్తున్నారు అని అంటున్నారు. అయితే రెండు దశాబ్దాలు ఏలిన చోట 2024 లో పట్టు జారిందని కొడాలి నాని తగ్గడం లేదు, తిరిగి తాను అక్కడ కుదురుకోవాలని పట్టుదలగా చూస్తున్నారు. దాంతో మున్సిపల్ ఎన్నికలు అయితే అగ్గి రాజేస్తున్నాయని అంటున్నారు. ఇలా రెండు వర్గాలు పంతాలు పట్టింపులతో రెచ్చిపోతున్న తీరుతో కోస్తా నడిబొడ్డు రాజకీయం రీసౌండ్ చేస్తోంది. ఇక టీడీపీ ఎక్కడ ప్రచారం చేస్తుందో అక్కడకి వైసీపీ రంగంలోకి దిగిపోతోంది. అలాగే వైసీపీ ప్రచారం చేస్తున్న వార్డులలో టీడీపీ క్యాడర్ దూసుకుని వస్తోంది. ఇలా ఒకే చోట రెండు పార్టీలు చేరితే రణరంగమే తలపిస్తోంది అని అంటున్నారు.
జెండాలు మండుతున్నాయి :
ఈ ఘర్షణల మధ్య ఈ వీరంగాల మధ్య రెండు పార్టీల జెండాలు తగలబడుతున్నాయి. టీడీపీ నేతలు వైసీపీ జెండాలకు నిప్పంటిస్తూంటే వైసీపీ వారు ఏకంగా టీడీపీ జెండాలను చింపి చీలిక పీలికలు చేస్తున్నారు. అంతే కాదు పరస్పరం విమర్శలు ఘాటెక్కిపోతున్నాయి. దాంతో పోలీసులు మరింతగా వ్యవహారం ముదిరిపోతోంది అని గ్రహించి అనేక వార్డులలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. కేవలం ప్రచారానికి అభ్యర్థులు వారి వెంట ఒక అయిదుగురు మాత్రమే ఉండాలని పోలీసులు ఆంక్షలు విధించారు. అయితే ఇదంతా మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని తెర వెనక నడిపిస్తున్నారని అంటున్నారు. అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా ఏమీ తీసిపోవడం లేదని అంటున్నారు. మొత్తం మీద గుడివాడ లో పచ్చగడ్డి వేయకపోయినా భగ్గుమంటోంది. కోస్తాంధ్రాలో మరో తాడిపత్రిగా మారింది అంటున్నారు.
