Begin typing your search above and press return to search.

చీపురుపల్లి మీద కన్ను ...బొత్సతో చిన్న శ్రీను డైరెక్ట్ ఫైట్ ?

వైసీపీ నుంచి టీడీపీలో చేరిన చిన్న శ్రీనుకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. విజయనగరం జిల్లా అధ్యక్ష పదవి ఆయనకు దక్కవచ్చని, 2029 ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ సొంత నియోజకవర్గం చీపురుపల్లి నుంచి పోటీ చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

By:  Satya P   |   28 Nov 2026 9:18 AM IST
చీపురుపల్లి మీద కన్ను ...బొత్సతో చిన్న శ్రీను డైరెక్ట్ ఫైట్ ?
X

విజయనగరం జిల్లా రాజకీయాలలో రెండు దశాబ్దాలకు పైగా కొనసాగుతూ పట్టు సాధించిన వారు చిన్న శ్రీను. ఆయన కాంగ్రెస్ వైసీపీలలో ఉన్నపుడు జిల్లాలో అతి ముఖ్య పాత్ర పోషించారు. ఆయనకు ఉమ్మడి విజయనగరం జిల్లాలో ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ అణువణువూ తెలుసు. అన్ని చోట్లా ఆయన అనుచర గణం ఉన్నారు. ఆయన అభిమాన జనం ఉన్నారు. ఇక అంగబలం అర్ధబలం విషయంలో చిన్న శ్రీనుకు ధీటైన నేత లేరని అంటున్నారు. వ్యూహ రచనలో ఆయన బొత్సకు సరిసాటి అని చెబుతున్నారు. ఇవన్నీ తెలిసిన మీదటనే ఆయనను వైసీపీ నుంచి దూరం చేసి టీడీపీ అక్కున చేర్చుకుంది. రానున్న రోజులలో చిన్న శ్రీనుకు టీడీపీలో మరింత కీలక పాత్ర దక్కుతుందని ప్రచారంలో ఉంది.

జిల్లా అధ్యక్షుడిగా ;

ఎటూ స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసాయి. ఇక జిల్లాలో పార్టీని గాడిన పెడుతూ 2029 నాటికి సిద్ధం చేయాల్సి ఉంది. అందుకే టీడీపీ చిన్న శ్రీనుకు జిల్లా పగ్గాలు అప్పగిస్తుంది అని అంటున్నారు. ప్రస్తుతం ఈ బాధ్యతలను కిమిడి నాగార్జున చూస్తున్నారు. ఆయనకు డీసీసీబీ చైర్మన్ పదవి ఇచ్చారు. అలా జోడు గుర్రాల స్వారీ ఆయన చేస్తున్నారు. దాంతో ఇపుడు చిన్న శ్రీనుకు జిల్లా బాధ్యతలను అప్పగిస్తే ఆయన మరింత మంది వైసీపీ నేతలను టీడీపీ గూటికి రప్పిస్తారని వైసీపీ గుట్టూ మట్టూ ఎరిగిన నేతగా ఆయన జిల్లా పదవిలో ఉంటే ఎంతో రాజకీయ లాభం సమకూరుతుందని కూడా పార్టీ పెద్దలు భావిస్తున్నారు అని అంటున్నారు.

బొత్స ఇలాకాలోనే :

ఇక జిల్లా అధ్యక్ష బాధ్యతలు కనుక చిన్న శ్రీను తీసుకుంటే వచ్చే ఎన్నికల్లో ఆయన ఎక్కడ నుంచి పోటీ చేయాలనుకున్నా చేయగలరు అని అంటున్నారు. అయితే చిన్న శ్రీను కన్ను చీపురుపల్లి మీద ఉందని అంటున్నారు. అది వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సొంత ఇలాకా. ఆయన అయిదు సార్లు పోటీ చేసి మూడు సార్లు గెలిచారు. గెలిచిన ప్రతీ సారీ మంత్రి కూడా అయ్యారు. అలా ఆయనకు రాజకీయ సెంటిమెంట్ కూడా ఈ సీటు. అయితే చిన్న శ్రీనుకు కూడా అక్కడ బంధు గణం అనుచర గణం దండీగానే ఉంది అని అంటున్నారు. అందువల్ల 2029 ఎన్నికలలో అక్కడ నుంచే ఆయన పోటీ చేస్తారు అని ఊహాగానాలు పెద్ద ఎత్తున ప్రచారంలో ఉన్నాయి.

కిమిడికి చెక్ చెబుతారా :

సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కిమిడి కళా వెంకట రావుకు చెక్ చెబుతారా అన్నది కూడా ప్రచారంలో ఉన్న మరో వార్త. ఆయన ఇటీవల జరిగిన పరిషత్తు ఎన్నికల్లో తన కోడలుని గరివిడి నుంచి పోటీకి పెట్టి ఓటమిని చూశారు. దాంతో పాటు ఆయన 2029 నాటికి పోటీ చేయరని ఆయన కుమారుడి కోసం సీటు కోరుతారు అని అంటున్నారు. కానీ బొత్స మీద కిమిడి ఫ్యామిలీ పోటీకి దిగితే ఇబ్బంది అవుతుందని అందుకే చిన్న శ్రీను వంటి దిగ్గజాన్నే రంగంలోకి దింపుతారు అని అంటున్నారు. అదే కనుక జరిగితే మామ మేనల్లుడు ఒకే చోట నుంచి డైరెక్ట్ ఫైట్ కి సిద్ధపడతారు అని అంటున్నారు. అపుడు జిల్లాలోనే కాదు ఏపీలోనే చీపురుపల్లి హాట్ సీటు అవుతుందని కూడా అంచనా కడుతున్నారు. మొత్తానికి చూస్తే వైసీపీ నుంచి టీడీపీలో చేరిన చిన్న శ్రీను స్థానిక సంస్థల ఎన్నికల్లో తన సత్తా చాటి తిరుగులేని విజయాన్ని టీడీపీకి దక్కించారు అన్నది హైకమాండ్ కి ఉందని అందుకే ఆయనకు పార్టీలో మరింత ప్రాధాన్యత ఇస్తారని అంటున్నారు.