Begin typing your search above and press return to search.

పతులు ఎమ్మెల్యేలు...సతులు ఊరి పెద్దలు !

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. ఎమ్మెల్యేలుగా ఉన్న భర్తల అండతో వారి భార్యలు స్థానిక ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. అయ్యన్నపాత్రుడు సతీమణి పద్మావతి నర్సీపట్నం మున్సిపల్ చైర్‌పర్సన్‌గా, బండారు మాధవీలత వెన్నెలపాలెం సర్పంచ్‌గా, కూన రవికుమార్ భార్య ప్రమీల ఆమదాలవలస మున్సిపల్ చైర్‌పర్సన్‌గా పోటీ చేస్తున్నారు.

By:  Satya P   |   18 Nov 2026 9:04 AM IST
పతులు ఎమ్మెల్యేలు...సతులు ఊరి పెద్దలు !
X

ఏ పురుషుడి విజయం వెనక అయినా మహిళల సహకారం ఉంటుంది అన్నది ఒక సామెత. అంతే కాదు అనేక సందర్భాలలో అదే నిజం. భర్తకు విజయం చేకూరాలని పూజలు చేసి అతనికి నిండు బలం ఇచ్చి బయటకు పంపించే ఇల్లాళ్ళ వల్లనే వారు విజేతలుగా గెలుచుకుని వస్తారు. అలాంటి పతులు ఇపుడు సతీమణుల వెనక నిలబడుతున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. భర్త వెనక భార్య కాదు, భార్య వెనక కూడా భర్త నిలబడి విజయోస్తూ అని దీవించి రాజకీయ రణక్షేత్రం లోనికి పంపుతున్నారు. అలా ఎన్నికల్లో గెలిచి రావాలని మనసారా ఆశీర్వదిస్తున్నారు.

ఉత్తరాంధ్రాలో ట్రెండ్ :

ఇక ఉత్తరాంధ్రా జిల్లాలలో చూసుకుంటే ఇపుడు కొత్త ట్రెండ్ సాగుతోంది. భర్తలు ఎమ్మెల్యేలుగా ఉంటే భార్యలు వారు ఉన్న సొంత ఊరికే పాలకులు అవుతున్నారు. అలా స్థానిక ఎన్నికల్లో ఎన్నడూ చూడని సన్నివేశాలు ఈసారి కనిపిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో చూస్తే ఉమ్మడి విశాఖ జిల్లాలోని నర్సీపట్నం మునిసిపల్ చైర్ పర్సన్ పదవిని స్థానిక ఎమ్మెల్యే, స్పీకర్ కూడా అయిన అయ్యన్నపాత్రుడి సతీమణి పద్మావతి పోటీ చేసి బంపర్ విక్టరీ కొట్టారు. ఏకంగా 40 వార్డులు ఉన్న నర్శీపట్నంలో 39 వార్డులు కూటమి పరం అయ్యాయి అంటే పద్మావతికి ఎదురులేదని స్పష్టం అయింది. అలా అయ్యన్నపాత్రుడు సొంత ఊరుని పాలించే చాన్స్ ఆయన సతీమణి సంపాదించుకున్నారు.

సీనియర్ ఎమ్మెల్యే భార్య :

ఇక ఇపుడు చూస్తే అదే టీడీపీకి చెందిన మరో సీనియర్ నేత మాడుగుల ఎమ్మెల్యే, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి సతీమణి మాధవిలత పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం పరవాడ మండలం వెన్నెలపాలెం పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ల్ దాఖలు చేశారు. కూటమికి చెందిన నాయకులతో పాటు మహిళలు యువత అంతా కలసి రాగా ఆమె భారీ ర్యాలీగా వెళ్ళి మరీ తన నామినేషన్ దాఖలు చేశారు. వెన్నెలపాలెం పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తాను అని ఈ సందర్భంగా మాధవీలత హామీ ఇచ్చారు. మాధవీలత బండారు సతీమణి మాత్రమే కాదు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అత్తగారు కూడా. బండారు మాధవీలతల రెండవ కుమార్తె రామ్మోహన్ భార్య అన్నది తెలిసిందే.

అక్కడ ఆమె పోటీ :

ఇక శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మున్సిపాలిటీ చైర్ పర్సన్ గా కూటమి తరఫున స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్ సతీమణి ప్రమీల తన నామినేషన్ దాఖలు చేశారు. ఆమె సైతం ర్యాలీగా వెళ్ళి మరీ నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఆముదాలవలసలో ప్రస్తుతం ఉన్న సానుకూల వాతావరణం నేపధ్యంలో కూన ప్రమీల విజయం నల్లేరు మీద నడక అని చెబుతున్నారు. ఇలా పతులు ఎమ్మెల్యేలు అయిన చోట సతులు సొంత ఊళ్ళలో రాజ్యాధికారం అందుకోవడం ఒక విధంగా విశేష పరిణామంగానే చెబుతున్నారు.