మంత్రిగారు.. స్పీకర్‌గారూ.. టీడీపీలో ఇంట్రస్టింగ్ డిబేట్.. !
ఏపీ స్థానిక ఎన్నికల్లో మంత్రులు, ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులు కీలక పదవులు దక్కించుకున్నారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భార్య హరిత చిన్నమండెం ఎంపీపీగా, ఆయన సోదరుడు లక్ష్మీప్రసాద్ రెడ్డి జెడ్పీటీసీగా గెలిచారు. మరోవైపు స్పీకర్ అయ్యన్నపాత్రుడు భార్య పద్మావతి నర్సీపట్నం మున్సిపల్ చైర్‌పర్సన్‌గా 11,455 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దీంతో టీడీపీలో కుటుంబ రాజకీయాలపై చర్చ మొదలైంది.
By: Garuda Media | 20 Nov 2026 10:57 PM ISTస్థానిక ఎన్నికల్లో పలువురు ప్రజాప్రతినిధుల కుటుంబాలకు చెందిన వారు పోటీ చేయడం తెలిసిందే. అయితే.. వీరిలో కొందరు గెలిచారు. మరికొందరు ఓడారు. తాజాగా ఈ వ్యవహారంపై పార్టీలో చర్చ సాగుతోంది. మంత్రి మండి పల్లి రాంప్రసాద్ రెడ్డి సతీమణి మండిపల్లి హరిత అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని చిన్నమండెం మండల పరిషత్ అధ్యక్షురాలిగా(ఎంపీపీ) ఎన్నికయ్యారు. ఈ నెల 23న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో మంత్రి రాంప్రసాద్ రెడ్డిని చంద్రబాబు అభినందించారని అంటున్నారు.
వాస్తవానికి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల సందర్భంగా చిన్నమండెం మండలంలోని పడమటికోన ఎంపీటీసీ స్థానానికి మంత్రి తల్లి సుశీల, భార్య హరిత నామినేషన్లు దాఖలు చేశారు. అయితే.. మంత్రి మాతృమూర్తి సుశీల.. అనూహ్య పరిణామాల నేపథ్యంలో తన నామినేషన్ ఉపసంహరించుకోగా, హరిత బరిలో నిలిచి గెలిచారు. చిన్నమండెం మండలంలోని పది ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవం కాగా, హరిత ఎంపీపీ పదవిని చేపట్టనున్నారు.
ఇక, అదే ఎన్నికల్లో మంత్రి రాంప్రసాద్ రెడ్డి సోదరుడు లక్ష్మీప్రసాద్ రెడ్డి చిన్నమండెం జెడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందారు. దీంతో ఒకేఫ్యామిలీలో ముగ్గురు ప్రజాప్రతినిధులు ఉన్నట్టు అయింది. భార్య, తమ్ముడు సహా మంత్రి మండపల్లి కూడా నియోజకవర్గంపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇది వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు దోహద పడుతుందన్న చర్చ టీడీపీలో ఎక్కువగా సాగుతోంది. ఇక, స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సతీమణి చింతకాయల పద్మావతి నర్సీపట్నం మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఘనవిజయం సాధించారు.
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పురపాలక సంఘం ఎన్నికల్లో టీడీపీ కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె, తన సమీప వైసీపీ నేత, తోడికోడలిపై 11,455 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కుటుంబ సభ్యుల మధ్యే ప్రధాన పోటీ నెలకొనడంతో నర్సీపట్నం ఫలితాలు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించాయి. చింతకాయల పద్మావతికి మొత్తం 23,028 ఓట్లు పోలయ్యాయి. చింతకాయల అనితకు 11,573 ఓట్లు వచ్చాయి. ఈమె అయ్యన్న పాత్రుడు సోదరుడు చింతకాయల సన్యాసి పాత్రుడు భార్యకావడంతో ఈ స్థానానికి ఎనలేని ప్రాధాన్యం ఏర్పడింది.
ఈ విషయంపై కూడా టీడీపీలో చర్చ సాగుతోంది. భార్య జడ్పీటీసీ, కుమారుడు విజయ్ రాజ్యసభ సభ్యుడు.. స్వయంగా అయ్యన్న స్పీకర్ కావడం గమనార్హం. ఒకే ఫ్యామిలీలో ముగ్గురు కూడా రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉండడం గమనార్హం.
