Begin typing your search above and press return to search.

జెడ్పీ పీఠం కోసం జనసేన...వైరిచర్ల వారసుడికి అందేనా ?

ఉత్తరాంధ్రలో ఆరు జడ్పీ పీఠాలకు గాను అల్లూరి జిల్లా పరిషత్‌ను వైసీపీ కైవసం చేసుకుంది. మిగిలిన ఐదింటిలో జనసేనకు మరో రెండు కేటాయించాల్సి ఉండటంతో పార్వతీపురం మన్యం, అనకాపల్లి పీఠాలపై చర్చ జరుగుతోంది. మన్యం పీఠాన్ని జనసేన కోరుతుండగా, టీడీపీ నుంచి గెలిచిన వైరిచర్ల వీరేశ్ చంద్రదేవ్‌కు అధిష్ఠానం హామీ ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది.

By:  Satya P   |   14 Nov 2026 8:59 AM IST
జెడ్పీ పీఠం కోసం జనసేన...వైరిచర్ల వారసుడికి అందేనా ?
X

ఉత్తరాంధ్రాలో ఉన్న ఆరు జడ్పీ పీఠాలలో ఒకటి వైసీపీ గెలుచుకుంది. అల్లూరి జిల్లా జెడ్పీ చైర్మన్ పదవిని పూర్తి మెజారిటీతో వైసీపీ సాధించుకుంది. దాంతో జనసేనకు ఆ జిల్లా పీఠం కేటాయిస్తారు అన్న ప్రచారం నేపధ్యంలో అక్కడికి ఆదిలోనే కధ వేరు అయింది. దాంతో మిగిలిన అయిదు జెడ్పీ పీఠాలలో రెండింటిని జనసేనకు ఎక్కడ ఎలా అడ్జస్ట్ చేయాలన్నది కూటమిలో చర్చగా ఉంది. విజయనగరం విశాఖ రెండు జెడ్పీ పీఠాలూ టీడీపీకే అని స్పష్టం అయింది. దాంతో మరో మూడు ఉన్నాయి. అందులో శ్రీకాకుళం జెడ్పీ పీఠం జనసేనకు పొత్తులో కేటాయించారు. ఆ రెండవది ఎక్కడ అన్నదే చర్చగా ఉంది.

మన్యం మీదనే మనసు :

ఇక అనకాపల్లి జెడ్పీ లేదా పార్వతీపురం మన్యం జిల్లా జెడ్పీ పీఠాలలో ఒకటి జనసేనకు ఇవ్వాల్సి ఉంది. ఇందులో మన్యం పీఠం మీద జనసేన మనసు ఉందని అంటున్నారు. ఎందుకంటే గిరిజన ప్రాంతాలలో పవన్ పంచాయతీ రాజ్ మంత్రిగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అలాగే పాలకొండ ఎస్టీ అసెంబ్లీ సీటుని జనసేన 2024 ఎన్నికల్లో గెలుచుకుంది. ఉత్తరాంధ్రాలో ఉన్న మరిన్ని ఎస్టీ ఎమ్మెల్యే సీట్లలో బలం పెంచుకుంటే 2029 ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తోంది. దీంతో మన్యం జెడ్పీ పీఠాన్ని తమకు ఇవ్వాలని జనసేన పట్టుబడుతోంది అని అంటున్నారు.

ఆ కుటుంబానికి హామీ :

అయితే పార్వతీపురం మన్యం జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం ఎస్టీ జనరల్‌కు రిజర్వ్ కావడంతో ఈ పదవి కోసం కురుపాం జడ్పీటీసీ స్థానం నుంచి టీడీపీ తరఫున గెలుపొందిన వైరిచర్ల వీరేశ్‌ చంద్రదేవ్‌ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఆయనకు అధిష్టానం హామీ ఇచ్చిందని కూడా అంటున్నారు. కురుపాం నియోజకవర్గం వైసీపీకి కంచుకోట. అలాంటి ప్రాంతంలో టీడీపీని బలోపేతం చేసినందుకు వైరిచర్ల కుటుంబ సభ్యులకు జిల్లా పరిషత్తు చైర్మన్ పదవి ఇస్తామని గతంలోనే టీడీపీ అధిష్ఠానం హామీ ఇచ్చింది అని అంటున్నారు. ఇక వీరేశ్‌ చంద్ర దేవ్ ది ప్రముఖ రాజకీయ కుటుంబం. ఆయన సొంత పెదనాన్న వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఎన్నో సార్లు ఎంపీగా కూడా గెలిచారు. ఇక ఆయన తండ్రి ప్రదీప్ చంద్రదేవ్ ఎంపీగా చేశారు. ఆయనకు విజయనగరం పూసపాటి రాజులతో బంధుత్వం ఉంది. ఇలా చూస్తే అన్ని విధాలుగా వీరేశ్‌ చంద్రదేవ్‌ కి అండదండలు ఉన్నాయి.

అనకాపల్లి ఇవ్వాల్సిందే :

ఒకవేళ పార్వతీపురం మన్యం జిల్లా పీఠం ఇవ్వకపోతే అనకాపల్లి జనసేనకు ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ కూడా తమ్ముళ్ళు తమకే జెడ్పీ పీఠం దక్కాలని పట్టుబడుతున్నారు. దాంతో జనసేనకు ఉత్తరాంధ్రాలో శ్రీకాకుళం ఒక్కటి ఇచ్చి ఊరుకుంటారా లేక రెండవది ఎక్కడ అన్న ప్రశ్నలు వస్తున్నాయి. పొత్తులో భాగంగా మొత్తం 28 జడ్పీ పీఠాలలో 5 జనసేనకు కేటాయిస్తున్నారని తెలుస్తోంది. అందులో పల్నాడు, శ్రీ సత్యసాయి, తూర్పు గోదావరి జిల్లాలు ఉన్నాయని అంటున్నారు. ఇక్కడ కూడా శ్రీ సత్యసాయిలో జనసేనకు కాదని టీడీపీ పట్టుబడుతోంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.