Begin typing your search above and press return to search.

పంచాయ‌తీ ఫ‌లితం: వైసీపీ పుంజుకుందా?

ఏపీలో తొలి దశ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కూటమి మద్దతుదారులు ఆధిక్యం సాధించారు. మొత్తం 3,949 పంచాయతీలకు గాను 760 ఏకగ్రీవం కాగా, వీటన్నింటినీ టీడీపీ, జనసేన మద్దతుదారులు దక్కించుకున్నారు. పోలింగ్ జరిగిన స్థానాల్లో కూటమి 903, వైసీపీ 124 స్థానాల్లో గెలిచినట్లు కథనం వెల్లడించింది.

By:  Garuda Media   |   27 Nov 2026 11:22 AM IST
పంచాయ‌తీ ఫ‌లితం: వైసీపీ పుంజుకుందా?
X

ఏపీలో తొలి ద‌శ పంచాయ‌తీ ఎన్నిక‌లు ముగిశాయి. వాటి ఫ‌లితాలు కూడా వ‌చ్చేశాయి. తొలిద‌శ‌లో మొత్తం 3949 గ్రామ పంచాయ‌తీల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించారు. గురువారం ఉద‌యం 7 నుంచి మ‌ధ్యాహ్నం 1 వ‌ర‌కు పోలింగ్ నిర్వ‌హించారు. అనంత‌రం.. 2 గంట‌ల నుంచి ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. మొత్తం 3949 పంచాయ‌తీల్లో 760 ఏక‌గ్రీవాలు అయ్యాయి. ఇవి పూర్తిగా కూట‌మి పార్టీలైన టీడీపీ, జ‌న‌సేన మ‌ద్ద‌తు దారులు సొంతం చేసుకున్నారు.

ఈ ఎన్నిక‌ల్లో పార్టీ జెండాలు ఉండ‌వు. పార్టీ గుర్తులు కూడా ఉండ‌వు. అయితే.. అభ్య‌ర్థులు మాత్రం ఆయా పార్టీల నుంచి మ‌ద్ద‌తు పొందారు. దీంతో టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ, వైసీపీ స‌హా క‌మ్యూనిస్టు పార్టీలు అభ్య‌ర్థుల‌కు అండ‌గా ఉన్నాయి. ప్ర‌చారం కూడా జోరుగా సాగింది. ఎన్నిక‌ల‌కు ముందు.. ఎన్నిక‌ల రోజు కూడా.. ఓట‌ర్ల‌ను ఆకట్టుకునేందుకు బ‌రిలో ఉన్న అభ్య‌ర్థులు జోరుగా డ‌బ్బులు, కానుక‌లు పంపిణీ చేయ‌డం విశేషం. మొత్తంగా తొలిద‌శ‌లో 26 జిల్లాల్లోని 3,189 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు.

అలాగే, 39,832 వార్డు స్థానాలకు గాను 14,731 స్థానాలు ఏకగ్రీవం కాగా, 25,057 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. పోలింగ్ ముగిసిన వెంటనే ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు కూడా చేప‌ట్టారు. వీటిలో టీడీపీ, జ‌న‌సేన కూట‌మి 903 స్థానాలు ద‌క్కించుకుంది. వైసీపీ 124 స్థానాలు ద‌క్కించుకోగా, ఇత‌ర పార్టీల మ‌ద్ద‌తుతో రంగంలోకి దిగిన అభ్య‌ర్థులు 32 స్థానాల్లో గెలుపు గుర్రం ఎక్కారు. మొత్తంగా ఈ ఎన్నిక‌ల్లో మెజారిటీ సీట్ల‌ను మ‌రోసారి కూట‌మి కైవసం చేసుకుంది. ఇక్క‌డ కూడా పూర్తిగా బ్యాలెట్ విధానంలోనే ఎన్నిక‌లు నిర్వ‌హించారు.

వైసీపీ విష‌యానికి వ‌స్తే.. పార్టీ పంచాయ‌తీ ఎన్నిక‌ల్లోనూ పెద్ద‌గా పుంజుకోలేదు. నిజానికి గ్రామీణ రాజ‌కీయాల్లోను.. గ్రామీణ ప్రాంతాల్లోనూ వైసీపీకి బ‌ల‌మైన మ‌ద్ద‌తు ఉండేది. వైఎస్ రాజ‌శేఖ‌ర‌ రెడ్డి హ‌వా క‌నిపించేది. అయితే.. తాజాగా ఆ ప‌రిస్థితి పూర్తి భిన్నంగా మారింది. కూట‌మినే ప్ర‌జ‌లు ఎక్కువ‌గా గెలిపించారు. గ్రామాల్లో చేప‌ట్టిన అభివృద్ధి కార్య‌క్ర‌మాలు, జ‌ల్‌జీవ‌న్ మిష‌న్ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించే కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డంతో వైసీపీని పూర్తిగా గ్రామీణ ప్రాంతాల ప్ర‌జ‌లు ప‌క్క‌న పెట్టిన‌ట్టు క‌నిపిస్తోంది.