Begin typing your search above and press return to search.

హీటెక్కిన సిక్కోలు పాలిటిక్స్‌.. జ‌డ్పీ చైర్మ‌న్ పోటాపోటీ ..!

శ్రీకాకుళం జెడ్పీ పీఠం కూటమి దక్కించుకున్నా.. చైర్‌పర్సన్ ఎంపికపై టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పోటీ నెలకొంది. మొత్తం 30 స్థానాలకు కూటమి 29, వైసీపీ ఒకటి గెలుచుకున్నాయి. బీసీ మహిళకు రిజర్వ్ అయిన ఈ పదవికి టీడీపీ నుంచి తమ్మినేని సుజాత, జనసేన నుంచి కొరికాన భవాని, బీజేపీ నుంచి త్రివేణి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ నెల 23న ప్రమాణ స్వీకారం నేపథ్యంలో రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు నిర్ణయం కీలకం కానుంది.

By:  Garuda Media   |   14 Nov 2026 4:00 PM IST
హీటెక్కిన సిక్కోలు పాలిటిక్స్‌.. జ‌డ్పీ చైర్మ‌న్ పోటాపోటీ ..!
X

శ్రీకాకుళం జిల్లా పరిషత్ పీఠం కూటమి వశం అయిన‌ప్ప‌టికీ.. అంత‌ర్గ‌తంగా ఇదే వ్య‌వ‌హారం.. పార్టీల మ‌ధ్య తీవ్ర చ‌ర్చ‌కు దారితీసింది. మొత్తం 30 జెడ్పీటీసీ స్థానాలకు గాను కూటమి 29 స్థానాలను కైవసం చేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం 1 స్థానానికే పరిమితమైంది. ఇది ఒక‌ర‌కంగా కూట‌మికి భారీ విజ‌య‌మేన‌ని చెప్పాలి. అయితే.. ఇప్పుడు చైర్మ‌న్ రేసు వ్య‌వ‌హారం.. కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఆశావహుల మధ్య తీవ్ర పోటీకి కేంద్రంగా మారింది. ఈ పదవి బీసీ (మహిళ) రిజర్వేషన్‌కు కేటాయించారు.

కూటమిలో 29 మంది జెడ్పీటీసీ సభ్యులు ఉండటంతో చైర్‌పర్సన్ పీఠం కోసం మూడు పార్టీల నేతల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున ఆమదాలవలస ప్రాంతం నుంచి తమ్మినేని సుజాత పేరు ప్రధానంగా వినిపిస్తోంది. గతంలో ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ సతీమణి కూన ప్రమీల పేరు కూడా రేసులో ప్రచారంలోకి వచ్చింది. ఇక‌, జనసేన తరఫున కొరికాన భవాని జెడ్పీ చైర్మన్ రేసులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. బీజేపీ నుంచి త్రివేణి పేరు చైర్‌పర్సన్ పదవి కోసం వినిపిస్తోంది.

ఇక‌, ఈ జెడ్పీ చైర్మన్ అభ్యర్థిని ఇంకా అధికారికంగా ప్రకటించక పోయినా.. ఈ నెల 23న ప్ర‌మాణ స్వీకారానికి ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో జిల్లాకు చెందిన ముఖ్య నేత‌, ఎంపీ. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చక్రం తిప్పుతున్నార‌ని స‌మాచారం. వీరు ఇచ్చే సూచ‌న‌లే పార్టీ అధిష్ఠానం తీసుకునే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. వీరి నిర్ణయం మేరకు చైర్‌పర్సన్ ఎన్నిక జరుగుతుందని శ్రీకాకుళంలో చ‌ర్చ సాగుతోంది.

ఎందుకింత‌..?

ఇక‌, ఎందుకు ఇంత పోటీ నెల‌కొంది? అనేది ప్ర‌శ్న‌. శ్రీకాకుళంపై ఆది నుంచి ప‌ట్టు పెంచుకున్న టీడీపీ త‌న ప‌ట్టును కొన‌సాగించేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీని క‌ట్ట‌డి చేసి అన్ని స్థానాల్లోనూ కూట‌మి విజ‌యం ద‌క్కించుకుంది. ఇది టీడీపీ నేత‌లు, కేడ‌ర్ వ‌ల్లే సాకారం అయింద‌న్న వాద‌న ఉంది. అందుకే..వారి ఆకాంక్ష‌ల మేర‌కు టీడీపీకే కేటాయించాల‌ని కోరుతున్నారు. ఇక‌, శ్రికాకుళంలో జ‌న‌సేన కూడా ప‌ట్టు పెంచుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. దీనికి చైర్మ‌న్ పీఠం దోహ‌ద‌ప‌డుతుంద‌ని ఆ పార్టీ నాయ‌కులు చెబుతున్నారు. అందుకే ఈ రెండు పార్టీల మ‌ధ్య చైర్మ‌న్ రేసు కీల‌కంగా మారింది.