అటు గుండమ్మ...ఇటు రాధమ్మ
పుష్కర కాలంగా పాలకవర్గం లేని శ్రీకాకుళం కార్పొరేషన్‌కు ఈ నెల 26న ఎన్నికలు జరగనున్నాయి. కూటమి తరఫున దానేటి రాధారాణి, వైసీపీ నుంచి గుండ లక్ష్మీదేవి బరిలో ఉన్నారు. అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు కూటమి తరఫున ప్రచారం చేయగా, ధర్మాన సోదరులు వైసీపీకి అండగా నిలిచారు. తొలి మేయర్ ఎవరన్నది ఓటర్లు తేల్చనున్నారు.
By: Satya P | 25 Nov 2026 9:32 AM ISTశ్రీకాకుళం కార్పొరేషన్ కి మొదటి మేయర్ ఎవరు. ఈ ప్రశ్నకు ఒక్క రోజు తేడాలో ప్రజలు తమ తీర్పు ద్వారా జవాబు చెప్పబోతున్నారు. అంతే కాదు పుష్కర కాలంగా పాలక వర్గం లేకుండా ఉన్న చోట మళ్ళీ ప్రజా ప్రతినిధులను గెలిపించడం ద్వారా కొత్త కళను తీసుకుని రానున్నారు. ఈ నెల 26న శ్రీకాకుళం కార్పొరేషన్ కి ఎన్నికలు జరగనున్నాయి. దాని కోసం అన్ని ఏర్పాట్లూ పూర్తి అయ్యాయి. మరో వైపు చూస్తే అభ్యర్థుల ప్రచారం మంగళవారం సాయంత్రం నాలుగు గంటలతో ముగిసింది. మైకులు గొంతుకలు సైలెంట్ అయిన చోట తెర వెనక రాజకీయానికి తెర లేచింది.
హోరెత్తించిన ప్రచారం :
ఇక కూటమి వైసీపీ ఈసారి తమ ప్రచారం ఉధృతంగానే చేశారు. అవతల వైపు కూటమి తరఫున మంత్రి అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చేపడితే ధర్మాన సోదరులు వైసీపీకి అన్నీ తామే అయి నడిపించారు. కూటమి తరఫున పొత్తులో భాగంగా జనసేన నుంచి దానేటి రాధారాణి పోటీలో ఉన్నారు. శ్రీకాకుళం అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకొస్తామని, అలాగే శ్రీ సెవెన్ డెవలప్మెంట్ ప్లాన్ అమలు చేస్తామని రాధారాణి తన ప్రచారంలో పేర్కొన్నారు. త్రిబుల్ ఇంజన్ సర్కార్ అన్నది కూడా జనంలోకి తీసుకుని వెళ్లారు. ఇక వైసీపీ నుంచి పోటీలో ఉన్న గుండ లక్ష్మీదేవి తాను ఎమ్మెల్యేగా ఉన్నపుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓటేయాలని కోరారు. అంతే కాదు నాలుగు దశాబ్దాల పాటు గుండ కుటుంబం ప్రజల కోసం చేసిన మేలుని చూడాలని విన్నవించుకున్నారు. అలా గుండా లక్ష్మీదేవి దానేటి రాధారాణి ఇద్దరూ జోరుగానే ప్రచార పర్వంలో దూకుడు చూపించారు. జనాలను ఆకట్టుకునే విషయంలో ఇద్దరూ ఇద్దరే అనిపించారు.
ఓటరన్న కరుణ :
ఇక తమ ప్రచారం ముగిసింది ఓటరన్న కరుణ చూపించాలని రెండు పార్టీలూ భావిస్తున్నాయి. అయితే తెర వెనక బేరాలు కూడా జోరుగా సాగుతున్నాయని అంటున్నారు. ఓటుకు నోటు అన్నది కూడా చాప కింద నీరుగా పాకుతోందని ప్రచారం సాగుతోంది. దాంతో శ్రీకాకుళం జిల్లాలో గతంలో జరగని విధంగా ఈసారి మేయర్ ఎన్నికలు ఖరీదుగా మారిపోయాయని అంటున్నారు. ఎక్కడా అధికార కూటమికి తగ్గకుండా వైసీపీ కూడా నిలబడడంతో ఓటర్లకు పండుగగానే ఉంది అని అంటున్నారు. అయితే అన్నీ రకాలుగా తాయిలాలు అందుకున్న ఓటరన్న చివరికి ఎవరి మీద దయ చూపిస్తారు అన్నదే అతి పెద్ద ప్రశ్నగా ఉంది.
ఎవరి రాజ్యం అంటూ :
ఇక శ్రీకాకుళంలో గుండమ్మ రాజ్యం వస్తుందని వైసీపీ నేతలు ధీమాగా చెబుతున్నారు. గుండ లక్ష్మీదేవి మేయర్ సీట్లో కూర్చుంటారని ఆమె పాలన సాగుతుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే రాధమ్మ జమానాకు జనం మద్దతు ఇస్తారు అని కూటమి నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో అన్ని చోట్లా వచ్చిన తీర్పే శ్రీకాకుళంలోనూ రిపీట్ అవుతుందని వారు చెబుతున్నారు. పైగా అధికారంలో ఉన్న పార్టీని కాదనుకుని జనాలు ప్రతిపక్షానికి ఓటేసి అభివృద్ధిని దూరం చేసుకోరని అంటున్నారు. వైసీపీ అయితే పటిష్టంగా అన్నీ సమకూర్చుకుని బరిలో నిలిచింది. కూటమిలో అనైక్యత కనిపించినా చివరికి అంతా అక్కడ కూడా సర్దుకున్నారు. దాంతో సిక్కోలు తొలి మేయర్ ఎవరో ఇక జనమే నిర్ణయించాలని అంటున్నారు.
