Begin typing your search above and press return to search.

గుండ ఫ్యామిలీతో ఢీ ... అనుకున్నంత ఈజీ కాదా ?

12 ఏళ్లకు పైగా విరామం తర్వాత శ్రీకాకుళం కార్పొరేషన్‌కు తొలిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, జనసేన నుంచి రాధారాణి మేయర్ అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. గుండ కుటుంబానికి ఉన్న రాజకీయ బలం, అప్పల సూర్యనారాయణ మృతిపై సానుభూతి వైసీపీకి కలిసొస్తాయని అంచనా. టీడీపీ మద్దతు జనసేనకు ఎంతవరకు దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

By:  Satya P   |   15 Nov 2026 9:13 AM IST
గుండ ఫ్యామిలీతో ఢీ ... అనుకున్నంత ఈజీ కాదా   ?
X

శ్రీకాకుళం కార్పోరేషన్ కి పుష్కర కాలం పైదాటిన తరువాత ఎన్నికలు జరుగుతున్నాయి. శ్రీకాకుళం మునిసిపాలిటీ అప్ గ్రేడ్ అయిన తరువాత తొలి ఎన్నికలు ఇవి. దాంతో మొదటి మేయర్ పీఠం తమకే దక్కాలని ఆశ అందరికీ ఉంటుంది. ఇక కూటమి అయితే ఈ సీటుని జనసేనకు పొత్తులో భాగంగా కేటాయించింది. వైసీపీ నుంచి చూస్తే టీడీపీ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఇటీవల మరణించిన గుండ అప్పల సూర్యనారాయణ సతీమణి గుండ లక్ష్మీదేవి పోటీ చేస్తున్నారు. గుండ కుటుంబం రాజకీయంగా శ్రీకాకుళంలో గట్టి పట్టుని కలిగి ఉంది. ఏకంగా నాలుగు దశాబ్దాల పై చిలుకు రాజకీయ జీవితం ఆ కుటుంబానిది. గుండ లక్ష్మీదేవి కూడా 2014 నుంచి 2019 దాకా అయిదేళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేసి ఉన్నారు. ఇవన్నీ ఆమెకు ప్లస్ అవుతున్నాయని అంటున్నారు.

జనసేన నుంచి :

ఇక చూస్తే జనసేన నుంచి శ్రీకాకుళం జిల్లాలో డాక్టర్‌గా మంచి పేరున్న దానేటి శ్రీధర్ భార్య రాధారాణి బరిలో దిగారు. జనసేనకు మేయర్ పీఠాన్ని అప్పగించడం పట్ల టీడీపీలో అయితే అసంతృప్తి ఉంది అని అంటున్నారు. అయితే పార్టీ బలంగా ఉంది. కింజరాపు కుటుంబం అందరికీ నచ్చచెప్పి మరీ సర్దుబాటు చేసింది అని అంటున్నారు. దాంతో పాటుగా జిల్లాలో జెడ్పీ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికలు అన్నింటిలోనూ కూటమి ఘన విజయాలను నమోదు చేసింది. ఆ ప్రభంజనం అలా ఉండగానే ఈ ఎన్నికలు రావడంతో నల్లేరు మీద నడకగా మేయర్ ఎన్నిక ఉంటుంది అని కూటమి భావిస్తోంది. అయితే అనుకున్నంత ఈజీ అయితే కాదని కూడా విశ్లేషణలు ఉన్నాయి.

సామాజిక సమీకరణలు :

ఇక చూస్తే సామాజిక సమీకరణలలో వైసీపీ కూటమి ఎత్తులకు పై ఎత్తులు వేశాయి. వైసీపీ నుంచి వెలమలకు చాన్స్ ఇచ్చారు. దాంతో కూటమి మేయర్ గా రాధారాణి కాళింగ సామాజిక వర్గానికి చెందిన వారుగా పోటీలో ఉన్నారు. ఈ రెండు సామాజిక వర్గాలు నగరంలో బలంగానే ఉన్నాయి. అయితే రాజకీయంగా చూసుకుంటే గుండ లక్ష్మీదేవి ఎమ్మెల్యేగా చేసిన అనుభవంతో ఉంటే రాధారాణి కొత్త నాయకురాలు. పైగా శ్రీకాకుళం నగరంలో జనసేనకు పెద్దగా సంస్థాగత బలం లేదు, పూర్తిగా టీడీపీ మీదనే ఆధారపడి బరిలోకి దిగింది అని అంటున్నారు.

ధర్మాన ప్లస్ గుండ :

ఇంకో వైపు చూస్తే ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్ తరఫున 2004, 2009, 2019లలో మూడు సార్లు శ్రీకాకుళం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే 2014 లో గుండ కుటుంబం గెలిచింది. ఈ నాలుగు సార్లూ పోరులో గుండా వర్సెస్ ధర్మాన గా ఉంటూ వచ్చింది. రెండూ బలమైన కుటుంబాలు, గట్టి రాజకీయ శిబిరాలుగా ఉన్నాయి. అలాంటిది ఈ రోజున ఒక్కటిగా నిలిచి పోటీ చేస్తున్నాయంటే పూర్తిగా రాజకీయ సమీకరణలు మారుతాయని వైసీపీలో ధీమా కనిపిస్తోంది. అంతే కాకుండా విలీన పంచాయతీలైన కిల్లిపాలెం, ఖాజీపేట , పెద్దపాడు , పాత్రుని వలస , కుశాలపురం , తోటపాలెం గ్రామాల్లో అత్యధిక శాతం వెలమలు ఉన్నారని లెక్క వేస్తున్నారు. ఆ సామాజిక బలం అంతా గుండ లక్ష్మీదేవికి కలిసి వస్తుందని వైసీపీ ధీమా పడుతోంది.

సానుభూతి సైతం :

ఇక నాలుగు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన గుండ అప్పల సూర్యనారాయణ మృతి చెందిన తరువాత జరుగుతున్న ఎన్నికలు. ఆయన పట్ల సానుభూతి, ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా కలిసి వస్తాయని వైసీపీ భావిస్తోంది అని అంటున్నారు. మరో వైపు 2024 లో ఎమ్మెల్యే టికెట్ దక్కనీయలేదని తాజాగా మేయర్ సీటు కూడా లేకుండా చేశారని గుండా లక్ష్మీ దేవి పట్ల టీడీపీలో ఒక వర్గంలో సానుభూతి ఉందని అంటున్నారు. పైగా టీడీపీ అభ్యర్థి రేసులో లేకపోవడంతో మాజీ ఎమ్మెల్యే నిన్నటిదాకా తమ పార్టీలో ఉన్న గుండ లక్ష్మీదేవి పట్ల టీడీపీలో ఒక వర్గం మద్దతుగా నిలుస్తుందని అంటున్నారు. అలాగే శ్రీకాకుళంలో యాదవ, శ్రీశయన, వైశ్య సామాజికవర్గాలలో సైతం గుండ ఫ్యామిలీకి ఉన్న ఆదరణ గెలుపు తీరాలకు చేరుస్తుందని లెక్క వేస్తున్నారు. ఈ నేపధ్యంలో గుండ ఫ్యామిలీని తట్టుకోవాలంటే టీడీపీ పోటీలో నిలిస్తే బాగుండేది అన్న చర్చ కూడా ఉంది. కానీ పొత్తుల వల్ల కుదరలేదని అంటున్నారు. ఈ క్రమంలో ఫలితాలు ఎలా వస్తాయో అన్న కలవరం అయితే టీడీపీ కూటమిలో ఉంది అని అంటున్నారు.