Begin typing your search above and press return to search.

శ్రీకాకుళం మేయర్ సీటు... మాదే అంటున్న వైసీపీ...కూటమి !

By:  Satya P   |   29 Nov 2026 9:24 AM IST
శ్రీకాకుళం మేయర్ సీటు... మాదే అంటున్న వైసీపీ...కూటమి !
X

శ్రీకాకుళం నగర పాలక సంస్థ తొలి మేయర్ ఎవరు అన్నది ఇపుడు ఉత్కంఠని పెంచుతోంది. రెండు దశాబ్దాల తరువాత జరిగిన ఎన్నికలు ఇవి. అంతకు ముందు శ్రీకాకుళం మున్సిపాలిటీ గా ఉండేది. చివరి చైర్ పర్సన్ కూడా కాంగ్రెస్ కి చెందిన వారే. అలా చూస్తే మేయర్ పీఠం మీద టీడీపీ ఆశలు ఎన్నో పెట్టుకుంది అన్న చర్చ ఉంది. కానీ కూటమి పొత్తులో జనసేనకు సీటు వెళ్లిపోయింది. అలా కూటమిలో తమ్ముళ్ళ ఆవేదన ఉండగానే శ్రీకాకుళం కార్పోరేషన్ కి పోలింగ్ పూర్తి అయింది. ఈ పోలింగ్ కూడా 54 శాతమే జరిగింది. మొత్తం ఓట్లలో సగానికి సగం మంది పోలింగ్ వైపునకు రాలేదు. దాంతోనే కూటమిలో కొత్త చర్చ సాగుతోంది. మంచి ప్రభుత్వానికి మెచ్చి ఓట్లు వేయకుండా జనాలు ఏమి చేస్తున్నారు అన్నది కూడా తర్జన భర్జన పడుతున్నారు.

వైసీపీకి మొగ్గు అంటూ :

ఇదే క్రమంలో జరిగిన పోలింగ్ సరళి వైసీపీకే మొగ్గుగా మారిందని విశ్లేషణలు వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో సామాజిక రాజకీయ సమీకరణలు బలంగా పనిచేశాయని అంటున్నారు. శ్రీకాకుళం నగరంలో వైసీపీ మేయర్ అభ్యర్ధి గుండ లక్ష్మీదేవి సామాజిక వర్గం ఓటర్లు జనసేన అభ్యర్ధి రాధారాణి సామాజిక వర్గం ఓటర్ల కంటే రెండు రెట్లు ఎక్కువగా ఉన్నారని అంటున్నారు. ఆ ఓట్లు అన్నీ గుండ ఫ్యామిలీ నుంచి పోటీ చేస్తున్న లక్ష్మీదేవికి గంపగుత్తగా పడ్డాయని అంటున్నారు. అదే సమయంలో అసంతృప్తిగా ఉన్న తమ్ముళ్ళ ఓట్లు కూడా క్రాస్ జరిగి ఈ వైపే పడ్డాయని చెబుతున్నారు. ఇక సంస్థాగతంగా జనసేన బలహీనంగా ఉండడం టీడీపీ నుంచి క్షేత్ర స్థాయిలో ఆశించిన సహకారం దక్కలేదని కూడా అంటున్నారు. ఇవన్నీ వెరసి గుండా లక్ష్మీదేవి భారీ మెజారిటీతో గెలుస్తారు అని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కూటమి జెండా ఖాయం :

అయితే వైసీపీ లెక్కలు అన్నీ తప్పు అని కూటమి నేతలు చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని చోట్లా కూటమి గెలిచిందని అదే ట్రెండ్ ఈ ఎన్నికల్లోనూ కొనసాగిందని చెబుతున్నారు. ప్రజలు కూడా రెండు దశాబ్దాల తరువాత జరిగిన కార్పోరేషన్ ఎన్నికల్లో అభివృద్ధి కోసం అధికార కూటమికే ఓటు వేశారని అంటున్నారు. అదే విధంగా చూస్తే కూటమి మేయర్ అభ్యర్థి సామాజిక వర్గం టీడీపీ సంస్థాగత బలం అన్నీ కూడా జత కూడి గెలుపు బాటను పట్టించాయని చెబుతున్నారు. అందువల్ల శ్రీకాకుళం తొలి మేయర్ గా కూటమి నుంచే రాధారాణి గెలుస్తారు అని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

జోరుగా పందేలు :

ఇంతలా ధీటుగా సాగిన ఈ ఎన్నికల మీద రెండు పక్షాల నుంచి పందేలు జోరుగా సాగుతున్నాయి. రెండు వైపులా విశ్వాసం కనిపించడం ఇదే తొలిసారి అని అంటున్నారు. శ్రీకాకుళంలో ఇప్పటిదాకా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు ఒక ఎత్తు. ఇవి ఒక ఎత్తు అని కూడా అంటున్నారు. అందువల్ల ఫలితాలు వెలువడేంత వరకూ ఎవరిది గెలుపు అని చెప్పలేని పరిస్థితి అని అంటున్నారు. ఏది ఏమైనా శ్రీకాకుళం మేయర్ ఫలితం మాత్రం నరాలు తెగే ఉత్కంఠను రేపుతోంది. ఈ నెల 30న కౌంటింగ్ ట్రెండ్స్ ని చూసిన మీదటనే ఎవరు మేయర్ అన్నది వెల్లడి అవుతుందని అంతవరకూ ఊహాగానాలు ఇలాగే సాగుతాయని అంటున్నారు.