Begin typing your search above and press return to search.

టీడీపీకి జనసేన ఝలక్...సిక్కోలులో బిగ్ ట్విస్ట్ !

శ్రీకాకుళం నగర కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ–జనసేన మధ్య విభేదాలు బయటపడ్డాయి. 60 డివిజన్లలో జనసేనకు టీడీపీ కేవలం ఆరు స్థానాలే కేటాయించడంతో అసంతృప్తి చెందిన జనసేన నేతలు 15 డివిజన్లలో నామినేషన్లు వేసి బరిలో నిలిచారు. దీంతో కూటమి ఓట్లు చీలి వైసీపీకి లాభం చేకూరే అవకాశముందనే చర్చ సాగుతోంది.

By:  Satya P   |   20 Nov 2026 11:31 PM IST
టీడీపీకి జనసేన ఝలక్...సిక్కోలులో బిగ్ ట్విస్ట్ !
X

శ్రీకాకుళం నగర కార్పొరేషన్ కి ఈ నెల 26న ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ కూటమి వర్సెస్ వైసీపీగా రసవత్తరమైన పోరుకు తెర లేచింది. అయితే కూటమిలో సాగుతున్న పరిణామాలే ఇపుడు కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. కూటమి పొత్తులలో భాగంగా మేయర్ సీటుని జనసేనకు అప్పగించింది. దాంతో అరవై డివిజన్లు ఉన్న కార్పోరేషన్ లో జనసేనకు ఆరు డివిజన్లు మాత్రమే టీడీపీ కేటాయించింది. ఎటూ మేయర్ పీఠం జనసేనకు ఇచ్చాం కాబట్టి తమ్ముళ్ళకు ఇబ్బంది లేకుండా టీడీపీ స్థానిక నాయకత్వం తీసుకున్న నిర్ణయం ఇది అని అంటున్నారు. కానీ తమకు కనీసంగా 25 దాకా డివిజన్లు కావాలని జనసేన నేతలు పట్టుబట్టారు. కానీ ఒప్పందం కుదరకపోవడంతో మొత్తం 15 డివిజన్లలో జనసేన అభ్యర్థులు నామినేషన్లు వేసేశారు. దాంతో అక్కడ పోటీలో ఉన్న టీడీపీ అభ్యర్ధులు ఖంగు తిన్నారు.

ఉపసంహరణ లేదు :

ఇక గురువారంతో ఉపసంహరణ గడువు ముగిసింది. అయినా జనసేన అభ్యర్ధులు విత్ డ్రా కాకపోవడంతో 15 డివిజనల్లో టీడీపీకి జనసేన అభ్యర్ధుల నుంచి కూడా పోటీ ఎదురవుతోంది. చివరి నిముషంలో ఒక్కసారిగా జనసేన నుంచి 15 డివిజన్లలో నామినేషన్లు వేయడం వల్ల టీడీపీ నేతలు షాక్ తిన్నట్లు అయింది. మరి వారికి బీ ఫారాలు ఎవరు ఇచ్చారు అన్నది టీడీపీలో చర్చగా సాగుతోంది. వారంతా జనసేన గుర్తు మీద పోటీలో ఉంటున్నారు అని చెబుతున్నారు.

నిరసనగానే :

ఇక జనసేన మొత్తం 60 డివిజన్లలో తమకు పాతిక డివిజన్ల దాకా కోరింది అని అంటున్నారు. కనీసంగా 15 అయినా ఇవ్వాలని ఇది పాతిక శాతం వాటా అవుతుందని కూడా వాదించారు. కానీ కేవలం ఆరు సీట్లు ఇచ్చారని అది జస్ట్ పది శాతంగా ఉందని జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను చిన్న చూపు చూసిన ఫలితంగానే నిరసనగా ఈ నామినేషన్లు వేశామని జనసేన నుంచి వినిపిస్తున్న మాటగా ఉంది. తాము పోటీలో ఉంటామని జనసేన అభ్యర్ధులు ఖరాఖండీగా చెబుతూండడంతో కూటమి ఐక్య పోరాటానికి దెబ్బ తగిలింది అని అంటున్నారు.

వైసీపీకి మేలుగానే :

ఈ విధంగా కూటమిలో అసంతృప్తులు అలాగే ఒకరి మీద ఒకరు పోటీ చేయడం అంటే అది కాస్తా చివరికి వైసీపీకి రాజకీయంగా మేలు చేస్తుంది అని అంటున్నారు. ఇప్పటికే వైసీపీ మేయర్ అభ్యర్థిగా బలమైన నాయకురాలు మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీ దేవి బరిలో ఉన్నారు. ఆమెకు ఉన్న రాజకీయ అనుభవం, గుండ కుటుంబానికి ఉన్న నాలుగు దశాబ్దాల రాజకీయ నేపధ్యం వైసీపీ మేయర్ అభ్యర్ధికి ప్లస్ పాయింట్లు అవుతున్నాయి. ఈ నేపధ్యంలో టీడీపీ జనసేనల మధ్య పొసగని తీరు అసలుకే ఎసరు తెచ్చేలా ఉందని అంటున్నారు. ఇప్పటికైనా రెండు పార్టీలు కూర్చుని తగ్గితే చివరి నిముషంలో అయినా సఖ్యత ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.