Begin typing your search above and press return to search.

అటు వారు ఇటు.. ఇటు వారు అటు.. సిక్కోలు రాజకీయ చిత్రం

శ్రీకాకుళం మేయర్ ఎన్నికల్లో జనసేన అభ్యర్థి దానేటి రాధారాణి, వైసీపీ అభ్యర్థి గుండ లక్ష్మీదేవి తలపడుతున్నారు. గతంలో వైసీపీకి దగ్గరగా ఉన్న రాధారాణి భర్త శ్రీధర్, ఇప్పుడు జనసేనలో కొనసాగుతున్నారు. నాలుగు దశాబ్దాలు టీడీపీలో పనిచేసిన లక్ష్మీదేవి ఇటీవల వైసీపీలో చేరారు. ఇద్దరి పాత రాజకీయ పరిచయాలు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రచారం నగరంలో చర్చనీయాంశమయ్యాయి.

By:  Tupaki Political Desk   |   17 Nov 2026 12:37 AM IST
అటు వారు ఇటు.. ఇటు వారు అటు.. సిక్కోలు రాజకీయ చిత్రం
X

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అన్న సామెతను నిజం చేస్తున్నట్లు సాగుతున్నాయి శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయాలు. ఇక్కడ ప్రత్యర్థులుగా తలపడుతున్న ఇద్దరు నేతలు, వారి మద్దతు దారులను గమనిస్తే పెద్దలు చెప్పిన సామెత అక్షర సత్యం అని చెప్పక తప్పదు. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఈ నెల 26న జరగనున్నాయి. ఇక్కడి నుంచి అధికార కూటమి అభ్యర్థిగా జన సేన నుంచి డాక్టర్ దానేటి రాధారాణి నామినేషన్ వేశారు. ఆమెకు ప్రత్యర్థిగా వైసీపీ తరఫున మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి బరిలోకి దిగారు. మేయర్ పీఠం కోసం ఈ ఇద్దరు మహిళా నేతలు పోటీ పడటం అత్యంత సహజమే అయినప్పటికీ, వారి వెనుక దాగున్న భిన్నమైన నేపథ్యమే ఆసక్తికర చర్చకు తెర తీస్తోంది.

జనసేన అభ్యర్థి డాక్టర్ దానేటి రాధారాణి తొలిసారి ఎన్నికల రణరంగంలోకి దిగారు. అయితే ఆమె భర్త డాక్టర్ దానేటి శ్రీధర్ 2024 ఎన్నికల ముందు వరకు వైసీపీ సానుభూతిపరుడిగా ఉండేవారు. గత ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి శ్రీకాకుళం ఎంపీ టికెట్ ఆశించారని, అయితే ఆయనకు ఆ అవకాశం ఇవ్వకపోవడం వల్ల జనసేనకు పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. ఇక వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీనియర్ మహిళా నేత, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి నాలుగు దశాబ్దాలుగా టీడీపీలో పనిచేశారు. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి పసుపు జెండా తప్ప మరో అజెండా లేకుండా పనిచేశారు. అయితే అనూహ్యంగా గత ఎన్నికల్లో పార్టీ టికెట్ దక్కలేదన్న ఆవేదనతో కొన్నాళ్లుగా పార్టీకి దూరమయ్యారు. కొద్ది రోజుల క్రితం టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. నిజానికి లక్ష్మీదేవి గతంలో శ్రీకాకుళం మున్సిపల్ చైర్పర్సన్ గా పనిచేశారు. ఈ సారి ఆమెను మేయరుగా నిలుపుతారని భావించారు. అయితే అనూహ్యంగా ఈ సీటును జనసేనకు కేటాయించడంతో లక్ష్మీదేవికి ఆశాభంగం ఎదురైంది. దీంతో ఆమె నలబైయేళ్లుగా మోస్తున్న జెండాను కిందపడేసి ఫ్యాను పార్టీలో చేరారు.

ఇలా ఇద్దరు తమ సొంత పార్టీలను వదిలి కొత్త పార్టీల్లోకి జంప్ చేయడం, అనూహ్యంగా ఆయా పార్టీల తరఫున మేయర్లుగా పోటీ చేయడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. ఇదే సమయంలో గతంలో ఇద్దరు మేయర్ అభ్యర్థుల అనుచరులుగా పనిచేసిన వారు ప్రత్యర్థి పార్టీల్లో ఉండటం, వారి మద్దతును ఆశిస్తూ ఇద్దరూ పోటాపోటీగా పావులు కదుపుతుండటం ఉత్కంఠకు గురిచేస్తోంది. ఇదే సమయంలో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజకీయ వ్యూహాలు ఆసక్తిరేపుతున్నాయి. రెండు దశాబ్దాలుగా మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి కుటుంబంతో రాజకీయంగా విభేదించిన ధర్మాన ఇప్పుడు ఆమెకు మద్దతుగా ప్రచారం చేయడంపై విస్తృత చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో రెండేళ్ల క్రితం వరకు తనకు అత్యంత సన్నిహితంగా మెలిగిన డాక్టర్ దానేటి శ్రీధర్ సతీమణి రాధారాణిని ఓడించేందుకు ధర్మాన వేస్తున్న పాచికలు ఎంతవరకు సక్సెస్ అవుతాయనే చర్చ వేడి పుట్టిస్తోంది.

ఇదే సమయంలో తన రాజకీయ జీవితం అంతా టీడీపీతోనే కొనసాగించిన వైసీపీ మేయర్ అభ్యర్థి గుండ లక్ష్మీదేవి ఎక్కువగా తన మాజీ పార్టీ నేతలు, కార్యకర్తల సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. మరోవైపు జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ దానేటి రాధారాణి భర్త శ్రీధర్ వైసీపీలో ఉన్న తన పాత పరిచయాలను మళ్లీ గుర్తు చేస్తూ మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. దీంతో ఎవరు ఎవరికి మద్దతుగా పనిచేస్తున్నారో తెలియని గందరగోళ పరిస్థితి నగరంలో నెలకుందని అంటున్నారు. ఇరువురు నేతల తమ సొంత పార్టీ, కార్యకర్తల మద్దతు కన్నా ఎక్కువగా తమ పూర్వాశ్రమంలోని విశేషాలను గుర్తు చేసుకుంటూ సాగిస్తున్న ప్రచారంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.