శ్రీకాకుళంలో 'గుండ విగ్రహ' రాజకీయం!
శ్రీకాకుళంలో మాజీ ఎమ్మెల్యే గుండ అప్పల సూర్యనారాయణ విగ్రహ ఆవిష్కరణ రాజకీయ వివాదానికి దారితీసింది. ఆయన భార్య, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి టీడీపీని వీడి వైసీపీలో చేరిన 15 రోజులకే ఎమ్మెల్యే గొండు శంకర్ నాలుగు రోడ్ల జంక్షన్‌లో విగ్రహాన్ని ఆవిష్కరించారు. గతంలో విగ్రహ ఏర్పాటును అడ్డుకున్నారని ఆరోపించిన లక్ష్మీదేవి, ఇప్పుడు శంకర్ ఆవిష్కరించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పల సూర్యనారాయణ తనకు గురువులాంటి వారని, అందుకే విగ్రహాన్ని ఏర్పాటు చేశానని శంకర్ వివరణ ఇచ్చారు.
By: Garuda Media | 13 Nov 2026 6:00 PM ISTఉత్తరాంధ్ర జిల్లాల్లో కీలకమైన శ్రీకాకుళంలో రాజకీయం వేడెక్కింది. శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి వరుస విజయాలు దక్కించుకున్న మాజీ ఎమ్మెల్యే "గుండ అప్పల సూర్యనారాయణ" విగ్రహం ఏర్పాటు అంశం.. పెను దుమారానికి దారి తీసింది. సుదీర్ఘకాలంగా టీడీపీలో కొనసాగిన గుండ కుటుంబం.. ఇటీవల ఆ పార్టీని వీడి వైసీపీ తీర్థం పుచ్చుకుంది. మాజీ ఎమ్మెల్యే అప్పల సూర్యనారాయణ సతీమణి లక్ష్మీదేవి కొన్ని రోజుల కిందట వైసీపీ కండువా కప్పుకొన్నారు. దీంతో పార్టీ నాయకులు కూడా రెండుగా చీలిపోయారు.
రీజనేంటి?
గుండ లక్ష్మీదేవి కూడా.. 2014లో టీడీపీ తరఫున పోటీ చేసి శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకు న్నారు. అయితే.. అనూహ్యంగా ఆమెకు 2024లో టికెట్ దక్కలేదు. అప్పటి నుంచి శ్రీకాకుళం మునిసిపల్ చైర్మన్ పీఠంపై ఆమె మనసు పెట్టుకున్నారు. దీనికోసం చంద్రబాబును కూడా ఆమె కలుసుకున్నారు. కానీ, అవకాశం చిక్కలేదు. మరోవైపు గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్న గొండు శంకర్‌కు లక్ష్మీదేవికి మధ్య వివాదాలు ఉన్నా యి. గత ఏడాది సూర్యానారాయణ మృతి చెందిన తర్వాత.. ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్మీదేవి ప్రయత్నించారు.
కానీ, ఆ ప్రయత్నాలు ముందుకు సాగలేదు. అధికారులు పర్మిషన్ ఇవ్వలేదు. అయితే.. దీనికి కారణం ఎమ్మెల్యే శంకరేనన్న వాదన లక్ష్మీ దేవి అనుచరుల నుంచి వినిపించింది. ఆమె కూడా ఓ సందర్భంలో ఎమ్మెల్యేపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ పరిణామాల క్రమంలోనే గుండ లక్ష్మీదేవి టీడీపీని వీడి వైసీపీ చెంతకు చేరిపోయారు. అయితే.. ఆమె అలా పార్టీలో చేరిన 15 రోజుల్లోనే ఎమ్మెల్యే గొండు శంకర్.. శ్రీకాకుళం నాలుగు రోడ్ల జంక్షన్ లో శుక్రవారం గుండ అప్పల సూర్యనారాయణ విగ్రహాన్ని ఆవిష్కరించేశారు.
దీంతో ఒక్కసారిగా రాజకీయాలు ముసురుకున్నాయి. గొండు శంకర్.. ఏ అర్హతతో తన భర్త విగ్రహాన్ని ఆవిష్కరిస్తా రని లక్ష్మీదేవి ప్రశ్నించారు. గతంలో తానే ఏర్పాటు చేస్తానని చెప్పినప్పుడు.. అడ్డుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు స్వయంగా విగ్రహాన్ని ఆవిష్కరించి ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారని ఆమె ప్రశ్నించారు. ఇదంతా తనను నైతికంగా ఇబ్బంది పెట్టేందుకు చేస్తున్న చర్యగా ఆమె పేర్కొన్నారు. తమకు ఉన్న ఓటు బ్యాంకును లాక్కునేందుకు ఇలా చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. అయితే.. అప్పల సూర్యనారాయణ తనకు గురువు వంటి వారని, అందుకే విగ్రహాన్ని ఏర్పాటు చేశానని గొండు శంకర్ చెప్పారు మొత్తంగా ఈ వ్యవహారంపై వివాదాలు కొనసాగుతున్నాయి.
