Begin typing your search above and press return to search.

ధర్మాన బ్రదర్స్ చేతుల్లో గుండ ఫ్యామిలీ పొలిటికల్ లైఫ్

శ్రీకాకుళం మేయర్ ఎన్నికలు డిసెంబర్‌లో జరిగే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. జెడ్పీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించగా, ఒక్క జెడ్పీటీసీ స్థానానికే పరిమితమైన వైసీపీకి మేయర్ ఎన్నిక సవాల్‌గా మారింది. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు ఈ ఎన్నికలు పరీక్షగా నిలవనున్నాయి. వైసీపీలో చేరిన గుండ లక్ష్మీదేవి రాజకీయ భవిష్యత్తు కూడా ఈ ఎన్నికల ఫలితంపైనే ఆధారపడి ఉంది.

By:  Satya P   |   11 Nov 2026 9:25 AM IST
ధర్మాన బ్రదర్స్ చేతుల్లో గుండ ఫ్యామిలీ పొలిటికల్ లైఫ్
X

శ్రీకాకుళం మేయర్ పీఠానికి డిసెంబర్ లో ఎన్నికలు జరుగుతాయని ప్రచారం సాగుతోంది. న్యాయపరమైన అడ్డంకుల వల్లనే ఈ ఎన్నికలు నిలిచిపోయాయి. డిసెంబర్ 2తో మూడు విడతల పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే రాష్ట్రంలో మిగిలిన మున్సిపాలిటీలు, కార్పోరేషన్లు ఎన్నికలను కూడా పూర్తి చేస్తారు అని అంటున్నారు. దాంతో శ్రీకాకుళం జిల్లా పరిషత్తు ఎన్నికల్లో విజయ దుందుభిని మోగించిన కూటమి మేయర్ ఎన్నికల కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తోంది. ఇక కేవలం ఒకే ఒక్క జెడ్పీటీసీని గెలుచుకుని చతికిలపడిన వైసీపీకి మేయర్ ఎన్నిక అతి పెద్ద సవాల్ గా మారుతోంది. ప్రత్యేకించి ఈ భారాన్ని భుజాన మోస్తున్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు జిల్లా అధ్యక్షుడు ధర్మాన క్రిష్ణదాస్ కి కూడా పరీక్ష పెట్టనుంది అని అంటున్నారు.

అదే ఊపుతోనే :

ఇక జిల్లాలోనే కాదు రాష్ట్రంలో జనం మూడ్ ఏంటి అన్నది స్థానిక ఎన్నికల ఫలితాలు తెలియచేశాయి. దాంతో సిక్కోలు మేయర్ ఎన్నికల ఫలితం కూడా వేరేగా ఉండబోదని కూటమి నేతలు ధీమాగా ఉన్నారు. జనసేనకు మేయర్ సీటుని కేటాయించారు అని అంటున్నారు. అయినా కూటమి అంతా ఐక్యంగా కలసి గెలిపించేందుకు సిద్ధంగా ఉందని అంటున్నారు. జిల్లా పరిషత్తు ఎన్నికల్లో కనిపించిన ఈ ఐక్యత మరోసారి రుజువు అవుతుందనీంటున్నారు. దాంతో కూటమి అయితే యమ జోరుగా ఉంది అని అంటున్నారు.

వైసీపీ శిబిరమలో :

ఇక వైసీపీ శిబిరంలో చూస్తే ఒకింత నైరాశ్యం ఉందని అంటున్నారు. జెడ్పీ ఎన్నికల్లో కచ్చితంగా గణనీయమైన సీట్లు గెలుస్తామని ఆశలు పెట్టుకున్నారు. కానీ వర్కౌట్ కాలేదు. దాంతో సింగిల్ డిజిట్ కే వైసీపీ పరిమితం అయింది. అలా మేయర్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో అన్న కలవరం అయితే ఉంది. అయితే మాజీ టీడీపీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవిని వైసీపీలోకి తెచ్చిన ధర్మాన సోదరులు ఆమె గెలుపు కోసం గట్టిగానే పనిచేయాల్సి వస్తోంది. ఒక విధంగా ఎదురీతగానే ఉందని అంటున్నారు. ఎందుకంటే శ్రీకాకుళం నగరం ఎపుడూ టీడీపీకి కంచుకోటగా ఉంటూ వస్తోంది. 2024 లో చూస్తే ఏకంగా 50 వేల పై చిలుకు భారీ మెజారిటీ టీడీపీకి దక్కింది.

వ్యూహాలు పారుతాయా :

ధర్మాన ప్రసాదరావు అంటే వ్యూహాలకు మారు పేరుగా చెబుతారు. మరి మేయర్ ఎన్నికల్లో అవి పారుతాయా అన్నదే చర్చగా ఉంది. ఎంతో మంది వైసీపీ సీనియర్లు ఉద్ధండులు కూడా స్థానిక ఎన్నికల్లో కూటమి తాకిడికి ఓటమి పాలు అయ్యారు. వారి వ్యూహాలు చెల్లాచెదురు అయ్యాయి. విజయనగరంలో చూస్తే బొత్స సత్యనారాయణ స్వయాన తన కుమార్తె ఓటమిని జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. దాంతో సిక్కోలు మేయర్ ఎన్నికలు వైసీపీలో కొంత గుబులుగానే ఉన్నాయని అంటున్నారు.

ఇదే చాన్స్ :

ఇక గుండ లక్ష్మీ దేవికి 2019లో టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఆ తరువాత ఆమెకు 2024 లో చాన్స్ దక్కలేదు. 2026 లో మేయర్ ఇస్తారని అనుకున్నా అదీ కుదరలేదు, దాంతో ఆమె వైసీపీలోకి వచ్చారు. వైసీపీ హైకమాండ్ ఆమెకే టికెట్ అని చెప్పిందని టాక్. మరి ఒక విధంగా చూస్తే గుండ లక్ష్మీదేవికి కానీ నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న ఆమె కుటుంబానికి కానీ ఈ మేయర్ ఎన్నికలు అత్యంత కీలకంగా మారబోతున్నాయి. ఈ ఎన్నికల్లో లక్ష్మీదేవి గెలిస్తే ఆమె కుటుంబం నుంచి చిన్న కుమారుడు రాజకీయ వారసుడిగా రంగ ప్రవేశం చేస్తారు అని అంటున్నారు. దాంతో పాటు గుండ ఫ్యామిలీ పొలిటికల్ లెగసీ కూడా కంటిన్యూ అవుతుంది. మరి తేడా కొడితే ఒక అతి పెద్ద రాజకీయ కుటుంబం రాజకీయ జీవితం ఇబ్బందుల్లో పడుతుందని అని అంటున్నారు. ఇక ఎన్నో హామీలు భరోసా ఇచ్చి మరీ ఆమెకు వైసీపీలోకి తెచ్చిన ధర్మాన సోదరులకు ఇది అతి పెద్ద గెలుపు బాధ్యతగా అంతా అంటున్నారు.