వైఫ్ ఆఫ్ కూన రవి...చైర్ పర్సన్ అభ్యర్థిగా !
ఆముదాలవలస మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. టీడీపీ తరఫున ఎమ్మెల్యే కూన రవికుమార్ సతీమణి కూన ప్రమీల, వైసీపీ నుంచి మాజీ కౌన్సిలర్ బొడ్డేపల్లి అంజనీ కుమారి పోటీలో ఉన్నారు. ఇద్దరూ కాళింగ సామాజిక వర్గానికి చెందినవారే. వైసీపీలో వర్గ విభేదాలు, తమ్మినేని సీతారాం వర్గం వైఖరి ఈ ఎన్నికల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ పోరు రెండు పార్టీలకు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
By: Satya P | 16 Nov 2026 9:58 AM ISTశ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస మునిసిపాలిటీకి చాలా కాలం తరువాత ఎన్నికలు జరుగుతున్నాయి. సమీప గ్రామాల విలీనానికి సంబంధించిన న్యాయ పరమైన పరిపాలనా పరమైన కారణాల వల్ల గతంలో నిలిచిపోయిన ఈ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా షెడ్యూల్ను విడుదల చేసింది. ఆముదాలవలస జిల్లాలో రాజకీయంగా ప్రతిష్టాత్మకమైన మున్సిపాలిటీ గానే చూస్తున్నారు. ఎందుకంటే అక్కడ వైసీపీకి చెందిన దిగ్గజ నేత మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఉన్నారు. ఆయన అనేక సార్లు గెలిచిన ఆముదాలవలసలో ఇపుడు స్థానిక పోరు సాగుతోంది. ఇక ఆయన సొంత మేనల్లుడు టీడీపీ ఎమ్మెల్యేగా కూన రవి కుమార్ ఉన్నారు.
కూటమి తరపున :
ఆముదాలవలస మునిసిపాలిటీ చైర్ పర్సన్ అభ్యర్ధిగా స్థానిక టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ సతీమణి కూన ప్రమీలను ఎంపిక చేశారు. ఆమె రాజకీయంగా ఈ మధ్య కాలంలో చురుకుగా పాల్గొంటున్నారు అని చెబుతున్నారు. దాంతో ఆమెనే బరిలోకి దింపడం ద్వారా భారీ విక్టరీ కొట్టి చూపించాలని కూన రవికుమార్ భావిస్తున్నారు. కూన రవికుమార్ ఆముదాలవలసలో టీడీపీని బలోపేతం చేశారు. వైసీపీ వర్గ పోరు కూడా ఆయన రాజకీయ దూకుడుకు బాగా ఉపయోగపడుతోంది. ఇక ఎమ్మెల్యేగా ఫైర్ బ్రాండ్ ఇమేజ్ తో ఉన్న కూన రవి కుమార్ తన సతీమణినే పోటీకి పెడితే వార్ వన్ సైడ్ అని కూటమి నేతలు అంటున్నారు.
వైసీపీ నుంచి ఆమె :
అయితే వైసీపీ నుంచి చూస్తే మాజీ కౌన్సిలర్ బొడ్డేపల్లి అంజనీ కుమారిని పోటీకి దించారు. దీంతో ఈ ఇద్దరి మహిళల మధ్య పోరు సాగనుంది. మున్సిపల్ చైర్ పర్సన్ కి ప్రత్యక్ష ఎన్నికలు ఉండడంతో ఎవరి సత్తా ఏమిటో తెలుస్తుంది అని అంటున్నారు. ఆముదాలవలసలో నిజానికి వైసీపీకి మంచి బలం ఉన్నా పార్టీ అయితే రెండుగా చీలిపోయింది అని అంటున్నారు. తమ్మినేని సీతారాం వర్గం సైలెంట్ గా ఉంది అని చెబుతున్నారు. పరిషత్తు ఎన్నికల్లో సైతం ఆముదాలవలస నియోజకవర్గం వైసీపీ ఇంచార్జి చింతాడ రవి కుమార్ పార్టీ తరఫున ఒంటరి పోరు సాగించారు. అయితే ఫలితాలు పూర్తి ఏకపక్షంగా కూటమికే వచ్చాయి. దాంతో కూటమిలో ఇపుడు కూడా గెలుపు ధీమా అధికంగా ఉంది అని అంటున్నారు.
ఒకే సామాజిక వర్గం :
ఇక కూన ప్రమీల, బొడ్డేపల్లి అంజనీ కుమారి కాళింగ సామాజిక వర్గానికి చెందిన వారు కావడం విశేషం. ఆముదాలవలసలో ఆ సామాజిక వర్గం అధికం. దాంతో రెండు పార్టీలూ సామాజిక సమీకరణలను సరి చూసుకునే వ్యవహరించాయని అంటున్నారు. అయితే రాజకీయంగా చూస్తే మాత్రం వైసీపీలో అనైక్యత కనిపిస్తోంది. అదే సమయంలో మూడు పార్టీలతో కూటమి స్ట్రాంగ్ గా ఉందని అంటున్నారు. అలాగే అధికార బలం, అంగ బలం అర్ద బలం చూసినా కూటమిదే పైచేయిగా ఉంది.
ధీటుగానే వైసీపీ :
దాంతో కూన రవి కుమార్ సతీమణి కాబోయే చైర్ పర్సన్ అని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో తాము గట్టి పోటీ ఇస్తామని వైసీపీ నేతలు అంటున్నారు. ఎక్కడా చాన్స్ వదులుకునే సమస్య లేదని కూడా అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఆముదాలవలస ఫలితం ఆసక్తిని పెంచుతోంది. ఈ ఫలితం వైసీపీలో రెండు వర్గాలు కలసి పనిచేశాయా లేదా అన్నది కూడా తేలుస్తుందని అంటున్నారు. ఈ ఫలితాల అనంతరం వైసీపీ అధినాయకత్వం ఈ నియోజకవర్గం మీద కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
