Begin typing your search above and press return to search.

నేనూ పాద‌యాత్ర చేస్తా.. ఎప్పుడంటే: సాయిరెడ్డి

పరివర్తన రాజనీతీ పార్టీ (పీఆర్‌పీ) అధ్యక్షుడు సాయిరెడ్డి వచ్చే ఏడాది ఉగాది తర్వాత పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడమే లక్ష్యమని, 2029 ఎన్నికల్లో ఏపీ అంతటా పోటీ చేస్తామని తెలిపారు. వైసీపీపై విమర్శలు చేస్తూ, జగన్‌నే అసలైన వెన్నుపోటుదారుడని ఆరోపించారు. యువతకు, కొత్త నాయకత్వానికి తమ పార్టీలో ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు.

By:  Garuda Media   |   25 Nov 2026 11:24 PM IST
నేనూ పాద‌యాత్ర చేస్తా.. ఎప్పుడంటే: సాయిరెడ్డి
X

ప‌రివ‌ర్త‌న రాజ‌నీతి పార్టీ(పీఆర్‌పీ) అధ్య‌క్షుడు సాయి రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. తాను కూడా పాద‌యాత్ర చేయ‌నున్న‌ట్టు ఆయ‌న వెల్ల‌డించారు. వ‌చ్చే ఏడాది ఉగాది త‌ర్వాత‌.. తాను పాద‌యాత్ర చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు చెప్పారు. దీనికి సంబంధించిన ప్ర‌ణాళిక‌, రోడ్ మ్యాప్ వంటివి సిద్ధం చేసుకుంటున్న‌ట్టు వివ‌రించారు. కేవ‌లం ప్ర‌జ‌ల సమ‌స్య‌లను తెలుసుకునేందుకు మాత్ర‌మే తాను పాద‌యాత్ర చేస్తున్న‌ట్టు వెల్ల‌డించారు. అధికారం ఇస్తారా? ఇవ్వ‌రా? అనేది ప్ర‌జ‌ల ఇష్టానికే వ‌దిలేస్తున్న‌ట్టు చెప్పారు. అయితే.. యువ‌త‌కు స‌మాన అవ‌కాశాలు, స‌రైన వేదిక‌లు క‌ల్పించేందుకు త‌మ పార్టీ ప్రాధాన్యం ఇస్తుంద‌న్నారు.

వెన్నుపోటుకు వైసీపీనే కేరాఫ్‌

వెన్నుపోటు రాజ‌కీయాల‌కు కేరాఫ్ వైసీపీనేన‌ని సాయి రెడ్డి దుయ్య‌బ‌ట్టారు. ``నేను జగన్‌కు, పార్టీకి వెన్నుపోటు పొడిచానని వైఎస్సార్‌సీపీ దుష్ప్రచారం చేస్తోంది. ఇది పూర్తిగా అవాస్తవం. కాంగ్రెస్ పార్టీని తాను ఎలా వదిలి వచ్చానో జగన్ గుర్తుంచుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఆయన తండ్రి వైఎస్సార్ ని రెండుసార్లు ముఖ్యమంత్రిని చేసింది, అలాగే జగన్‌కు ఎంపీ అయ్యే అవకాశం కల్పించింది. కానీ, ముఖ్యమంత్రి కావాలనే ఆరాటంలో, తనకు అవకాశం కల్పించిన ఆ పార్టీకే జగన్ వెన్నుపోటు పొడిచారు. నా దృష్టిలో, అదే అసలైన ద్రోహం. నేను వైఎస్సార్‌సీపీ కోసం రాత్రింబవళ్లు కష్టపడ్డాను. అయినప్పటికీ, పార్టీ నాయకత్వం నన్ను పదేపదే అవమానించింది. నాకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, వాటికి నేను కట్టుబడి ఉంటాను. ఒక దశలో, నా ఆత్మగౌరవం ఇక అక్కడ కొనసాగడానికి అంగీకరించలేదు నేను ఎవరికీ ద్రోహం చేయలేదు.`` అని సాయిరెడ్డి అన్నారు.

బీజేపీనే బెస్ట్‌..

ప్ర‌స్తుతం వార‌సత్వ రాజ‌కీయాలు పెరిగిపోయాయని సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ విష‌యంలో బీజేపీనే బెస్ట్‌గా ఉంద‌న్నారు. బీజేపీలో ఎలాంటి వార‌సత్వ రాజ‌కీయాల‌కు చోటు లేద‌ని చెప్పారు. వారసత్వ రాజకీయాలు లేకుండానే ఒక పార్టీ ఎదగగలదని బీజేపీ నిరూపించింద న్నారు. పీఆర్పీ కూడా వ్యక్తులు తమ కృషి, నిబద్ధతతో ఉన్నత స్థాయికి చేరుకునేలా అవకాశం కల్పిస్తుందన్నారు. ప్రస్తుత ధోరణి ఇలాగే కొనసాగితే, రాజకీయ అధికారం ఒక కుటుంబం నుండి మరో కుటుంబ సభ్యుడికి చేతులు మారుతూనే ఉంటుందన్నారు. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించడంలో ప్రజలకు నిజమైన ఎంపిక, అర్థవంతమైన పాత్ర ఉండాలని సూచించారు. రాజకీయాలు వ్యక్తిగత విమర్శల నుండి ప్రజాసేవ వైపు మళ్లాలని కోరుకుంటున్నామ‌న్నారు.

``మా రాజకీయ ప్రయత్నం ఒక వ్యక్తి కోసం, ఒక కుటుంబం కోసం, ఒక కులం కోసం లేదా ఒక పదవి కోసం కాదు. ఇది రైతులు, యువత, మహిళలు, ఉద్యోగులు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఉద్దేశించినది.`` అని సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజల్లో పార్టీని నిర్మించడం, స్థానిక సమస్యలను తెలుసుకోవ‌డం, విశ్వసనీయ నాయకత్వాన్ని అభివృద్ధి చేయడం తక్షణ కర్తవ్యంగా పేర్కొన్నారు. గ్రామ స్థాయి నుండిపార్టీని బ‌లోపేతం చేయ‌నున్న‌ట్టు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో నాయకులను తయారు చేస్తామన్నారు. 2029 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ అంతటా పోటీ చేయాలని యోచిస్తున్నామన్నారు. రాజకీయ కుటుంబాల నుండి రాని వారితో సహా, ప్రజాసేవకు కట్టుబడి ఉన్న నాయకులకు అవకాశాలను కల్పిస్తామ‌ని చెప్పారు.