బీజేపీ మాధవ్ కి మరో పరీక్ష
ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌కు విశాఖ డిప్యూటీ మేయర్ పదవి విషయంలో ఒత్తిడి పెరుగుతోంది. మేయర్ పదవి దక్కకపోవడంతో కనీసం ఉప మేయర్ పదవైనా బీజేపీకి ఇవ్వాలని పార్టీ నేతలు పట్టుబడుతున్నారు. నగర అధ్యక్షుడు పరశురామ రాజు ఈ పదవి రేసులో ఉండగా, 26 మంది కార్పొరేటర్లు, ముగ్గురు ఎమ్మెల్యేల బలంతో జనసేన కూడా పోటీ పడుతోంది. దీంతో కూటమిలో ఉత్కంఠ నెలకొంది.
By: Satya P | 18 Nov 2026 9:05 AM ISTఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఏడాదిన్నర క్రితం నియమితులయిన పీవీఎన్ మాధవ్ తనదైన దూకుడుతో ఏపీలో కమలం పార్టీని పరుగులు పెట్టిస్తారు అని అంతా ఆశించారు. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఆయన పదవిలో ఉండగానే జరిగాయి. ఇక దీని కంటే ముందు నామినేటెడ్ పదవుల పందేరం జరిగింది. అయితే మాధవ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా నాయకులు అంతా కోరినది ఒక్కటే. బీజేపీకి కూటమిలో తగిన వాటా ఉండేలా చూడాలని మరిన్ని నామినేటెడ్ పదవులు దక్కేలా చర్యలు తీసుకోవాలని. అంతే కాదు స్థానిక సంస్థల ఎన్నికలలో సైతం కార్యకర్తలను ఎక్కువ సీట్లు లభించేలా చూడాలని. అయితే నామినేటెడ్ పదవుల విషయంలో మాధవ్ ప్రెసిడెంట్ అయ్యాక కూడా పెద్దగా లభించలేదని కమలం శిబిరంలో అసంతృప్తి అలాగే కొనసాగింది.
స్థానిక పోరులోనూ :
ఇక స్థానిక సంస్థల ఎన్నికలలోనూ బీజేపీకి అనుకున్న స్థాయిలో సీట్లు దక్కలేదన్న భాధ కూడా ఉంది. ఏపీలో మేయర్ పదవులు 17 ఉంటే బీజేపీకి రెండు ఇచ్చారు. 28 జెడ్పీ చైర్మన్లు ఉంటే ఒక్కటి ఇస్తారని అంటున్నారు. ఇక భీమవరం లాంటి చోట కూడా బీజేపీని చిన్న చూపు చూస్తున్నారు అని సాక్షాత్తు ఆ పార్టీ కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాన్ని కూడా అంతా చూశారు. ఇక విశాఖ విషయానికి వస్తే కార్పోరేషన్ లో మేయర్ పదవినే బీజేపీ గట్టిగా కోరుకుంది. కానీ టీడీపీ ఆ పదవి తీసుకుంది. 120 దాకా ఉన్న డివిజన్లలో ఆరవ వంతుగా 20 సీట్లు అయినా ఇవ్వాలని కోరినా 11 మాత్రమే ఇచ్చారు. ఇపుడు డిప్యూటీ మేయర్ పదవి అయినా బీజేపీకి ఇవ్వాలని స్థానిక నేతలు పట్టు బడుతున్నారు.
బలమున్న చోటు :
ఈ డిమాండ్ ఎందుకంటే మొదటి నుంచి బీజేపీకి రాజకీయంగా బలం ఉన్న చోటు విశాఖ అని అంటున్నారు. విశాఖ కార్పొరేషన్ అయ్యాక తొలిసారిగా మేయర్ పదవిని అందుకున్నది కూడా బీజేపీనే అని గుర్తు చేస్తున్నారు. అలాంటిది మూడు పార్టీలు కలసి కూటమిగా ఏర్పడిన తరువాత కూడా బీజేపీ విశాఖలో కీలక పదవిలో ఉండకపోతే ఎలా అని కమలనాధులు అంటున్నారు. విశాఖ ఎంపీ సీటు బీజేపీకి పొత్తులలో ఆనవాయితీగా ఇవ్వడం సహజం అని గుర్తు చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో అది కూడా ఇవ్వలేదని అంటున్నారు. అందువల్ల ఈసారి డిప్యూటీ మేయర్ విషయంలో వెనక్కి తగ్గేది లేదని అంటున్నారు.
సాధించాల్సిందేనా :
మేయర్ సీటు ఎటూ దక్కలేదు, డిప్యూటీ మేయర్ అయినా బీజేపీకి సాధించవలసిందే అని మాధవ్ మీద ఒత్తిడి పెరుగుతోంది. ఆయన విశాఖ వాసి కావడంతో మరింతగా ఈ డిమాండ్ ప్రభావం చూపిస్తోంది. ఏపీ ప్రెసిడెంట్ సొంత ప్రాంతంలో బీజేపీకి ఉప మేయర్ కిరీటం అయినా దక్కకపోతే ఎలా అని కూడా బీజేపీ నేతలు అంటున్నారని భోగట్టా. బీజేపీ నుంచి ఉప మేయర్ పదవికి నగర అధ్యక్షుడు పరశురామ రాజు రేసులో ఉన్నారు. ఆయన డిప్యూటీ మేయర్ పదవి కోసమే కార్పోరేటర్ గా పోటీకి దిగారని అంటున్నారు. మరో వైపు చూస్తే జనసేన నుంచి కూడా ఇదే పదవికి గట్టి పోటీ ఉంది. 26 మంది కార్పోరేటర్లు ఉన్న జనసేనకు ఎక్స్ అఫీషియో మెంబర్స్ గా ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఈ బలాన్ని చూపిస్తూ ఆ పార్టీ డిమాండ్ చేస్తోంది. మరి ఈ పోటీలో ఉప మేయర్ బీజేపీకి దక్కుతుందా మాధవ్ మాట కూటమిలో నెగ్గించుకుంటారా అన్నదే చర్చగా ఉంది మరి.
