Begin typing your search above and press return to search.

జ‌న‌సేన 'క‌ట్టు' త‌ప్పుతోంది: సాగ‌దీతే కార‌ణమా.. ?

మున్సిపల్ ఎన్నికల్లో కాకినాడ, నిడదవోలు, పార్వతీపురం, ఆత్మకూరులో జనసేన నేతల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. కొందరు పార్టీ నిర్ణయాలను ధిక్కరించగా, మరికొందరు వైసీపీతో చేతులు కలిపారనే ఆరోపణలు వచ్చాయి. అభ్యర్థుల ఎంపికలో జాప్యం, క్షేత్రస్థాయి నివేదికల్లో లోపాలపై కూడా చర్చ జరుగుతోంది. ఈ పరిణామాలపై పార్టీ అధిష్ఠానం విచారణ చేపట్టినట్లు సమాచారం.

By:  Garuda Media   |   25 Nov 2026 5:34 PM IST
జ‌న‌సేన క‌ట్టు త‌ప్పుతోంది: సాగ‌దీతే కార‌ణమా.. ?
X

రాష్ట్ర వ్యాప్తంగా మునిసిప‌ల్ ఎన్నిక‌ల వేళ‌.. జ‌న‌సేన నాయ‌కులు వ్య‌వ‌హ‌రించిన తీరు.. పార్టీ క్ర‌మ‌ శిక్ష‌ణ‌పై తీవ్ర ప్ర‌భావం ప‌డేలా చేసింద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. కాకినాడ‌, నిడ‌ద‌వోలు వంటి జ‌న‌సేన పార్టీ బ‌లంగా ఉన్న స్థానాల్లో కూడా.. పెద్ద ఎత్తున వివాదాలు చోటు చేసుకోవ‌డం.. పార్వ‌తీపురం మ‌న్యంలో జ‌న‌సేన నాయ‌కులు వైసీపీతో చేతులు క‌ల‌ప‌డం.. ఆత్మ‌కూరులో మంత్రి ఆనం రామ‌నారాయ‌రెడ్డి జ‌నసేన నాయ‌కుల‌ను త‌న‌వైపు తిప్పు కొన్నార‌న్న ఆరోప‌ణ‌లు వినిపించ‌డం వంటివి పార్టీలో చ‌ర్చ‌కు దారితీశాయి.

మ‌రీ ముఖ్యంగా నిడ‌ద‌వోలులో మంత్రి కందుల దుర్గేష్‌, ఎంపీ ఉద‌య్ శ్రీనివాస్‌ల‌కు ఎదురైన అనుభ‌వాలు పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు కూడా ఇర‌కాటంగా మారాయి. ముందుగానే ఎంపిక చేసిన అభ్య‌ర్థుల‌ను చైర్మ‌న్‌, వైస్‌చై ర్మ‌న్ పీఠాల‌పై కూర్చోబెట్టే క్ర‌తువు వివాదంగా మార‌డంతోపాటు.. ఆయా కీల‌క నాయ‌కుల‌కు సెగ పెంచేలా చేసింది. పార్టీ అధిష్టాన‌మే చెప్పిన‌ప్ప‌టికీ.. నేను వినేది లేదంటూ.. నిద‌డ‌వోలు జ‌న‌సేన నాయ‌కుడు ప్ర‌క‌ట‌న చేయ‌డం మ‌రో కొస‌మెరుపు. ఇక‌, మంత్రి ఆనంతో చెట్ట‌ ప‌ట్టాలేసుకుని తిరిగి.. పార్టీ విప్‌ను కూడా ధిక్క‌రించారు.

వాస్త‌వానికి క్షేత్ర‌ స్థాయిలో అన్ని విష‌యాల‌ను ప‌రిశీలించిన త‌ర్వాతే.. చైర్మ‌న్‌, వైస్ చైర్మ‌న్ పోస్టుల‌ను ఖ‌రారు చేశామ‌ని.. వారికి మాత్ర‌మే బీఫాం ఇచ్చామ‌ని పార్టీ అధినేత చెబుతున్నారు. కానీ, దీనిని కొంద‌రు త‌ప్పు బ‌ట్టారు. క్షేత్ర స్థాయిలో ఉన్న ప‌రిస్థితికి భిన్నంగా వ్య‌వ‌హ‌రించార‌ని.. పైగా అభ్య‌ర్థుల ఎంపిక వ్య‌వ‌హారాన్ని కూడా చాలా కాలం సాగదీశార‌నే వాద‌న వినిపించింది. ఇది అంతిమంగా ఆశావ‌హుల‌ను రెచ్చిపోయేలా చేసింద‌న్న చ‌ర్చ సాగుతోంది. పైగా.. క్షేత్ర‌స్థాయి నుంచి వ‌చ్చిన నివేదిక‌ల్లోనూ త‌ప్పులు ఉన్నాయ‌మ‌ని సాక్షాత్తూ జ‌న‌సేన మంత్రి ఒక‌రు వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.

ఈ ప‌రిణామాల‌కు తోడు.. ఏకంగా వైసీపీతోనే చేతులు క‌లిపి.. పార్వ‌తీపురంలో ప‌ద‌వి చేప‌ట్టేందుకు ప్ర‌య‌త్నించ డం మ‌రింత దుమారం రేపింది. ఆయా అంశాల‌ పై ప్ర‌స్తుతం విచార‌ణ సాగుతోంద‌ని చెబుతున్నా.. దీనికి స‌రైన ప‌రిష్కారం చూపించాల్సిన అవ‌స‌రం ఉంటుంద‌ని అంటున్నారు. లేక‌పోతే.. మున్ముందు.. జ‌న‌సేన పార్టీ నేత‌లు.. ఎలా వ్య‌వ‌హ‌రించినా ఎలా చేసినా .. ఏంకాద‌న్న సంకేతాలు ఇచ్చేసిన‌ట్టు అవుతుంద‌న్న అభిప్రాయాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఏదేమైనా.. పార్టీలో క‌ట్టు త‌ప్పుతున్న ప‌రిస్థితిని స‌రిచేయాల‌ని సీనియ‌ర్లు, మంత్రులు కూడా కోరుతున్నారు.