సేనానీ...యాక్షన్ కి దిగాల్సిందే !
పంచాయతీ ఎన్నికల్లో జనసేనకు సొంత నేతలే నష్టం చేశారంటూ పార్టీ క్యాడర్ నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. తిరుపతి, విజయనగరం, విశాఖ, పోలవరం, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో కొందరు నేతలు వైసీపీతో చేతులు కలిపి పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. డిసెంబర్ 2న జరిగే తుది విడత ఎన్నికలకైనా పవన్ కల్యాణ్ జోక్యం చేసుకుని క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సైనికులు కోరుతున్నారు.
By: Satya P | 30 Nov 2026 1:00 AM ISTజనసేనాని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యాక్షన్ మోడ్ లోకి దిగాల్సిందే అని సైనికులు గట్టిగా కోరుతున్నారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు పూర్తిగా గమనించాలని పార్టీని ఇబ్బంది పెడుతున్న ఇంటి దొంగల సంగతి తేల్చాల్సిందే అని కూడా సూచిస్తున్నారు. పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ జనసేన సిద్ధాంతాలని అమలు చేయాలని కోరుతున్నా కూడా గ్రౌండ్ లెవెల్ లో చాలా చోట్ల కట్టుతప్పుతున్నారని అంటున్నారు. కొందరు పార్టీ నేతలు అయితే అధినేత ఆశయాలని అలాగే ఆయన ఇస్తున్న ఆదేశాలని కూడా పట్టించుకోకుండా తమకు ఇష్టం వచ్చినట్లుగా చేసుకుని పోతున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి.
ప్రత్యర్థులతో కలసి :
ఇదిలా ఉంటే పంచాయతీ ఎన్నికలు మొదటి విడతలో జనసేనకు ఎక్కువ స్థానాలు దక్కాల్సి ఉన్నా కూడా జనసేనలోని కొందరు నేతలు ప్రత్యర్థులతో చేతులు కలిపి సొంత పార్టీకే ఎసరు పెట్టారని గుర్తు చేస్తున్నారు. కేవలం పంచాయతీ ఎన్నికలనే కాదు అంతకు ముందు జరిగిన మునిసిపల్ పరిషత్తు ఎన్నికల్లో కూడా ఇదే తీరున వ్యవహరించారని ఆరోపిస్తున్నారు. దీని వల్లనే జనసేనకు బలం ఉన్న చోట్ల ఓటమి పాలు అయింది అని ఎత్తి చూపిస్తున్నారు. ఉదాహరణకు పోలవరం వంటి బలమైన జనసేన కేడర్ ఉన్న జిల్లాల్లోనూ పార్టీకి ఎదురుగాలి వీచిందని అంటున్నారు. ఇదంతా పార్టీలో ఉంటూ వెన్నుపోటు పొడిచిన వారి వల్లనే జరిగింది అని అంటున్నారు.
డబుల్ గేమ్ ఆడుతున్నారా :
జనసేనలో ఉంటూ ప్రత్యర్ధి పార్టీలతో కలిసి డబుల్ గేమ్ ఆడుతున్న తెలివైన నేతల సంగతి కనిపెట్టి పనిపట్టాలని కూడా పార్టీలో డిమాండ్ వస్తోంది. ఇక పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఏలూరు జిల్లాలో కొందరు జనసేన నేతల తీరు బాగా లేదని ఆ పార్టీ క్యాడర్ గుస్సా అవుతోంది. వైసీపీ ప్రభుత్వం చేసిన అవినీతి అన్యాయాల మీద జనసేన అగ్ర నాయకత్వం ఒక వైపు రాజీలేని పోరాటం చేసి కూటమిని అధికారంలోకి తీసుకుని వచ్చిందని అదే సమయంలో వైసీపీలో జనసేన నేతలు కొందరు మిలాఖత్ అవుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతే కాదు కూటమి ప్రభుత్వం ఐక్యతను అలాగే రాష్ట్ర అభివృద్ధిని పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతున్నా కూడా పార్టీ విధానాలకు వ్యతిరేకంగా కొందరు వ్యవహరిస్తున్నారు అని కూడా ఫిర్యాదులు వస్తున్నాయి.
కూటమికి దెబ్బ కొట్టి :
ఇదిలా ఉంటే రాష్ట్రంలోని తిరుపతి, విజయనగరం, విశాఖ, పోలవరం, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో కూటమి బలపరిచిన జనసేన అభ్యర్థులకు సొంత పార్టే వారే దెబ్బ కొట్టారు అని అంటున్నారు. పార్టీ అభ్యర్ధులకు దన్నుగా ఉండాల్సిన నేతలు కొందరు వైసీపీతో చేతులు కలపడం అన్నదే ఇపుడు జనసేన పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇక ఈ రకమైన విపరీత చేష్టలకు పరాకాష్ట ఏమిటి అంటే పెదవేగి మండలం విజయరాయిలో జనసేన కండువాలు కప్పుకుని పవన్ కళ్యాణ్ ఫోటోలతో వైసీపీ అభ్యర్థికి ఓట్లు అడుగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడం అని అంటున్నారు. దాంతోనే జనసేన ఓటమి ఎందువల్ల అనేక చోట్ల జరిగింది అన్నది అధినాయకత్వం పూర్తి స్థాయిలో విచారణ చేయాలని కోరుతున్నారు.
తుది విడతలో అయినా :
ఇక ఏపీలో పంచాయతీ ఎన్నికలు తుది విడత డిసెంబర్ 2వ తేదీన జరగనుంది. అప్పటికి అయినా అంతా సెట్ చేస్తే కనుక పార్టీ తలెత్తుకునేలా ఫలితాలు వస్తాయని అంటున్నారు. ఇప్పటికీ పంచాయతీ ఎన్నికల ఫలితాలలో టీడీపీ బాగానే సీట్లు దక్కించుకున్నా జనసేన కొంత మేరకు వెనుకబడింది అని గుర్తు చేస్తున్నారు. అంతే కాదు జనసేనకు కచ్చితంగా దక్కుతాయని అనుకున్న పంచాయతీ స్థానాల్లో వైసీపీ గెలవడం మీద కూడా సీరియస్ గా ఆలోచించాలని కోరుతున్నారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ వైసీపీతో కలిసి తిరుగుతున్న వారి మీద క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం అనివార్యం అని పార్టీ వర్గాలలో చర్చ సాగుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
