Begin typing your search above and press return to search.

10 లక్షల మందితో ‘మైటీడీపీ’ యాప్ సరికొత్త రికార్డు.. లోకేశ్ డిజిటల్ వ్యూహం సక్సెస్!

నారా లోకేశ్ రూపొందించిన మైటీడీపీ యాప్‌లో 10 లక్షల మంది క్రియాశీలక కార్యకర్తలు చేరినట్లు టీడీపీ ప్రకటించింది. పార్టీ కార్యక్రమాలు, కార్యకర్తలకు టాస్క్‌లు, శిక్షణ, హాజరు నమోదు వంటి సేవలను ఈ యాప్ ద్వారా అందిస్తోంది. ఫేస్ రికగ్నిషన్‌తో నాయకులతో దిగిన ఫొటోలను కార్యకర్తల ప్రొఫైళ్లకు జోడించే సదుపాయం కూడా ఇందులో ఉంది.

By:  Tupaki Political Desk   |   25 Nov 2026 4:01 PM IST
10 లక్షల మందితో ‘మైటీడీపీ’ యాప్ సరికొత్త రికార్డు.. లోకేశ్ డిజిటల్ వ్యూహం సక్సెస్!
X

టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ వినూత్న ఆలోచనకు ప్రతిరూపమైన మైటీడీపీ యాప్ పది లక్షల మంది క్రియాశీలక కార్యకర్తలతో సరికొత్త రికార్డు సృష్టించింది. సాంకేతిక పరిజ్ఞానంతో కార్యకర్తలకు చేరువయ్యేందుకు తద్వారా పార్టీ అభివృద్ధికి లోకేశ్ మైటీడీపీ యాప్ ను తీసుకువచ్చారు. ఈ యాప్ ఇప్పుడు 10 లక్షల మంది క్రియాశీలక కార్యకర్తలతో చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిందని అంటున్నారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో కార్యకర్తలు సమర్థంగా పనిచేసేలా మైటీడీపీ యాప్ దిశానిర్దేశం చేస్తుంది. ప్రతిరోజూ పార్టీ కార్యక్రమాలను ముందుగా తెలియజేయడంతోపాటు కార్యకర్తలకు ప్రత్యేక టాస్క్ లు ఇస్తూ ప్రత్యర్థులపై పైచేయి సాధించేలా యాప్ ద్వారా పార్టీ పనిచేస్తుంది. ప్రస్తుతం ప్రతి పార్టీకి సోషల్ మీడియా యాక్టివిస్టులు ఉండగా, టీడీపీ కార్యకర్తలు మాత్రం మైటీడీపీ యాప్ ద్వారా సుశిక్షుతులైన సైనికులుగా పనిచేస్తూ మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారని చెబుతున్నారు. స్థానిక ఎన్నికల్లో కూడా మైటీడీపీ యాప్ ద్వారా కార్యకర్తలకు సమాచారం చేరవేసి పార్టీ అభ్యర్థుల విజయానికి టీడీపీ జాగ్రత్తలు తీసుకుందని, దీనిఅంతటికి మంత్రి లోకేశ్ కారణమంటూ కార్యకర్తలు అభినందిస్తున్నారు.





సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా కొత్త తరం ఆలోచనలకు, సాంకేతికతకు పెద్దపీట వేస్తూ నారా లోకేశ్ పార్టీ నిర్మాణాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేశారనేదానికి మైటీడీపీ యాప్ నిదర్శనమని వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే ట్యాబ్‌లు, లైవ్ డేటా ఫీడ్స్, రియల్-టైమ్ డ్యాష్‌బోర్డులతో కోట్లాది మంది సభ్యత్వ నమోదును విజయవంతంగా నిర్వహించిన ఆయన, ఇప్పుడు ‘మైటీడీపీ’ ద్వారా దాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లారని చెబుతున్నారు. గతంలో మారుమూల గ్రామంలో పార్టీ జెండా మోసే కార్యకర్త పడే కష్టం అధిష్ఠానానికి చేరడం కష్టంగా ఉండేది. కానీ నేడు కార్యకర్తే కేంద్రంగా రూపొందిన ఈ డిజిటల్ వ్యవస్థ ద్వారా క్షేత్రస్థాయిలో కార్యకర్త వేసే ప్రతి అడుగూ నేరుగా నాయకత్వానికి తెలుస్తోంది. ఇంటింటి ప్రచారం, సేవా కార్యక్రమాలు, పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాల వివరాలను ఎప్పటికప్పుడు యాప్‌లో నమోదు చేయడం ద్వారా పార్టీకి, కార్యకర్తలకు మధ్య ఒక పటిష్ఠమైన డిజిటల్ వంతెన నిర్మితమైందని చెబుతున్నారు.

దేశంలోని ప్రాంతీయ పార్టీల్లో మరెక్కడా లేని విధంగా వినూత్న ఫీచర్లతో ఈ యాప్‌ను తీర్చిదిద్దారు. పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ‘మహానాడు’ను డిజిటల్ వేదికపై నిర్వహించడంతో పాటు, కార్యకర్తల సమావేశాలు, శిక్షణా తరగతుల హాజరును సైతం డిజిటలైజ్ చేసి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ నియోజకవర్గాల్లో పర్యటించినప్పుడు కార్యకర్తలు వారితో దిగే ఫొటోలు, ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా నేరుగా వారి ఫోన్లలోని ‘ఫొటో బూత్’ విభాగంలోకి చేరే సదుపాయం క్యాడర్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఒక్కసారి యాప్‌లో తమ ముఖాన్ని స్కాన్ చేసుకుంటే చాలు, ఆ తర్వాత నాయకులతో ఎప్పుడు ఫొటో దిగినా ఆటోమేటిక్‌గా వారి ప్రొఫైల్‌లోకి చేరేలా రూపొందించిన ఈ సాంకేతికత పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.

మొత్తంగా ‘మైటీడీపీ’ యాప్‌లో 10 లక్షల మంది భాగస్వాములు కావడం కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో తెలుగుదేశం క్యాడర్ చూపుతున్న చైతన్యానికి, పార్టీ పట్ల వారికి ఉన్న అంకితభావానికి నిదర్శనంగా అభివర్ణిస్తున్నారు. విపక్షంలో ఉన్నప్పుడు కష్టకాలంలోనూ పార్టీ జెండాను మోసిన కార్యకర్తలకు నేడు సాంకేతికత ద్వారా అండగా నిలుస్తూ, భవిష్యత్ రాజకీయాలకు నారా లోకేశ్ ఒక స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను అందించారు. కార్యకర్తే పార్టీకి అసలైన బలం.. ఆ కార్యకర్తకు అండగా నిలిచే డిజిటల్ బలమే ‘మైటీడీపీ’ అని ఈ మైలురాయి మరోసారి రుజువు చేసిందని వ్యాఖ్యానిస్తున్నారు.