పవన్ పై సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న వారికి గట్టి షాక్.. అరెస్ట్
పవన్ కళ్యాణ్‌పై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన గుంటూరు జిల్లా వడ్డేశ్వరానికి చెందిన రవీంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. పిఠాపురం జనసేన నాయకుల ఫిర్యాదుతో ఈ చర్యలు తీసుకున్నారు. పవన్ వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని పోస్టులు పెడుతున్న మరికొందరిపైనా పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
By: A.N.Kumar | 12 Nov 2026 9:54 AM ISTరాజకీయాల్లో ఎన్ని విభేదాలున్నా ఒకరి వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలనే కనీస మానవత్వాన్ని నేడు కొందరు మర్చిపోతున్నారు. సోషల్ మీడియా ముసుగులో కొందరు చేస్తున్న వ్యక్తిత్వ హననం ఆవేదన కలిగిస్తోంది. పవన్ వ్యక్తిగత జీవితంపై విషం చిమ్ముతున్న వారి ఆగడాలకు ఎట్టకేలకు పోలీసులు కళ్లెం వేస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులు సైతం సంయమనం పాటిస్తున్న చోట.. కొందరు ఆకతాయిల విద్వేషపూరిత పోస్టులు వారిని కటకటాల వెనక్కి నెడుతున్నాయి.
ఏపీలో ప్రత్యర్థి, తోటి పార్టీలన్నీ ఏకమై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం తెలుగు రాజకీయాల్లో ఒక సహృద్భావ వాతావరణానికి నాంది పలికింది. తొలిసారి టీడీపీ, వైసీపీ అధిష్టానాలు పవన్ విడాకుల విషయంలో ఏ నేతలు స్పందించవద్దని.. ఆయన వ్యక్తిగత నిర్ణయానికి గౌరవం ఇస్తూ సైలెన్స్ పాటించాలని ఆదేశాలిచ్చాయి. దీనిపై వైసీపీ నేతలు కూడా స్పందించకుండా హుందాగా వ్యవహరిస్తున్నారు.
అయితే నేతలు మౌనం వహించినా.. నేటి కాలంలో సోషల్ మీడియా మాత్రం తన విశృంఖలత్వాన్ని విడనాడడం లేదు. ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ లలో పవన్ విడాకులపై కొందరు తమ ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తూ ఆయన పాత వీడియోలు, వ్యక్తిగత విషయాలపై ఇష్టానుసారంగా ప్రచారం చేస్తున్నారు. పవన్ వ్యక్తిత్వాన్ని కించపరిచే వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో కొందరు దురంహకారుల వల్ల ఎక్కువైపోయాయి. ఈ విష సంస్కృతి పెచ్చరిల్లడంతో ఫిర్యాదులు వెల్లువెత్తాయి.. ఇది అరెస్ట్ లకు దారితీసింది..
పవన్ కళ్యాణ్ పై తాజాగా సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన గుంటూరు జిల్లా వడ్డేశ్వరానికి చెందిన రవీంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. పవన్ గౌరవానికి భంగం కలిగేలా పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు మధ్య విభేదాలు సృష్టించేలా పోస్టులు ఉన్నాయంటూ పిఠాపురం జనసేన నాయకుల ఫిర్యాదుతో పోలీసులు ఈ చర్యలకు ఉపక్రమించారు.
ఇక ఇదొక్కటే కాదు.. పవన్ పర్సనల్ లైఫ్ పై పోస్టులు పెట్టినవారిపైనా భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఎవరైతే సోషల్ మీడియా పవన్ ను కించపరిచేలా పోస్టులు పెడుతున్నారో వారందరిపై చర్యల దిశగా పోలీసులు కసరత్తు చేస్తున్నారు.
ఇక జనసేన హ్యాండిల్స్ అభిమానులు కూడా పవన్ పై సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తూ వారిని అరెస్ట్ చేసేలా చేస్తున్నారు.
అయితే సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు, బల్క్ పోస్టులు, విదేశాల నుంచి పవన్ పై వ్యక్తిత్త హననం కొనసాగుతూనే ఉంది. ఊరు పేరు లేని అకౌంట్ల ద్వారా పవన్ పై వీడియోలు, కామెంట్లు, విద్వేష ప్రచారాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయని జనసైనికులు అంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం, పోలీసులు ఆ అకౌంట్లను తొలగించాలని కోరుతున్నారు.
ఇప్పటికైనా పవన్ ప్రైవసీ విషయంలో ఈ సోషల్ మీడియా ఉత్సాహవంతులు గౌరవంగా వ్యవహరిస్తే మంచిదని.. ఇలాంటి విమర్శలు, కించపరిచే చేష్టల వల్ల జైలు పాలు కాక తప్పదని జనసైనికులు హెచ్చరిస్తున్నారు. పవన్ జీవితంలోని వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో అభాసుపాలు చేసేలా వ్యవహరించవద్దని సూచిస్తున్నారు.
