Begin typing your search above and press return to search.

యార్ల‌గ‌డ్డ‌కు లోకేష్ మ‌ద్ద‌తు.. గ‌న్న‌వ‌రంలో యూట‌ర్న్‌..!

గన్నవరం జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఓటమి టీడీపీలో అంతర్గత విభేదాలకు కారణమైంది. బీజేపీ అభ్యర్థి చిగురుపాటి కుమారస్వామి 63 ఓట్ల తేడాతో ఓడిపోవడంతో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుపై సొంత పార్టీ నేతలే ఆరోపణలు చేస్తున్నారు. ఈ పరిణామాలపై మంత్రి నారా లోకేష్ ఆరా తీసినట్లు సమాచారం. గెలుపోటములు సహజమని, ఎమ్మెల్యేపై నిందలు వేయకుండా సమన్వయంతో పనిచేయాలని పార్టీ నేతలకు సూచించినట్లు తెలుస్తోంది.

By:  Garuda Media   |   16 Nov 2026 2:11 AM IST
యార్ల‌గ‌డ్డ‌కు లోకేష్ మ‌ద్ద‌తు.. గ‌న్న‌వ‌రంలో యూట‌ర్న్‌..!
X

గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే, టీడీపీ నాయ‌కుడు యార్లగడ్డ వెంకట్రావుపై తీవ్ర‌స్థాయిలో దుమారం రేగింది. ప్ర‌త్య‌ర్థి ప‌క్షం వైసీపీ స‌హా సొంత పార్టీ నాయ‌కులు కూడా ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తూ.. సోష‌ల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. స్థానిక జడ్పీటీసీ ఎన్నికల ఫలితాల అనంత‌రం ఈ విమర్శలు వెల్లువెత్త‌డం గ‌మ‌నార్హం. కూటమి అభ్యర్థి ఓటమికి ఆయనే కారణమంటూ సొంత పార్టీలోని ఒక వర్గం, అలాగే ఇతర నేతలు విమర్శలు చేయడంతో నియోజకవర్గ రాజకీయాలు వేడెక్కాయి.

జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి , బీజేపీనేత ఓటమి పాల‌య్యారు. గన్నవరం జడ్పీటీసీ ఉప ఎన్నికలో కూటమి తరపున పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి చిగురుపాటి కుమారస్వామిపై వైఎస్సార్‌సీపీ అభ్యర్థి 63 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులకు యార్లగడ్డ వెంకట్రావు అండగా ఉండటం వల్లే వైసీపీ అభ్యర్థి గెలిచారని కొందరు స్థానిక టీడీపీ నేతలు ఆరోపించారు. ఎమ్మెల్యే నాయకత్వంపై కొంతకాలంగా ఒక వర్గం అసంతృప్తిగా ఉన్నట్లు వార్త‌లు కూడావ‌స్తున్నాయి.

ఎమ్మెల్యే యార్లగడ్డ ఈ వ్య‌వ‌హారంపై తీవ్ర‌ భావోద్వేగంతో స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణలు, సోషల్ మీడియా ట్రోలింగ్‌పై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్ద కాలంగా నియోజకవర్గంలో తాను చేసిన కృషి కార్యకర్తలకు తెలుసని, బీజేపీ అభ్యర్థి 63 ఓట్లతో ఓడిపోతే తనపై నిందలు వేయడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. ఈ పరిణామాల మధ్య మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలపై యార్లగడ్డ తీవ్రంగా స్పందిస్తూ సవాలు విసిరారు. మరోవైపు, యార్లగడ్డ వ్యాఖ్యలకు కౌంటర్‌గా వైసీపీ జడ్పీటీసీ అనగాని రవి విమర్శలు గుప్పించారు.

లోకేష్ ఆరా..

ఈ ప‌రిణామాలపై మంత్రి నారా లోకేష్ ఆరా తీశార‌ని స్థానిక నాయ‌కులు తెలిపారు. గెలుపు - ఓట‌ములు స‌హ‌జ‌మ‌ని .. ఎమ్మెల్యేపై నింద‌లు వేయ‌డం మానుకోవాల‌ని సొంత పార్టీ నాయ‌కుల‌కు లోకేష్ చెప్పిన‌ట్టు తెలిసింది. అంతే కాదు.. అంద‌రూ క‌లివిడిగా ఉంటూ.. వైసీపీని ఎదుర్కొనే విష‌యంపై ముందుకు సాగాల‌ని ఆయ‌న సూచించారు. బ‌ల‌మైన గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ గ్రాఫ్‌కు ఎలాంటి విఘాతం రాకుండా చూసుకోవాల‌ని సూచించారు. ముఖ్యంగా ఎమ్మెల్యే వ‌ర్గం.. పార్టీ వ‌ర్గంఅంటూ రెండు ఉండ‌డానికి వీల్లేద‌ని.. మంత్రి, ఎమ్మెల్యే, నియోజ‌క‌వ‌ర్గం నేత‌లు స‌మన్వ‌యంతో ముందుకు సాగాల‌ని లోకేష్ తేల్చి చెప్పార‌ని నాయ‌కులు చెబుతున్నారు.