Begin typing your search above and press return to search.

ఎన్నిక‌లు ముగిశాయి.. టీడీపీలో గొడ‌వ‌లు పెరిగాయి!

ఏపీ స్థానిక ఎన్నికల ఫలితాల తర్వాత కూటమి పార్టీల్లో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. గన్నవరంలో ఓటమికి ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు వైఖరే కారణమంటూ టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. అనంతపురంలోనూ వైసీపీ గెలుపునకు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే కారణమంటూ కొందరు నేతలు ఆరోపిస్తున్నారు. ఓటమిపై నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది.

By:  Garuda Media   |   13 Nov 2026 9:00 PM IST
ఎన్నిక‌లు ముగిశాయి.. టీడీపీలో గొడ‌వ‌లు పెరిగాయి!
X

స్థానిక ఎన్నిక‌ల పోలింగ్ ముగిసిపోయి.. ఫ‌లితాలు కూడా వ‌చ్చేసిన విష‌యం తెలిసిందే. ఇక‌, మ‌రో వారంలో కొత్త మేయ‌ర్లు, కొత్త కార్పొరేట‌ర్లు ప్ర‌మాణ స్వీకారం కూడా చేయ‌నున్నారు. అలానే మునిసిపాలిటీల‌లో చైర్మ‌న్‌లు, కౌన్సిల‌ర్లు కూడా.. బాధ్య‌త‌లు చేప‌ట్టేందుకు రెడీ అయ్యారు. ఇదిలావుంటే.. ఎన్నిక‌ల స‌మ‌యంలో కొంద‌రు టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ అభ్య‌ర్థులు ప‌రాజ‌యం పాల‌య్యారు. వీరి వ్య‌వ‌హారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. త‌మ పార్టీ నాయ‌కులు అనుస‌రించిన విధానాల వ‌ల్లే తాము ఓడామంటూ.. తమ త‌మ‌ పార్టీల‌కు చెందిన సీనియ‌ర్ నాయ‌కు ల‌నే ఓడిపోయిన వారు విమ‌ర్శిస్తున్నారు.

దీంతో టీడీపీలో నాయ‌కులకు-నాయ‌కుల‌కు మ‌ధ్య అంత‌ర్యుద్ధం పెరుగుతోంది. తాజాగా గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావుపై స్థానిక టీడీపీ నాయ‌కులు, ముఖ్యంగా స్థానికంలో ఓడిపోయిన వారు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వ‌చ్చిన యార్ల‌గడ్డ‌.. ఇప్ప‌టికీ వైసీపీకి అనుకూలంగా ప‌నిచేస్తున్నార‌ని వారు ఆరోపించారు. ఇటీవ‌ల గ‌న్న‌వ‌రంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ భారీగా పుంజుకుంది. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ వ‌ర్గం ఇక్క‌డ పుంజుకుంది. ఈ ప‌రిణామాల‌పైనే ఓడిపోయిన వారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

వంశీ అనుచ‌రుల‌కు ఎమ్మెల్యే యార్ల‌గ‌డ్డ అండ‌గా ఉన్నార‌ని.. అందుకే వారు విజ‌యం ద‌క్కించుకున్నార‌ని కొందరు విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ ప‌రిణామాలపై ఎమ్మెల్యే తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ''నాకు అవమానాలు, విమర్శ లు కొత్త కాదు. దశాబ్దం ‌కాలంగా నేను గన్నవరం లో ఏం చేశానో అభిమానులు, కార్యకర్త లకు తెలుసు. ఎవడు పడితే వాడు ఏదొకటి మాట్లాడుతున్నాడు జగన్నవరం‌లో 63 ఓట్ల తో‌ బిజెపి జడ్పీటీసీ సభ్యులు ఓడిపోతే అవతల పక్షం పొంగిపోతోంది. పొత్తలకారణంగా మిత్ర ధర్మం వల్ల యాభై శాతం సీట్లు బిజెపికి కేటాయించా. మ‌న అభ్య‌ర్థులు ఓడిపోవడం నాకు‌ కూడా చాలా బాధ కలిగించింది.'' అని పేర్కొన్నారు.

అనంత‌పురంలో కూడా ఇలాంటి వివాద‌మే జ‌రుగుతోంది. అనంత కార్పొరేష‌న్ పీఠాన్ని వైసీపీ సొంతం చేసుకుంది. దీనికి కార‌ణాల‌ను టీడీపీ అన్వేషిస్తోంది. అయితే.. స్థానిక ఎమ్మెల్యే కార‌ణంగానే వైసీపీ విజ‌యం ద‌క్కించుకుంద‌ని టీడీపీ నాయ‌కులు బ‌హిరంగ విమ‌ర్శ‌లు చేశారు. ఇక్క‌డి మేయ‌ర్ పీఠాన్ని బీజేపీకి కేటాయించారు. అయితే.. స‌మ‌న్వ‌య లోపంతోనే ఓడిన‌ట్టు చంద్ర‌బాబుకు కూడా నివేదిక‌లు అందాయి. ఇంత‌లోనే ఎమ్మెల్యేపై నాయ‌కులు విమ‌ర్శ‌లు గుప్పిస్తూ.. సోష‌ల్ మీడియాలో తీవ్ర వ్యాఖ్య‌లు గుప్పించారు.