Begin typing your search above and press return to search.

రెండో విడత మున్సిపోల్స్ : అందరి దృష్టి గుడివాడపైనే.. మాటల నాని చేతల్లో చూపగలరా..?

గుడివాడ మున్సిపల్ ఎన్నికలు టీడీపీ, వైసీపీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తిరిగి పట్టు సాధించేందుకు మాజీ మంత్రి కొడాలి నాని ప్రయత్నిస్తున్నారు. గత పరిషత్ ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ ఆధిక్యం సాధించడంతో మున్సిపల్ పోరు ఆసక్తికరంగా మారింది. ఈ ఎన్నికల్లో గెలుపుతో తన బలం నిరూపించుకోవాలని నాని భావిస్తున్నారు. ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.

By:  Tupaki Political Desk   |   17 Nov 2026 12:33 AM IST
రెండో విడత మున్సిపోల్స్ : అందరి దృష్టి గుడివాడపైనే.. మాటల నాని చేతల్లో చూపగలరా..?
X

రాష్ట్రంలో 23 పట్టణ సంస్థలకు ఎన్నికలు జరుగుతుండగా, కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపాలిటీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించిన గుడివాడ ఒకప్పుడు ఆ పార్టీకి కంచుకోటగా ఉండేది. అయితే ఆ తర్వాత మాజీ మంత్రి కొడాలి నాని అడ్డాగా మారిపోయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కొడాలి నానిని ఓడించిన టీడీపీ మళ్లీ పూర్వవైభవం దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో తాజాగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు రెండు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ముఖ్యంగా మాజీ మంత్రి కొడాలి నానికి జీవన్మరణ పోరాటంగా మారాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

గుడివాడ నుంచి వరుసగా నాలుగుసార్లు గెలిచిన కొడాలి నాని 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ఓడిపోయారు. అయితే అప్పటి నుంచి నియోజకవర్గంలో తిరిగి నిలదొక్కుకునేలా ఆయన ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో తాను మళ్లీ పోటీచేయనని చెప్పినప్పటికీ కూటమి గాలిలో ఆయనకు పరాజయం తప్పలేదు. ఆ తర్వాత నానిని పలు కేసులు చుట్టుముట్టాయి. అదే సమయంలో ఆయన అనారోగ్యానికి గురికావడంతో కొంతవరకు నియోజకవర్గానికి దూరమయ్యారు. స్థానిక ఎన్నికల సమయంలో మళ్లీ యాక్టివ్ అయిన నాని గుడివాడలో తన సత్తా ఏంటో చూపుతానని ప్రకటనలు చేశారు. అయితే జడ్పీ, మండల పరిషత్ ఎన్నికల్లో ఆయన శపథం ఎటువంటి ప్రభావం చూపలేదు. దాదాపు 97 శాతం స్ట్రైక్ రేటుతో టీడీపీ కూటమి గుడివాడ నియోజకవర్గాన్ని దున్నేసింది.

ఆ పార్టీకి పుట్టిన గడ్డగా గుడివాడ చెప్పుకున్నా, ఈ నియోజకవర్గ పరిధిలోని నందివాడ మండలంలో టీడీపీ ఎప్పుడూ గెలవలేదు. కానీ ఈ సారి ఆ రికార్డు బద్దలైంది. దీంతో స్థానిక ఎన్నికల్లో మాజీ మంత్రి కొడాలి నాని వైఫల్యంపై విస్తృత చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నిక ఆయనకు విషమ పరీక్షగా మారింది. గుడివాడలో గెలవడం ద్వారా తన పట్టు సడలలేదని నిరూపించుకోవాలని నాని తాపత్రయపడుతున్నారు. చైర్మను నామినేషన్ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించి బలాన్ని నిరూపించుకున్నారని అంటున్నారు. అయితే వెంట వచ్చిన కార్యకర్తలు ఎంతవరకు విజయం సాధించేందుకు ఉపయోగపడతారో చూడాలంటే ఈ నెల 26 వరకు వేచిచూడాల్సివుంది.

తన వాగ్దాటితో రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నాని మున్సిపల్ ఎన్నికల్లో ఎంతవరకు ఫలితాలు సాధిస్తారనే ఉత్కంఠ ఎక్కువగా ఉంది. పరిషత్ ఎన్నికలతో ఊహించని పరాభవం ఎదుర్కొన్న మాజీ మంత్రి మున్సిపల్ ఎన్నికల్లో ఆ ప్రభావం లేకుండా చూసుకోవాల్సివుంది. చైర్ పర్సన్ అభ్యర్థి కరుణ నామినేషన్ సందర్భంగా వైసీపీ శ్రేణులు ఉత్సాహంగా కనిపించడంతో కొడాలి నానికి ఊపిరి వచ్చిందని అంటున్నారు. అయితే 12 ఏళ్లుగా మున్సిపాలిటీకి ఎన్నికలు జరగకపోవడం, వార్డుల వారీగా ఎవరి బలం ఎంత అనే అంచనా లభించడం వల్ల కొంత ఇబ్బంది ఎదురవుతోందని అంటున్నారు. ఇదే సమయంలో మాజీ మంత్రికి పట్టణంలో పెద్ద ఎత్తున పరిచయాలు ఉండటం లాభిస్తుందని వైసీపీ అంచనా వేస్తోంది. ఏదిఏమైనా గుడివాడ ఫలితమే మాజీ మంత్రి కొడాలి నాని భవిష్యత్తును నిర్దేశిస్తుందని చెబుతున్నారు.