Begin typing your search above and press return to search.

కొడాలికి లోకల్ షాక్.. గుడివాడలో తొలిసారి టీడీపీ ఇలా..

గుడివాడ నియోజకవర్గంలో స్థానిక ఎన్నికల్లో టీడీపీ భారీ విజయాలు సాధించింది. గతంలో ఎన్నడూ గెలవని నందివాడ మండలంలో ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకుంది. నియోజకవర్గంలో 96.87 శాతం స్ట్రైక్ రేట్‌తో పాటు 32 ఎంపీటీసీ, 3 జడ్పీటీసీ స్థానాలను గెలుచుకున్నట్లు కథనం పేర్కొంది. దీంతో మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని రాజకీయ భవిష్యత్తుపై వైసీపీలో చర్చ మొదలైంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఓటమి నేపథ్యంలో గుడివాడ ఫలితాలను మాత్రమే నానికి ఆపాదించడం సరికాదని ఆయన మద్దతుదారులు వాదిస్తున్నారు.

By:  Tupaki Political Desk   |   8 Nov 2026 7:04 PM IST
కొడాలికి లోకల్ షాక్.. గుడివాడలో తొలిసారి టీడీపీ ఇలా..
X

రాష్ట్రంలో ప్రతిష్టాత్మక నియోజకవర్గాల్లో ఒకటైన గుడివాడలో అధికార టీడీపీ కూటమి చిరస్మరణీయ విజయాలు నమోదు చేసింది. పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నడూ గెలవని నందివాడ మండల పీఠాన్ని జడ్పీటీసీ స్థానాన్ని పసుపు పార్టీ కైవసం చేసుకుంది. నిజానికి గుడివాడ టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) సొంత నియోజకవర్గం. పార్టీని స్థాపించిన వెంటనే జరిగిన తొలి ఎన్నికల్లో ఎన్టీఆర్ గుడివాడ నుంచే గెలిచారు. ఆ తర్వాత మరోసారి ఇక్కడి నుంచే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మూడుసార్లు తప్ప మరెప్పుడూ టీడీపీ ఓడిపోలేదు. కానీ, గత నాలుగు ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచిన మాజీ ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు (నాని) టీడీపీకి కొరగాని కొయ్యగా తయారయ్యారు. దీంతో గుడివాడ నియోజకవర్గం టీడీపీకి అత్యంత ప్రాధాన్యంగా మారిపోయింది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి సొంత నియోజకవర్గం పులివెందలపై ఎంతలా ఫోకస్ చేశారో గుడివాడపైనా అంతే గురిపెట్టారు. దీంతో మాజీ మంత్రి కొడాలి నాని స్థానిక ఎన్నికల్లో చేతులు ఎత్తేశారని చెబుతున్నారు.

రెండు సార్లు టీడీపీ నుంచి, మరో రెండు సార్లు వైసీపీ తరఫున గుడివాడ ఎమ్మెల్యేగా కొడాలి నాని ఎన్నికయ్యారు. అయితే గత ప్రభుత్వంలో ఆయన వివాదాస్పద వైఖరి కారణంగా గుడివాడ నియోజకవర్గం టీడీపీకి టార్గెట్ గా మారింది. గుడివాడను తన కంచుకోటగా మార్చుకున్న నానిని మట్టి కరిపించాలనే లక్ష్యంతో పావులు కదిపింది. పట్టుబట్టినట్లే అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ మంత్రి నానిని ఓడించిన టీడీపీ, ఇప్పుడు స్థానిక ఎన్నికల్లోనూ ఆయనను నామమాత్రం చేసింది. దీంతో నాని రాజకీయంగా గడ్డుకాలం ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని అంటున్నారు. నిజానికి రాజకీయాల్లోకి వచ్చిన తొలి నాళ్లలో టీడీపీ తరఫున గెలిచిన నాని, ఆ తర్వాత నియోజకవర్గాన్ని తన కంచుకోటగా మార్చుకున్నారు. వ్యక్తిగత ఇమేజ్ పెంచుకుని తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబును నేరుగా టార్గెట్ చేయడంతో కొడాలి రాజకీయంగా సవాళ్లను ఎదుర్కోవాల్సివస్తోందని అంటున్నారు.

గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎక్కువగా హైదరాబాదుకే పరిమితమైన కొడాలి నాని స్థానిక ఎన్నికల్లో తన సత్తా చూపుతానని ప్రతినబూనారు. ఆయనకు ఉన్న మాస్ ఇమేజ్ కారణంగా గుడివాడలో మంచి మెజార్టీతో గెలుస్తారని వైసీపీ భావించింది. కానీ, కూటమి ప్రభుత్వ దూకుడుతో నాని చేతులెత్తాయాల్సివచ్చిందని ఫలితాలు నిరూపిస్తున్నాయి. నియోజకవర్గంలోని 96.87 శాతం స్ట్రైక్ రేటుతో ఊహించని విజయాలను టీడీపీ సొంతం చేసుకుంది. ఇందులో ప్రధానంగా గతంలో ఎన్నడూ గెలవని నందివాడ మండలంలో టీడీపీ విజయాలు ఆసక్తికరంగా మారాయి. పార్టీ ఆవిర్భావం నుంచి నందివాడలో టీడీపీ గెలవలేదని అంటున్నారు. అలాంటి చోట ఇప్పుడు ఎంపీపీ పీఠంతోపాటు జడ్పీటీసీని గెలుచుకుని సరికొత్త రికార్డు నమోదు చేసిందని చెబుతున్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో 32 ఎంపీటీసీ స్థానాలు, 3 జడ్పీటీసీ స్థానాలు కూడా టీడీపీ పరమయ్యాయి.

ఈ ఫలితాలతో కొడాలి నాని రాజకీయ భవిష్యత్తుపై రకరకాల చర్చ జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో చివరి ఎన్నికలు అంటూ ప్రచారం చేసినప్పటికీ ఓటమే ఎదురైంది. ఇక రెండున్నరేళ్ల తర్వాత కూడా పార్టీ బలం ఏమాత్రం పెరగకపోవడంతో నాని రాజకీయ జీవితం సందిగ్ధంలో పడినట్లుగా పరిశీలకులు భావిస్తున్నారు. అయితే స్థానిక ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ పరాజయం పాలైందని, గుడివాడలో భిన్నమైన ఫలితాలు ఎలా వస్తాయని ఆయన మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో రాయలసీమ, పల్నాడు జిల్లాల్లో జరిగిన ఎన్నికలకు కోస్తా ప్రాంతంలో జరిగిన ఎన్నికలకు తేడా ఉందని, ఈ ప్రాంతంలో బొత్స, జక్కంపూడి రాజా, వల్లభనేని వంశీ వంటివారు తమ మద్దతుదారులను గెలిపించుకుని కూటమికి సవాల్ విసిరారని పరిశీలకులు ఎత్తిచూపుతున్నారు. అయితే ఈ లిస్టులో ఉంటారని భావించిన కొడాలి నాని పేరు లేకపోవడంపై వైసీపీ శ్రేణులు సైతం నిరాశ వ్యక్తం చేస్తున్నాయి.