Begin typing your search above and press return to search.

జగన్ పాదయాత్రకు పోటీగా షర్మిల...విజయసాయి ?

2029 ఎన్నికలే లక్ష్యంగా ఏపీలో పాదయాత్రల సందడి మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. జగన్ 2027 మార్చి తర్వాత పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. పీఆర్పీ అధినేత విజయసాయిరెడ్డి ఉగాది తర్వాత శ్రీకాకుళం నుంచి యాత్ర ప్రారంభిస్తానని ప్రకటించారు. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల కూడా పాదయాత్రకు సిద్ధమవుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

By:  Satya P   |   27 Nov 2026 9:27 AM IST
జగన్ పాదయాత్రకు పోటీగా షర్మిల...విజయసాయి ?
X

ఏపీలో పాదయాత్రల సీజన్ మళ్లీ మొదలు కానుంది. ప్రతీ ఎన్నికకూ పాదయాత్రలు చేయడం నాయకులకు అలవాటుగానే ఉంది అన్నది తెలిసిందే. ఈ పాదయాత్రల వల్ల అధికార పీఠాలు కూడా దక్కుతున్న నేపథ్యం కూడా ఉంది. 2004 ఎన్నికలకు ముందు వైఎస్సార్ పాదయాత్ర చేస్తే ఉమ్మడి ఏపీలో అధికారం దక్కింది. అలాగే 2012లో చంద్రబాబు పాదయాత్ర చేస్తే విభజన ఏపీలో పవర్ చేజిక్కింది. ఇక 2017లో జగన్ పాదయాత్రతో 2019లో అధికారం అందుకున్నారు. 2023లో లోకేష్ పాదయాత్ర టీడీపీ కూటమి అధికారంలోకి రావడానికి కారణం అయింది. ఇలా చూస్తే 2029 ఎన్నికల కోసం కూడా పాదయాత్రలకు నాయకులు సిద్ధపడుతున్నారు. జగన్ పాదయాత్ర అయితే 2027 లో పక్కా అని అంటున్నారు.

ముందుకు జరిపి మరీ :

జగన్ పాదయాత్ర 2027 అక్టోబర్ లో ఉండొచ్చు అన్నది ఇప్పటిదాకా వినిపించిన మాట. కానీ మరి కొద్ది నెలలు ముందుకే ఈ పాదయాత్ర జరిపారు అని అంటున్నారు. అలా చూస్తే జగన్ 2027 మార్చి తరువాత పాదయాత్రకు సిద్ధపడతారు అని అంటున్నారు. ఇక జగన్ పాదయాత్ర అన్నది ఫిక్స్ అయిన విషయమే కానీ మరో రెండు పాదయాత్రలకు కూడా రంగం సిద్ధం అవుతోంది అని అంటున్నారు. అందులో ఒకటి కొత్తగా పీఆర్పీ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పాదయాత్ర అని అంటున్నారు. ఆయన 2027 ఉగాది తరువాత ఏపీలో పాదయాత్ర చేపడతాను అని అంటున్నారు. ఆయన ఢిల్లీలో తాజాగా మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. ఇక విజయసాయిరెడ్డి పాదయాత్ర ఉత్తరాంధ్ర జిల్లాలలో శ్రీకాకుళం నుంచి మొదలవుతుంది అని కూడా అంటున్నారు.

షర్మిల కూడా అంటూ :

ఇప్పటిదాకా ఎక్కడా ప్రకటన అయితే రాలేదు కానీ ఏపీసీసీ అధ్యక్షురాలి హోదాలో వైఎస్ షర్మిల కూడా పాదయాత్ర చేస్తారు అన్నది అయితే ప్రచారంలో ఉంది. ఆమె కూడా 2027 లో పాదయాత్ర చేపట్టవచ్చు అని ఊహాగానాలు ఉన్నాయి. ఇక షర్మిల విషయానికి వస్తే ఆమెకు పాదయాత్రలు కొత్త కాదు, ఆమె గతంలో అంటే 2012లో వైసీపీ తరఫున ఉమ్మడి ఏపీలో పాదయాత్ర చేపట్టారు. ఆమె చేవెళ్ళ నుంచి ఇచ్చాపురం దాకా పాదయాత్ర చేశారు. ఇక 2022లో తెలంగాణలో వైఎస్సార్ టీపీ పేరుతో పార్టీ పెట్టిన షర్మిల అక్కడ కూడా భారీ పాదయాత్ర చేపట్టారు. ఇపుడు ముచ్చటగా మూడోసారి ఏపీలో పాదయాత్ర ఆమె చేయవచ్చు అని ప్రచారం సాగుతోంది.

ముగ్గురు నేతలు పాదయాత్ర :

అదే కనుక జరిగితే ఏపీలో ముగ్గురు నేతలు పాదయాత్ర ఖాయంగా కనిపిస్తోంది. చిత్రమేంటి అంటే షర్మిల విజయసాయిరెడ్ది 2017లో జగన్ పాదయాత్ర చేపట్టినపుడు వైసీపీలోనే ఉన్నారు. ఇపుడు అదే జగన్ కి పోటీగా పాదయాత్ర వేరు పార్టీల నుంచి చేపడతారు అన్నది అయితే ప్రచారంగా ఉంది. మరి ఈ పాదయాత్రలలో ఎవరికి ఎంత ఆదరణ లభిస్తుంది, ఎవరు ఏమి మాట్లాడుతారు, ఎవరు అజెండా ఏమిటి, ఎక్కడ నుంచి పాదయాత్ర మొదలవుతుంది, ఎన్ని వందల వేల కిలోమీటర్లు వీరు పాదయాత్ర చేస్తారు ఎవరిని టార్గెట్ చేస్తారు ఇవన్నీ కూడా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో. ఈ ఊహాగానాలలో నిజమెంత ఉందో.