Begin typing your search above and press return to search.

జగన్ పరీక్షలో పాస్....ఫెయిల్- లిస్ట్ రెడీ ?

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ పెట్టిన పరీక్షలో కొందరు నేతలు మాత్రమే సత్తా చాటినట్లు తెలుస్తోంది. రాయలసీమలో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విజయాలు సాధించగా, ఉత్తరాంధ్రలో రాజన్న దొర, బొత్స సత్యనారాయణ, పాడేరు ఎమ్మెల్యే మత్సరాస విశ్వేశ్వరరావు పార్టీకి మెరుగైన ఫలితాలు అందించారు. మరోవైపు పలువురు సీనియర్ నేతలు ఆశించిన ఫలితాలు సాధించలేకపోవడంతో వైసీపీ అధిష్టానం వారి పనితీరుపై అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

By:  Satya P   |   9 Nov 2026 9:32 AM IST
జగన్ పరీక్షలో పాస్....ఫెయిల్- లిస్ట్ రెడీ ?
X

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పెట్టిన స్థానిక సంస్థల ఎన్నికల పరీక్షలో పాస్ అయిన వారు కొద్ది మంది మాత్రమే తేలడం విశేషం. రాయలసీమ నుంచి చూసుకుంటే మొదటి పేరుగా యువ నేత బైరెడ్డి సిద్దార్ధరెడ్డి ఉంది. ఆయన నంద్యాల మునిసిపాలిటీనే కాదు నంద్యాల జెడ్పీటీసీని కూడా వైసీపీకి గెలిపించారు. తన దూకుడు రాజకీయ శైలి, యువతలో ఉన్న క్రేజ్‌తో ఆయన స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయం కోసం తీవ్రంగా శ్రమించి మంచి ఫలితాలు తెచ్చారు. అలాగే అనంతపురంలో జిల్లా అధ్యక్షుడు మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి కూడా కార్పోరేషన్ ని గెలిపించి జగన్ మన్ననలు అందుకున్నారు. అలాగే డోన్ నియోజకవర్గంలో బేతంచెర్ల నగర పంచాయతీని గెలిపించి డోన్ మునిసిపాలిటీ గెలుపు దాకా తీసుకెళ్ళిన మాజీ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి కూడా పాస్ అయ్యారని అంటున్నారు.

పోరాట స్పూర్తితో :

ఇక నగరిలో వైసీపీ పెద్దగా సీట్లు గెలుచుకోలేకపోయినా మాజీ మంత్రి ఆర్కే రోజా పోరాటం గుర్తించదగినది అంటున్నారు. అలాగే తిరుపతి జిల్లాకు వస్తే చెవిరెడ్డి భాస్కరరెడ్డి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి వంటి వారు ఫైట్ ఇచ్చారని అంటున్నారు. కోస్తాకు వస్తే పల్నాడు జిల్లాలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వంటి వారు ఉన్నారు. గన్నవరం జెడ్పీటీసీని గెలిపించి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ లైం లైట్ లోకి వచ్చారని అంటున్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కూడా తన సత్తా చాటారని అంటున్నారు. సీతానగరం జెడ్పీటీసీ కైవసంతో జనసేన సిట్టింగ్ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సతీమణి ఓటమికి కారణం అయి షాక్ ఇచ్చారని చెబుతున్నారు. రాజానగరం నియోజకవర్గ పరిధిలో వైసీపీ గట్టి పోటీ ఇచ్చి అత్యధిక స్థానాలను సాధించింది. సీతానగరంలోని 21 ఎంపీటీసీ స్థానాల్లో 18 స్థానాలను, అలాగే కోరుకొండలోని 23 స్థానాల్లో 12 స్థానాలను వైసీపీ గెలుచుకుంది అయితే కోస్తాలో అత్యధిక శాతం వైసీపీ లీడర్లు కాడె వదిలేశారు అని అంటున్నారు. అందులో క్రిష్ణా గుంటూర్ జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాలు ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీ నేతలు ఉన్నారని చెబుతున్నారు.

ఉత్తరాంధ్రా హీరోగా :

ఇక ఉత్తరాంధ్రాలో వైసీపీలో ధీటైన పోరాటమే కాదు సక్సెస్ రేటుని కూడా సాధించిన ఉమ్మడి విజయనగరం జిల్లాలోని సాలూరు మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర ఉన్నారు. ఆయన కృషి వల్లనే కేవలం 297 ఓట్ల తేడాతో మున్సిపల్ పీఠం దాకా వచ్చి వైసీపీ జస్ట్ లో కోల్పోయింది అని అంటున్నారు. ఇక 13 మంది కౌన్సిలర్లను గెలిపించుకుని ఉత్తరాంధ్రాలో అత్యధిక విజయం దక్కించుకున్నారు. అలాగే పరిషత్తు ఎన్నికల్లో సాలూరు నియోజకవర్గం జెడ్పీటీసీలు సాలూరు మక్కువలను గెలిపించి మంత్రి గుమ్మడి సంధ్యారాణికే బిగ్ షాక్ ఇచ్చారు. ఇక విజయనగరంలో బొత్స ప్రతికూల పరిస్థితుల్లో కూడా పోరాడి పార్టీకి అయిదు జెడ్పీటీసీలు సాధించారని అలాగే 47 దాకా ఎంపీటీసీలు సాధించగలిగారు అని అంటున్నారు. ఇక మాజీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి తన కుమార్తె శ్రావణిని మేయర్ అభ్యర్థిగా నిలబెట్టి గట్టి పోటీ ఇచ్చారని అలాగే 16 మంది కార్పోరేటర్లు వైసీపీ తరఫున గెలిచారు అని అంటున్నారు.

సీనియర్లు అంతా :

ఇక శ్రీకాకుళంలో చూస్తే ధర్మాన సోదరులు కానీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు వంటి ఉండి కూడా శ్రీకాకుళంలో వైసీపీ ఘోరంగా ఓటమి పాలు అయింది అన్న విమర్శలు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 30 జెడ్పీటీసీస్థానాలకు గాను టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి 29 స్థానాలను కైవసం చేసుకోగా, వైసీపీ కేవలం ఒక స్థానానికి మాత్రమే పరిమితం అయింది. అలాగే ఉమ్మడి విశాఖ జిల్లాలో వైసీపీ నాయకుల రాజకీయ ప్రదర్శన మీద కూడా విమర్శలు ఉన్నాయని అంటున్నారు. విశాఖ అనకాపల్లిలో 28 జెడ్పీటీసీలు ఉంటే ఒక్క సీటు కూడా గెలిపించలేకపోయరు అని అంటున్నారు. ఇక్కడ మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాలనాయుడు వంటి వారు ఉన్నారు. ఇక విశాఖ సిటీలో వైసీపీకి 13 కార్పోరేటర్లు దక్కారు, మూడున్నర లక్షల ఓట్లు మేయర్ అభ్యర్ధికి వచ్చాయి. ఈ విషయంలో వైసీపీ ఎమ్మెల్యే వరుదు కళ్యాణికి అలాగే జిల్లా అధ్యక్షుడు కేకే రాజు పనితీరుకు మంచి మార్కులే వచ్చాయని అంటున్నారు.

పాడేరు ఎమ్మెల్యే హిట్ :

ఇక అల్లూరి జిల్లాలో వైసీపీకి జిల్లా పరిషత్తుని 89 దాకా ఎంపీటీసీలను సాధించి పెట్టిన పాడేరు ఎమ్మెల్యే మత్సరాస విశ్వేశ్వరరావుని పార్టీని వైసీపీ ప్రత్యేకంగా చూస్తోంది అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే వైసీపీలో పెద్ద నాయకులు పోరాడి విఫలం అయ్యారు, కొందరు పోరాటం చేసి ఎంతో కొంత సాధించారు. చాలా మంది మాత్రం తమ పనితీరుతో వైసీపీ హైకమాండ్ అసంతృప్తికి గురి అయ్యారని అంటున్నారు. చూడాలి మరి వైసీపీ ఏ రకమైన యాక్షన్ ప్లాన్ చేస్తుందో.