Begin typing your search above and press return to search.

టెక్ స్టూడెంట్స్ కోసం ఏపీలో అద్భుత ఏఐ వర్సిటీ.. అమరావతిలో మొదలైన 'క్వాంటం' విప్లవం

అమరావతిని క్వాంటం వ్యాలీగా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నీలిట్ తాత్కాలిక క్యాంపస్ ప్రారంభమైంది. క్వాంటం కంప్యూటింగ్, ఏఐ, చిప్ డిజైన్‌లో రూ.47 కోట్లతో నాలుగు ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే జనవరి నుంచి కోర్సులు ప్రారంభం కానుండగా, అమరావతిలో రూ.730.70 కోట్లతో 8.5 ఎకరాల్లో శాశ్వత క్యాంపస్ నిర్మించనున్నారు.

By:  Tupaki Political Desk   |   22 Nov 2026 12:17 AM IST
టెక్ స్టూడెంట్స్ కోసం ఏపీలో అద్భుత ఏఐ వర్సిటీ.. అమరావతిలో మొదలైన క్వాంటం విప్లవం
X

అమరావతిని క్వాంటం వ్యాలీగా తీర్చిదిద్దాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంలో మరో కీలక ముందడుగు పడింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (NIELIT) డీమ్డ్ టు బి యూనివర్సిటీ తాత్కాలిక క్యాంపస్‌ శనివారం ప్రారంభమైంది. గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ANU) సీడీఈ భవనంలో ఈ క్యాంపస్‌‌ను ఏర్పాటు చేశారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఆర్థిక సలహాదారు డాక్టర్ ఎ.ప్రతిభ క్యాంపస్‌ను ప్రారంభించగా, నీలిట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మదన్ మోహన్ త్రిపాఠి పాల్గొన్నారు. క్వాంటం కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగాలకు ప్రత్యేకంగా ఏర్పాటైన ప్రపంచంలోనే తొలి విశ్వవిద్యాలయ క్యాంపస్‌‌గా ఇది చరిత్ర సృష్టించింది. ఏపీ ప్రభుత్వ సహకారంతో నీలిట్ దీనిని నెలకొల్పింది. అమరావతి క్వాంటం వ్యాలీలో నైపుణ్యాభివృద్ధికి ఇది కేంద్రంగా పనిచేస్తుంది. కొత్త భవనాల నిర్మాణం పూర్తయ్యే వరకు వేచి చూడకుండా, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వేదికగా కార్యకలాపాలు మొదలుపెట్టారు. దీనివల్ల రాష్ట్ర యువతకు ప్రపంచస్థాయి విద్య, శిక్షణ తక్షణమే అందుబాటులోకి వచ్చాయి.





కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వేగం

కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ పరిధిలోని స్వయంప్రతిపత్తి కలిగిన శాస్త్రీయ సంస్థ నీలిట్‌కు 'ఇన్‌స్టిట్యూషన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ హోదా ఉంది. కేంద్ర పరిధిలో ఉన్న ఏకైక విశ్వవిద్యాలయం ఇదే. పంజాబ్‌లోని రూపార్‌లో ప్రధాన క్యాంపస్ ఉండగా, దేశవ్యాప్తంగా 11 అనుబంధ క్యాంపస్‌లు ఉన్నాయి. 2026 ఫిబ్రవరి 20న న్యూఢిల్లీలో జరిగిన ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’ వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సమక్షంలో ఏపీ ప్రభుత్వం, నీలిట్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఒప్పందం జరిగిన కేవలం తొమ్మిది నెలల్లోనే క్యాంపస్ కార్యకలాపాలు ప్రారంభం కావడం విశేషం.

రూ. 47 కోట్లతో 4 అత్యాధునిక ప్రయోగశాలలు

మొదటి దశలో భాగంగా తాత్కాలిక క్యాంపస్‌లో రూ.47 కోట్ల వ్యయంతో నాలుగు అత్యాధునిక ప్రయోగశాలలను నీలిట్ సిద్ధం చేస్తోంది. క్వాంటం కంప్యూటింగ్ ల్యాబ్, క్వాంటం కమ్యూనికేషన్ ల్యాబ్, చిప్ డిజైన్ అండ్ వీఎల్ఎస్ఐ ల్యాబ్, ఏఐ అండ్ కంప్యూటింగ్ ల్యాబ్‌లను అందుబాటులోకి తెస్తోంది. ప్రపంచంలోని అగ్రశ్రేణి టెక్నాలజీ సంస్థలు వాడే ఆధునిక పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునే అవకాశం ఈ ల్యాబ్‌ల ద్వారా ఏపీ విద్యార్థులకు లభిస్తుంది. దీనివల్ల వారికి ప్రాథమిక పరిజ్ఞానంతో పాటు ప్రాక్టికల్ అనుభవం కూడా కలుగుతుంది.

వచ్చే జనవరి నుంచి కోర్సులు ప్రారంభం

తాత్కాలిక క్యాంపస్‌లో వచ్చే జనవరి నుంచి తరగతి గదితో పాటు ఆన్‌లైన్‌లోనూ శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయి. రెండు నుంచి మూడు నెలల వ్యవధి కలిగిన 10 అడ్వాన్స్‌డ్ సర్టిఫికెట్ కోర్సులను ఇక్కడ అందిస్తారు. వీటిలో క్వాంటం కంప్యూటింగ్, క్వాంటం కమ్యూనికేషన్, సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో ఏఐ వినియోగం, చిప్ డిజైన్, వీఎల్ఎస్ఐ, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఐవోటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ కోర్సులు ఉన్నాయి. వీటితో పాటు ప్రాచుర్యం పొందిన 'O' లెవెల్ ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తారు. అదనంగా 16 స్వల్పకాలిక కోర్సులను కూడా ప్రవేశపెడుతున్నారు. వీఎల్ఎస్ఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్, బ్యాటరీ మేనేజ్‌మెంట్, బ్లాక్‌చైన్, సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్టింగ్, క్వాంటం టెక్నాలజీ వంటి అంశాలపై వీటిలో శిక్షణ ఇస్తారు. రాష్ట్రంలోని కళాశాలల అధ్యాపకులకు ఈ నూతన సాంకేతికతపై పట్టు పెంచేందుకు 10 విభాగాల్లో ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లు, వర్క్‌షాప్‌లు నిర్వహిస్తారు.

అమరావతిలో 8.5 ఎకరాల్లో శాశ్వత క్యాంపస్

దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా రూ. 730.70 కోట్లతో అమరావతిలో నీలిట్ శాశ్వత క్యాంపస్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి ఈ ఏడాది ఆగస్టులో ఆమోదం తెలిపారు. ఇందుకోసం అమరావతిలోని నిడమర్రు వద్ద 8.5 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. భూమిని రాష్ట్ర ప్రభుత్వం అందించగా.. భవనాల నిర్మాణం, ప్రయోగశాలల ఏర్పాటు, నిర్వహణ ఖర్చులను నీలిట్, కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ భరిస్తాయి. రాబోయే ఐదేళ్లలో ఈ శాశ్వత క్యాంపస్ ద్వారా సుమారు 8,250 మందికి శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో 1,650 మందికి డిగ్రీ కోర్సుల ద్వారా, మరో 6,600 మందికి నైపుణ్యాభివృద్ధి, సర్టిఫికేషన్ కోర్సుల ద్వారా శిక్షణ అందుతుంది. క్వాంటం టెక్నాలజీ, ఏఐ, సెమీకండక్టర్ విభాగాల్లో అండర్ గ్రాడ్యుయేట్ (UG), పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG), డాక్టోరల్ (PhD), డిప్లొమా కోర్సులను ఇక్కడ బోధిస్తారు.

ఐబీఎం క్వాంటం కంప్యూటర్‌పై పనిచేసే అవకాశం

అమరావతి క్వాంటం వ్యాలీలోని ఐబీఎం (IBM) క్వాంటం కంప్యూటర్‌పై ప్రత్యక్షంగా పనిచేసే అరుదైన అవకాశం ఈ విశ్వవిద్యాలయ విద్యార్థులకు లభించనుంది. శాశ్వత క్యాంపస్ సిద్ధమైన వెంటనే ప్రస్తుతం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఉన్న ల్యాబ్‌లు, అధ్యాపకులు, విద్యార్థులను ఎలాంటి అంతరాయం లేకుండా కొత్త క్యాంపస్‌కు తరలిస్తారు. అమరావతితో పాటు రాయలసీమ ప్రాంతంలోనూ నీలిట్ సేవలను విస్తరిస్తున్నారు. ప్రస్తుతం శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని తాత్కాలిక భవనంలో కొనసాగుతున్న 'నీలిట్ తిరుపతి' కేంద్రాన్ని సొంత శాశ్వత క్యాంపస్‌కు తరలించనున్నారు. ఇందుకోసం 3 ఎకరాల భూమిని కేటాయించే ప్రతిపాదనకు ఎస్వీ విశ్వవిద్యాలయం ఇప్పటికే నిరభ్యంతర పత్రం (NOC) జారీ చేసింది. తిరుపతి క్యాంపస్‌లో ప్రధానంగా ఎలక్ట్రానిక్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్, సెమీకండక్టర్ నైపుణ్యాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు.

భవిష్యత్ పరిశ్రమలకు యువత సంసిద్ధం

జాతీయ క్వాంటం మిషన్, ఇండియా ఏఐ మిషన్, ఇండియా సెమీకండక్టర్ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. నీలిట్ క్యాంపస్ ద్వారా శిక్షణ పొందిన నిపుణులు, పరిశోధకులు అమరావతి క్వాంటం వ్యాలీ వ్యవస్థలో భాగస్వాములు అవుతారు. తద్వారా దేశంలో క్వాంటం టెక్నాలజీకి ప్రముఖ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ స్థానం మరింత బలోపేతం కానుంది. ఈ విశ్వవిద్యాలయ ఏర్పాటు వల్ల విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, అధ్యాపకులు, పరిశ్రమలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ మరింత ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారనుంది. నేటి ఉద్యోగావకాశాలకే కాకుండా, భవిష్యత్తులో రాబోయే కొత్త పరిశ్రమలకు అవసరమైన నిపుణులను తయారు చేయడంలో ఈ విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషించనుంది.