Begin typing your search above and press return to search.

'అప్పిరెడ్డి'పై అనుమానాలు.. గుంటూరు వైసీపీలో ఏం జ‌రిగింది..?

గుంటూరు మేయర్ ఎన్నికల్లో వైసీపీ ఓటమి నేపథ్యంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి వ్యవహారంపై పార్టీలో చర్చ జరుగుతోంది. ఆయన అనుచరుడి భార్యకు మేయర్ అభ్యర్థిగా అవకాశం ఇచ్చినా, ప్రచారం నుంచి కౌంటింగ్ వరకు అప్పిరెడ్డి చురుగ్గా వ్యవహరించలేదని స్థానిక నేతలు అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సీటు కేటాయింపుపై అసంతృప్తితోనే ఆయన దూరంగా ఉన్నారనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై వైసీపీ అంతర్గత విచారణ చేపట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మరో కేసులో అరెస్టై జైలులో ఉన్న అప్పిరెడ్డి రాజకీయ భవిష్యత్తుపై ఉత్కంఠ నెలకొంది.

By:  Garuda Media   |   8 Nov 2026 10:00 PM IST
అప్పిరెడ్డిపై అనుమానాలు.. గుంటూరు వైసీపీలో ఏం జ‌రిగింది..?
X

వైసిపి సీనియర్ నాయకుడు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న లేళ్ల అప్పిరెడ్డి వ్యవహారంపై ఆ పార్టీలో చర్చ నడుస్తోంది. గుంటూరు మేయర్ అభ్యర్థిని ఓటమి అనంతరం ఈ చర్చకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. వాస్తవానికి గుంటూరు మేయర్ స్థానం నుంచి వైసీపీ తరఫున పలువురు నాయకులకు జగన్ మోహన్ రెడ్డి అవకాశం కల్పించారు. కానీ వారందరూ తప్పుకున్నారు. అంబటి రాంబాబు కుటుంబం నుంచి ఒకరిని ఎంపిక చేశారు. కారణాలు ఏమైనా ఆమె కూడా పోటీకి దూరంగా ఉన్నారు. ఇక ప్రస్తుతం పార్టీలో లేకపోయినప్పటికీ మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరి కుటుంబం నుంచి కూడా మహిళా అభ్యర్థికి అవకాశం ఇస్తామని ఆహ్వానం ఇచ్చారు.

కానీ అక్కడ కూడా సానుకూల సంకేతాలు రాకపోవడంతో చివరకు అప్పిరెడ్డి అనుచరుడు భార్యకు గుంటూరు మేయ‌ర్‌ స్థానాన్ని ఇచ్చారు. అయితే తాజాగా జరిగిన ఎన్నికల్లో వైసిపి ఓడిపోయింది. సుమారు 35 వేల ఓట్ల మెజారిటీతో టిడిపి అభ్యర్థి లక్ష్మీ అపర్ణ విజయం సాధించారు. ఇదిలా ఉంటే లేళ్ల అప్పిరెడ్డి అనుచరుడి భార్యకు అవకాశం కల్పించినప్పటికీ అప్పిరెడ్డి ఆమెను గెలిపించుకోవడంలో అదేవిధంగా పార్టీ తరఫున పనిచేయడంలోనూ ఉదాసీనంగా వ్యవహరించాలన్నది పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట.

ఇదే విషయాన్ని పార్టీ అధిష్టానానికి స్థానిక నాయకులు చేరవేశారు. కనీసం కౌంటింగ్ రోజు కూడా ఆయన ఎక్కడా కనిపించలేదని కౌంటింగ్ రోజు కార్యకర్తలను కూడా గ్యాదర్ చేసే పరిస్థితి లేకపోయిందని నాయకులు చెబుతున్నారు. నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో కేవలం ఒకరు మాత్రమే ఉన్నారని తద్వారా అసలు ఏం జరిగిందో తెలుసుకునే లోపే పార్టీ పరంగా మద్దతు లభించలేదని కూడా వారు ఆరోపిస్తున్నారు. ఇది అప్పిరెడ్డి పై మరిన్ని అనుమానాలను పెంచేలా చేసింది.

ముందుగానే తాను అడిగిన వారికి సీటు ఇవ్వలేదు అన్నది అప్పిరెడ్డి అనుచరులు చెబుతున్న మాట. పార్టీలోనే ఉన్నప్పటికీ అంతర్గతంగా విభేదాలతో ఉన్న కొంత మంది నాయకులకు అధిష్టానం సీటు ఆఫర్ ఇవ్వడం ఆయనకు నచ్చలేదని అందుకే ప్రచారం నుంచి కౌంటింగ్ వరకు కూడా గుంటూరు మేయర్ స్థానాన్ని వదిలేశారని ఆ వర్గం నాయకులు ఆరోపిస్తున్నారు. దీనిపై ప్రస్తుతం పార్టీ అధిష్టానం అంతర్గతంగా విచారణ చేస్తున్నట్టు తెలిసింది.

మరోవైపు విజయవాడలో ఎన్నికల కార్యాలయంలో నిరసన చేపట్టిన కారణంగా అప్పిరెడ్డి పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆయన అరెస్ట్ అయి.. ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఇంకోవైపు పార్టీ పరంగా ఆయన ఏదో లాలూచీపడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనపై అంతర్గత విచారణ కూడా జరుగుతుంది. మొత్తంగా ఇప్పటివరకు బలంగా ఉన్న అప్పిరెడ్డి పరిస్థితి డోలాయ‌మానంలో పడిందని అంటున్నారు. మరి చివరికి ఏం జరుగుతుందనేది చూడాలి.