Begin typing your search above and press return to search.

గుంటూరు కోవెలమూడికే మొగ్గు.. అయినా తేడా కొడుతోందా.. ?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి ఉన్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవికి ప్రధాన పార్టీల అభ్యర్థులు బరిలో నువ్వా-నేనా అన్న‌ట్టుగా త‌ల‌ప‌డుతున్నారు.

By:  Garuda Media   |   31 Oct 2026 9:00 PM IST
గుంటూరు కోవెలమూడికే మొగ్గు.. అయినా తేడా కొడుతోందా.. ?
X

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి ఉన్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవికి ప్రధాన పార్టీల అభ్యర్థులు బరిలో నువ్వా-నేనా అన్న‌ట్టుగా త‌ల‌ప‌డుతున్నారు. కూటమి త‌ర‌ఫున టీడీపీ నేత‌, మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్నారు. ఆమె ఎన్నికల ప్రచారంలో భాగంగా గోరంట్ల వంటి పలు ప్రాంతాల్లో జోరుగా ప్రచారం నిర్వహించారు. మ‌రోవైపు.. సినీ ప్ర‌ముఖులు కూడా అప‌ర్ణ‌కు అనుకూలంగా ప్ర‌చారం చేస్తున్నారు. సోష‌ల్ మీడియాలో వారు ఆమెను స‌మ‌ర్థిస్తూ.. చేస్తున్న కామెంట్లు వైర‌ల్ అవుతున్నాయి.

ఇక‌, వైసీపీ త‌ర‌ఫున మేయ‌ర్ అభ్యర్థిగా పద్మశ్రీదేవి సీలింగ్ ఫ్యాన్ గుర్తుపై పోటీ చేస్తున్నారు. అయితే.. వీరితో పాటు మ‌రో 14 మంది అభ్యర్థులు మేయర్ స్థానానికి పోటీలో ఉన్నారు. నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ గ‌డువు త‌ర్వాత కూడా బుజ్జ‌గింపులు ప‌నిచేయ‌క‌పోవ‌డంతో నాయ‌కులు బ‌రిలో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఉన్న రాజ‌కీయ ప‌రిణామా లు.. వాతావ‌ర‌ణాన్ని గ‌మ‌నిస్తే.. కోవెల మూడి వైపే గెలుపు అవ‌కాశాలు ఉన్నాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. రాజ‌ధాని అమ‌రావ‌తి ప్రాంత అభివృద్ధి ఈ ఎన్నిక‌ల‌పై ప్ర‌ధానంగా ప‌డ‌నుంది అంటున్నారు.

ఇదేస‌మయంలో వ్య‌క్తిగ‌తంగా కూడా.. అప‌ర్ణ‌కు మంచి గ్రాఫ్ ఉండ‌డం కూడా క‌లిసి వ‌స్తోంది. న‌గ‌ర పాల‌క సంస్థ‌లో అవినీతి ర‌హితంగా సేవ‌లు అందిస్తాన‌ని.. ఆమె చెబుతున్నారు. వార్డుల్లోనూ క‌లియ‌ దిరుగుతున్నారు. అయితే.. ఇక్క‌డ ప్ర‌ధానంగా కూట‌మి పార్టీల నాయ‌కుల మ‌ధ్య స‌ఖ్య‌త లోపించింద‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. అప‌ర్ణ‌ను స‌మ‌ర్ధించేవారు ఆమె వెంట ఉండ‌గా.. మేయ‌ర్ పీఠాన్ని ఆశించిన మెజారిటీ నాయ‌కులు మాత్రం ప్ర‌చారానికి దూరంగా ఉంటున్నారు. ఈ ప‌రిణామాలు కూట‌మిలో చ‌ర్చ‌కు దారితీశాయి.

ఇక‌, వైసీపీలోనూ దాదాపు ఇదే ప‌రిస్థితి నెల‌కొంద‌ని అంటున్నారు. ప‌ద్మ‌శ్రీదేవి త‌ర‌ఫున ప్ర‌చారం చేసేందుకు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రావ‌డం లేద‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. గుంటూరు న‌గ‌రంలో బ‌ల‌మైన నాయ‌కుడిగా ఉన్న రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన మాజీ ఎంపీ ఒక‌రు ఆమె ఎంపిక‌ను గ‌తంలోనే త‌ప్పుబ‌ట్టారు. దీంతో ఆయ‌న‌కు చెందిన నాయ‌కులు ప్ర‌చారానికి దూరంగా ఉంటున్నారు. అయిన‌ప్ప‌టికీ.. పార్టీ త‌ర‌ఫున త‌న విజ‌యం ప‌క్కా అని ప‌ద్మ చెబుతున్నారు. ఏదేమైనా కోవెల‌మూడి వైపు మొగ్గు ఉంద‌ని అంటున్నా.. అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు త‌గ్గించుకుని వ‌చ్చే రెండు రోజులు దృష్టి పెడితే.. గెలుపు ఖాయ‌మ‌ని ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నారు.