అమరావతిలో మెగా రైల్వే స్టేషన్.. 24 ప్లాట్‌ఫారాలు, రోజుకు 3 లక్షల మంది ప్రయాణికులు!
అమరావతి రైల్వే కనెక్టివిటీ ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది. ఎర్రుపాలెం–అమరావతి–నంబూరు మధ్య 57 కి.మీ. రైల్వే లైన్ నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ మార్గంలో కృష్ణా నదిపై 3.38 కి.మీ. పొడవైన వంతెన నిర్మించనున్నారు. మరోవైపు తాడికొండ సమీపంలో 24 ప్లాట్‌ఫారాలు, నాలుగు టెర్మినళ్లతో భారీ రైల్వే స్టేషన్ నిర్మించే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అయితే ఈ స్టేషన్‌కు ఇంకా తుది ఆమోదం లభించాల్సి ఉంది.
By: Tupaki Political Desk | 13 Nov 2026 3:54 PM ISTరాజధాని అమరావతి రైల్వే కనెక్టివిటీ ప్రాజెక్టుకి కదలిక వచ్చింది. రాష్ట్రంలో ఇతర ప్రాంతాలతో రాజధానిని అనుసంధానించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిపాదించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం కోర్ క్యాపిటల్ ప్రాంతంలో రైల్వే లైన్లు, ఇతర మౌలిక సదుపాయాలు లేకపోవడంతో అమరావతి రైల్వే ప్రాజెక్టు ఇన్నాళ్లు ప్రతిపాదనలకే పరిమితమైంది. అయితే ఇటీవల రైల్వేశాఖతో జరిగిన సంప్రదింపులతో అమరావతి రైలు మార్గంపై తుది నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. కొద్దిపాటి మార్పులతో రైల్వే మార్గాన్ని ఖరారు చేశారని అంటున్నారు. ఇందులో భాగంగా రాజధాని ప్రాంతంలోని తాడికొండకు సమీపంలో కోర్ క్యాపిటల్ ప్రాంతంలో అమరావతి రైల్వేస్టేషన్ నిర్మించాలని నిర్ణయించారు. గతంలో రాజధాని కోసం 56.53 కి.మీ. మేర కొత్త రైల్వే లైను నిర్మించాలని భావించారు. అయితే తాజాగా చేసిన మార్పులతో 58.1 కి.మీ మేర రైల్వే మార్గం నిర్మాణానికి నిర్ణయించినట్లు చెబుతున్నారు.
తాడికొండకు 5 కిలోమీటర్ల దూరంలో కోర్ క్యాపిటల్ ప్రాంతంలో నిర్మించనున్న రైల్వేస్టేషన్ పై కీలక అప్డేట్ వచ్చింది. విమానాశ్రయ టెర్మినల్ తరహాలో అత్యంత ఆధునిక సదుపాయాలతో భారీ రైల్వేస్టేషన్ నిర్మించనున్నారని చెబుతున్నారు. ఇందులో సుమారు 24 ప్లాట్‌ఫారాలు, నాలుగు టెర్మినళ్లు ఉంటాయని చెబుతున్నారు. అంతేకాకుండా రోజుకు 3 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యంతో ఈ మెగా రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేయాలనే ప్రతిపాదిస్తున్నారు. ఈ ప్రతిపాదనకు తుది ఆమోదం లభిస్తే ప్రస్తుతం రాష్ట్రంలో అత్యధిక ప్లాట్‌ఫారాలు ఉన్న విజయవాడ, విశాఖపట్నం స్టేషన్లను దాటి అమరావతి ఆంధ్రప్రదేశ్‌లోనే అతిపెద్ద రైల్వే స్టేషన్‌గా నిలవనుందని చెబుతున్నారు.
రాజధాని ప్రాంతాన్ని ప్రధాన రైల్వే నెట్‌వర్క్‌తో అనుసంధానించేందుకు ఎర్రుపాలెం – అమరావతి – నంబూరు మధ్య 57 కిలోమీటర్ల సింగిల్ బ్రాడ్‌గేజ్ రైల్వే లైన్‌ను నిర్మిస్తున్నారు. 2024 అక్టోబర్ 24న కేంద్ర క్యాబినెట్ ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపినప్పుడు దీని ప్రారంభ అంచనా వ్యయాన్ని ₹2,245 కోట్లుగా పేర్కొన్నారు. ఆ తర్వాత 2025 ఆగస్టులో లోక్‌సభలో ఇచ్చిన అధికారిక సమాధానంలో ఈ ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయాన్ని ₹2,047 కోట్లుగా రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఈ 57 కిలోమీటర్ల మార్గంలో అమరావతి సహా మొత్తం తొమ్మిది కొత్త రైల్వే స్టేషన్లను నిర్మించాలని ప్రతిపాదించారు.
ఈ రైల్వే మార్గంలో కృష్ణా నదిపై నిర్మించబోయే భారీ వంతెన అత్యంత కీలకమైనది. గతంలో ఈ బ్రిడ్జి పొడవు 3.2 కిలోమీటర్లుగా ప్రచారంలో ఉన్నప్పటికీ, తాజా నివేదికల ప్రకారం కృష్ణా నదిపై సుమారు 3.38 కిలోమీటర్ల పొడవైన రైల్వే వంతెనను నిర్మించనున్నారు. కేవలం ఈ వంతెన, దాని అప్రోచ్ పనుల కోసమే రూ.565.83 కోట్ల అంచనా వ్యయాన్ని కేటాయించారు. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల మధ్య రైల్వే కనెక్టివిటీ మరింత బలోపేతం అవుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి ప్రధాన మెట్రో నగరాల నుంచి అమరావతికి నేరుగా రైల్వే కనెక్టివిటీ అందుబాటులోకి వస్తుంది. దీనివల్ల విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులకు ప్రయాణ సమయం, ఖర్చు ఆదా అవ్వడమే కాకుండా, అమరావతి పరిసర ప్రాంతాల్లో వాణిజ్య కార్యకలాపాలు, రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుని స్థానికులకు విస్తృత ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం చెబుతోంది.
భవిష్యత్తులో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అమరావతి ఒక ప్రధాన రైల్వే హబ్‌గా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.ప్రస్తుతం ఈ రైల్వే లైన్ ప్రాజెక్టు టెండర్ల దశలో ఉంది. 57 కిలోమీటర్ల మార్గాన్ని నాలుగు ప్యాకేజీలుగా విభజించి పనులు చేపట్టేందుకు రైల్వే శాఖ చర్యలు తీసుకుంటోంది. 2026 అక్టోబర్ నాటికి టెండర్ల ప్రక్రియ కొనసాగుతుండగా, చివరి ప్యాకేజీ బిడ్ల దాఖలుకు నవంబర్ 23 తుది గడువుగా నిర్ణయించారు. బిడ్ల పరిశీలన, ఖరారు ప్రక్రియ ముగిసిన తర్వాతే క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి.
కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తుండటంతో ఈ ప్రాజెక్టులో కదలిక వచ్చింది. కేంద్ర రైల్వే శాఖ నిధుల కేటాయింపు, సాంకేతిక అనుమతులు చూస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం వేగంగా భూసేకరణ పూర్తి చేసి అప్పగించాల్సి ఉంది. సాధారణంగా దేశంలో రైల్వే ప్రాజెక్టుల నిర్మాణం భూసేకరణ, నిధుల కొరత వంటి కారణాలతో నత్తనడకన సాగుతుంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చిత్తశుద్ధితోనే ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతాయని అంటున్నారు. ఎప్పటికప్పుడు అవసరమైన నిధులను విడుదల చేస్తూ, క్షేత్రస్థాయి అడ్డంకులను తొలగిస్తేనే ప్రాజెక్టు అనుకున్న సమయానికి పట్టాలెక్కుతుంది. అమరావతికి కొత్త రైల్వే లైన్ అందుబాటులోకి రావడం రాజధాని అభివృద్ధిలో కీలక అడుగుగా భావిస్తున్నారు. అయితే భారీ రైల్వే స్టేషన్ ప్రతిపాదనలు ఎప్పుడు ఆమోదం పొందుతాయి? నిర్మాణం ఎప్పుడు ప్రారంభమవుతుంది? ప్రయాణికులకు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుంది? అన్నది ఆసక్తికరంగా మారింది.
