Begin typing your search above and press return to search.

జనసేన ఎమ్మెల్యేలకు షాక్.. పవన్ నిర్ణయంపై ఉత్కంఠ

పరిషత్ ఎన్నికల్లో జనసేన ఎమ్మెల్యేలు గిడ్డి సత్యనారాయణ, బత్తుల బలరామకృష్ణ కుటుంబ సభ్యులకు ఓటమి ఎదురైంది. గిడ్డి సోదరుడు ఆనందరావు ముంగండ-1 ఎంపీటీసీగా, బత్తుల సతీమణి వెంకటలక్ష్మి సీతానగరం జడ్పీటీసీగా ఓడిపోయారు. ఈ ఫలితాలపై పార్టీ అధిష్టానం ఆరా తీస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

By:  Tupaki Political Desk   |   10 Nov 2026 12:34 AM IST
జనసేన ఎమ్మెల్యేలకు షాక్.. పవన్ నిర్ణయంపై ఉత్కంఠ
X

అసెంబ్లీ, మున్సిపల్ ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించిన జన సేన పార్టీ పరిషత్ ఎన్నికల్లో ఆ స్థాయిలో జోరు చూపలేకపోయిందన్న టాక్ నడుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కూటమికి సానుకూలంగా ఫలితాలు వచ్చినప్పటికీ, కొన్నిచోట్ల జనసేన పార్టీ ఎదురుదెబ్బలు తిన్నట్లుగా చెబుతున్నారు. ఇందులో ముఖ్యంగా జనసేన పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు తమ కుటుంబ సభ్యులను గెలిపించుకోలేక పోవడంపై పార్టీలో అంతర్గతంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితికి దారితీసిన కారణాలు ఏంటి? అన్న విషయమై పార్టీ అధిష్టానం ఆరా తీస్తున్నట్లుగా చెబుతున్నారు. దీంతో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణకు హైకమాండ్ నుంచి పిలుపు రావొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.

ఎంపీటీసీగా ఎమ్మెల్యే తమ్ముడు ఓటమి

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూటమి హవా నడిచింది. కానీ, జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న పి.గన్నవరం నియోజకవర్గంలో ఒక ఎంపీటీసీ స్థానంలో పార్టీ అభ్యర్థి ఓటమి వాడివేడి చర్చకు తెరలేపింది. పి.గన్నవరం మండలం ముంగండ-1 ఎంపీటీసీ స్థానం నుంచి పోటీ చేసిన జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సోదరుడు ఆనందరావు భారీ ఓట్ల తేడాతో ఓడిపోయారు. అదే సమయంలో ఎమ్మెల్యే స్వగ్రామమైన ఊడిమూడిలో కూడా వైసీపీ అభ్యర్థి 127 ఓట్ల తేడాతో విజయం సాధించాడు. ముంగండలో పోటీకి దిగిన ఎమ్మెల్యే సోదరుడు ఆనందరావుపై టీడీపీ రెబల్ అభ్యర్థి నక్కా వెంకటేశ్ పోటీ చేశారు. ఈయనకు 926 ఓట్లు రాగా, జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన ఎమ్మెల్యే తమ్ముడు ఆనందరావుకు కేవలం 294 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఈ ఫలితం హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే సొంత ఊరితోపాటు తోడబుట్టిన తమ్ముడిని గెలిపించుకోలేకపోయారని ఆయన ప్రత్యర్థులు వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టారు.

రాజానగరంలో ఎమ్మెల్యేకి తలవంపులు

రాజకీయాల్లో గెలుపోటములు సహజం. విజయం ఎవరిని వరిస్తుందో ఊహించడం కష్టం. కానీ, తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలోని సీతానగరం జడ్పీటీసీగా పోటీ చేసిన జనసేన అభ్యర్థిని వెంకటలక్ష్మి ఓటమి పాలవ్వడం మాత్రం ఆ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సతీమణి అయిన వెంకటలక్ష్మి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మను అభ్యర్థిగా పోటీకి దిగారు. అయితే అనూహ్య రీతిలో వెంకటలక్ష్మి ఓడిపోవడం ఎమ్మెల్యే తలెత్తుకోలేకుండా చేసిందని అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కూటమి పార్టీలు విజయదుందిబి మోగిస్తే ఎమ్మెల్యే సతీమణిని గెలిపించుకోలేకపోవడంపై పార్టీలో అంతర్గతంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయని అంటున్నారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే స్వగ్రామం గాదరాడలో వైసీపీ ఒక స్థానాన్ని కైవసం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే పనితీరు సరిగా లేకపోవడం వల్లే ఈ ఫలితాలు వచ్చాయని ఆయన ప్రత్యర్థులు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారని చెబుతున్నారు.

పవన్ నిర్ణయంపై టెన్షన్

ఇక స్థానిక ఎన్నికల్లో ఎమ్మెల్యేల కుటుంబ సభ్యుల ఓటమిపై జనసేన పార్టీ హైకమాండ్ సీరియస్ గా ఉందన్న ప్రచారం హీట్ ఎక్కిస్తోంది. ముఖ్యంగా ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉంటే ఈ ఫలితాలు వచ్చేవి కావని అధినేత పవన్ అభిప్రాయపడినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో చేదు ఫలితాలు ఎదుర్కొన్న ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నారని చెబుతున్నారు. ఈ విషయంలో పార్టీ అధినేత ఆగ్రహాన్ని చల్లార్చే మార్గాలను వారు అన్వేషిస్తున్నారని అంటున్నారు. అయితే ఇప్పటివరకు ఈ విషయమై పార్టీ అధినేత పవన్ నిర్ణయం ఏంటన్నది స్పష్టత లేకపోవడంపై పార్టీ నేతలు కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.