సర్పంచ్ పదవికి రూ.కోటిన్నర.. ఎకరం పొలం.. పల్లెల్లో మొదలైన సందడి
ఏపీలో పంచాయతీ ఎన్నికల వేళ సర్పంచ్ పదవుల ఏకగ్రీవం కోసం భారీ ఆఫర్లు తెరపైకి వస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా దుళ్ల గ్రామంలో ఒకరు రూ.కోటి, మరో ఎంబీబీఎస్ విద్యార్థిని రూ.1.50 కోట్లు ఇస్తామని ప్రకటించారు. పశ్చిమగోదావరి జిల్లా తూర్పుతాళ్లులో రూ.50 లక్షలు, ఎకరం భూమి ఇస్తామని ఆశావహులు ముందుకొచ్చారు. ఈ ఆఫర్లు గ్రామాల్లో చర్చకు దారితీశాయి.
By: Tupaki Political Desk | 12 Nov 2026 5:11 PM ISTఏపీ గ్రామ పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. పల్లెల్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. తొలి దశ ఎన్నికలకు 13వ తేదీ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో సర్పంచ్ పదవుల కోసం ఏకగ్రీవాల పర్వానికి తెరలేచిందని చెబుతున్నారు. ఎన్నికల వల్ల గ్రామంలో అనవసరమైన గొడవలు, విభేదాలు తలెత్తకుండా ప్రశాంత వాతావరణం ఉండాలనే ఉద్దేశంతో గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని ఏకగ్రీవాల కోసం ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. దీంతో ఆశావహులు గ్రామాభివృద్ధి పేరుతో కోట్ల రూపాయల విరాళాలు, భూములు ఇస్తామని ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తుండటం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ ఏకగ్రీవాల హవా, ఆఫర్ల పోటీ ఆసక్తికరంగా సాగుతోంది. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దుళ్ల గ్రామంలో తనను సర్పంచ్‌గా ఏకగ్రీవం చేస్తే గ్రామాభివృద్ధికి ఏకంగా రూ.కోటి విరాళం ఇస్తానని ఓ వ్యక్తి ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన వెంటనే అదే గ్రామానికి చెందిన ఓ ఎంబీబీఎస్ విద్యార్థిని రంగంలోకి దిగి, తనను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే రూ. 1.50 కోట్లు ఇస్తానని చెప్పడం స్థానికంగా సంచలనం రేపింది. ఒకరిని మించి మరొకరు భారీ మొత్తాలను ప్రకటించడంతో గ్రామంలో ఏకగ్రీవ అంశం హాట్ టాపిక్‌గా మారింది.
పశ్చిమగోదావరి జిల్లాలోనూ ఇదే తరహా పోటీ నెలకొంది. నరసాపురం మండలం తూర్పుతాళ్లు గ్రామంలో సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేసేందుకు గ్రామ పెద్దలు పార్టీలకు అతీతంగా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో ఆశావహుల నుంచి అభివృద్ధి హామీలను ఆరా తీయగా, ఒకరు గ్రామాభివృద్ధి కోసం రూ. 50 లక్షలు ఇస్తానని ముందుకు రాగా, మరొకరు ఏకంగా ఒక ఎకరం పొలం రాసిస్తానని బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఇద్దరు అభ్యర్థులు భారీ హామీలు ఇవ్వడంతో, నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎవరిని ఏకగ్రీవం చేయాలనే దానిపై తుది నిర్ణయం తీసుకుందామని గ్రామ పెద్దలు స్పష్టం చేశారు.
కేవలం గోదావరి జిల్లాల్లోనే కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఏకగ్రీవాల కోసం రచ్చబండ సమావేశాలు, వేలం పాటలు జోరుగా సాగుతున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా సత్యవేడు మండలంలోని ఓ గ్రామ పంచాయతీలో సర్పంచ్ పదవి కోసం గ్రామ పెద్దల సమక్షంలో బహిరంగ వేలం నిర్వహించారు. ఈ వేలంలో పోటీ పెరిగి పాట రూ. 15 లక్షల వరకు చేరడంతో, వివాదాలు తలెత్తే అవకాశం ఉందని భావించిన గ్రామ పెద్దలు వెంటనే ఆ వేలాన్ని నిలిపివేశారు. మరోవైపు కడియం మండలంలోని మరో గ్రామంలోనూ ఓ ఆశావహుడు తనను ఏకగ్రీవం చేస్తే పెద్దల సమక్షంలో రూ. కోటి నగదు ఇస్తానంటూ సెల్ఫీ వీడియో విడుదల చేయడం గమనార్హం.
రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం ఈ నెల 26, 29, డిసెంబర్ 2 తేదీల్లో మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. నామినేషన్ల దాఖలుకు ముందే ఈ స్థాయిలో 'కోట్ల' బేరసారాలు, వేలం పాటలు తెరపైకి రావడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామాభివృద్ధికి నిధులు సమకూరుతాయని కొందరు సమర్థిస్తుంటే, ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికలు ధనబలంతో ఏకగ్రీవం కావడం సరైనది కాదని మరికొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నామినేషన్ల ఘట్టం ముగిసేనాటికి ఎన్ని గ్రామాలు ఏకగ్రీవమవుతాయో, ఎన్నికల సంఘం ఈ వేలం పాటలపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సివుందని అంటున్నారు.
