కోస్తా మీద పడగ విప్పనున్న అక్వాన్
బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుపాను తీవ్ర తుపానుగా, ఆ తర్వాత అతి తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నెల 20న నెల్లూరు–తుని మధ్య యానాం సమీపంలో తీరం దాటవచ్చని అంచనా. తీరం దాటే సమయంలో గంటకు 120–130 కి.మీ., గరిష్ఠంగా 145 కి.మీ. వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉంది. 19, 20 తేదీల్లో కోస్తాంధ్ర, యానాంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.
By: Satya P | 17 Nov 2026 1:00 AM ISTఏపీకి మరోసారి తుఫాను గండం ఏర్పడింది. ఈ తుఫాన్ అరవీర భయంకర రూపం దాలుస్తూ జల ఖడ్గంతో విరుచుకు పడేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. దీంతో కోస్తా ప్రాంతం మీదనే ఈ తుఫాన్ తాకిడి బీభత్సంగా ఉండబోతోంది అని వాతావరణ శాఖ అంచనాలు ఉన్నాయి. బంగాళా ఖాతంలో ఏర్పడిన ఈ తుఫాను ఇపుడు ఉగ్ర రూపం దాలుస్తూ పడగ విప్పనుంది అని అంటున్నారు.
అక్వాన్ తో అతలాకుతలం :
ఇదిలా ఉంటే బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడిందని దీనికి ‘అక్వాన్’గా నామకరణం చేసినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. సోమవారం రాత్రికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం తుఫాను గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని తెలిపారు. మంగళవారం సాయంత్రానికి తీవ్ర తుపానుగా ఇది మారుతుందని, గురువారం ఉదయానికి అతి తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ప్రస్తుతం చెన్నైకి 610 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 660 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 670 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 790 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉందని తెలుస్తోంది. పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్న అక్వాన్ తుపాను శుక్రవారం మధ్యాహ్నానికి నెల్లూరు తుని మధ్య తీరం దాటే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక తీరం దాటే సమయంలో గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో, గరిష్ఠంగా 145 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన :
ఇక అక్వాన్ తుపాను ప్రభావంతో ఎల్లుండి నుంచి కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. గురు, శుక్రవారాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని పేర్కొన్నారు. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. ప్రజలు, రైతులు తుపాను ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తీరం దాటేది ఎక్కడ
ఇవన్నీ పక్కన పెడితే తుఫాన్ ఎక్కడ తీరం దాటుంది అన్నదే ఇప్పుడు అందరికీ కలవరపెడుతోంది. ఎందుకంటే తీరం దాటే సమయంలో అక్వాన్ విద్వంశం సృష్టిస్తుంది అని అంటున్నారు. అక్వాన్ అత్యంత తీవ్ర తుఫాన్‌గా మారి 20వ తేదీ నెల్లూరు–తుని మధ్య యానాం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. దాంతో అక్వాన్ తీవ్ర ప్రభావం తో బాపట్ల, మచిలీపట్నం ప్రాంతాలకు పెను ముప్పు పొంచి ఉండే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అదే ఇధంగా ఈ నెల 19, 20 రెండు రోజులు మాత్రం కోస్తాంధ్ర, యానాంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలతో అతలాకుతలం అవుతుందని అలాగే ఈ తుఫాను ప్రభావంతో రాయలసీమలో భారీ వర్షాలు ఉంటాయని చెబుతున్నారు. .
