Begin typing your search above and press return to search.

జ‌న‌సేన‌లో బాలరాజు గోల‌.. మార్పు త‌ప్ప‌దు స‌ర్‌!

పోలవరం ఎమ్మెల్యే, జనసేన నేత చిర్రి బాలరాజుకు సొంత గ్రామంతో పాటు మరో పంచాయతీలోనూ ఎదురుదెబ్బ తగిలింది. ఆయన మద్దతుతో పోటీ చేసిన సుమాంజలి, భారతి సర్పంచ్ అభ్యర్థులుగా ఓటమి పాలయ్యారు. సొంత పార్టీ నేతల అసంతృప్తి, కేడర్ దూరం కావడమే ఓటమికి కారణాలుగా చర్చ జరుగుతోంది. దీంతో బాలరాజు తన రాజకీయ గ్రాఫ్‌ను పెంచుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

By:  Garuda Media   |   29 Nov 2026 7:58 AM IST
జ‌న‌సేన‌లో బాలరాజు గోల‌.. మార్పు త‌ప్ప‌దు స‌ర్‌!
X

పోల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్న జ‌న‌సేన నాయ‌కుడు చిర్రి బాల‌రాజు గ్రాఫ్ మ‌రింత త‌గ్గిందా? సొంత గ్రామంలోనే ఆయ‌న‌కు ఎదురీత మొద‌లైందా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. పార్టీ ప‌రంగా కేడ‌ర్‌కు ఇప్ప‌టికే దూర‌మైన ఆయ‌న‌.. వ్య‌క్తిగ‌త ఇమేజ్‌ను కూడా కాపాడుకోలేక పోతున్నార‌ని అంటున్నారు. తాజాగా జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో స్వ‌యంగా బాల‌రాజు మ‌ద్ద‌తు ఇచ్చి.. ప్ర‌చారం కూడా నిర్వ‌హించిన ఇద్ద‌రు స‌ర్పంచ్ అభ్య‌ర్థులు ఓడిపోయారు.

వీరిలో ఒక‌రు బాల‌రాజు సొంత గ్రామం బ‌ర్రింక‌ల‌పాడు కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. ఇక్క‌డ నుంచి పోటీ చేసిన సుమాంజ‌లి అనే మ‌హిళకు ఎమ్మెల్యే అన్నీతానై ప్ర‌చారం చేశారు. కొంత మేర‌కు సొమ్ములు కూడా ఖ‌ర్చు చేసిన‌ట్టు తెలిసింది. అయిన‌ప్ప‌టికీ.. ఆమె విజ‌యం ద‌క్కించుకోలేక పోయారు. సుమారు 86 ఓట్ల తేడాతో ఆమె ఓడిపోయారు. ఇక‌, ఎమ్మెల్యే స్వ‌యంగా నిల‌బెట్టి ప్ర‌చారం కూడా చేసిన మేజ‌య్ ప‌రంచాయ‌తీ ప‌రింపూడిలోనూ .. ఓట‌మి ఎదురైంది. ఇక్క‌డ నుంచి భార‌తి అనే మ‌హిళ‌కు ఎమ్మెల్యే మ‌ద్ద‌తు ప‌లికారు.

కానీ, రెండు చోట్లా ఎదురు గాలి వీచింది. నిజానికి ఎమ్మెల్యే మ‌ద్ద‌తు ఉంద‌ని ఇద్దరు మ‌హిళ‌లు సొంత ఆస్తులు కొంత అమ్మేసి రంగంలోకి దిగార‌ని తెలుస్తోంది. ఎమ్మెల్యే త‌మ‌కు అండ‌గా ఉన్నార‌ని.. గెలుపు గుర్రం ఎక్క‌డం ఖాయ‌మ‌ని అనుకున్నారు. కానీ, అనూహ్య‌మైన ప‌రాజ‌యం వారిని వెంటాడింది. ఇక‌, ఈ ఓట‌మికి కార‌ణాలపై ఎమ్మెల్యే అన్వేష‌ణ ప్రారంభించారు. ఆయ‌న‌ను వ్య‌తిరేకిస్తున్న సొంత పార్టీ నాయ‌కులు, దూర‌మైన కేడ‌ర్ వంటివి ప్ర‌ధాన కార‌ణాలుగా గుర్తించారు.

అసెంబ్లీ ఎన్నిక‌ల‌పైనా ఈ ప‌రాజ‌యం ప్ర‌భావం చూపించే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లోనూ పోల‌వ‌రంలో వైసీపీ పుంజుకుంది. దీనిపై స‌మీక్ష చేసిన జ‌న‌సేన‌ పార్టీ ఎమ్మెల్యేకు దాదాపు ప్రాధాన్యం త‌గ్గించింది. ఇదేస‌మ‌యంలో కేడ‌ర్‌కు అవ‌కాశం ఇచ్చింది. దీంతో కేడ‌ర్‌బ‌లంగా ప‌నిచేసిన కొన్ని గ్రామాల్లో పార్టీ పుంజుకుంది. ఉదాహ‌ర‌ణ‌కు ప‌రింపూడి పంచాయ‌తీలో వనజలక్ష్మి జనసేన నాయకురాలే అయినా.. స్వ‌తంత్రంగా పోటీ చేశారు. ఆమెకు కేడ‌ర్ అండ‌గా నిలిచి.. విజ‌యం వరించేలా చేశారు. సో.. మొత్తంగా ఎమ్మెల్యే గ్రాఫ్ ప‌డిపోయింద‌న్న విష‌యం ఇప్ప‌టికైనా బాల‌రాజు గ్ర‌హించాల‌ని.. మున్ముందు స‌రిచేసుకునే ప్ర‌య‌త్నం చేయాల‌ని నాయ‌కులు చెబుతున్నారు.